లక్నో/ముంబై: యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమితో దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 20 ఏళ్లకు పైగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీలు ఏకమై సాధించిన ఈ ఫలితాలతో బీజేపీ వ్యతిరేక బలమైన కూటమి నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉద్ఘాటించారు.
తాజా ఓటమితో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. బీఎస్పీతో కలిసి ముందుకెళ్లేందుకు సిద్ధమేనని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంకేతాలిచ్చారు. గతాన్ని మరిచిపోయి (బీఎస్పీ, ఎస్పీ మధ్య వైరం, కాంగ్రెస్ విమర్శలు).. బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధమేనని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌తో ఇప్పటికీ సత్సంబంధాలే ఉన్నాయని అఖిలేశ్ తెలిపారు. కాగా విపక్షాలను ఏకం చేసేందుకు రాహుల్ ఒక్కోపార్టీ నేతతో వ్యక్తిగతంగా సమావేశమవుతున్నారు. దీంతో 2019లో పోటీ బీజేపీ వర్సెస్ విపక్ష కూటమిగా ఎన్నికల పోరు జరగనుంది.
బీజేపీకి నిద్ర పట్టదు: మాయావతి
చండీగఢ్‌లో నిర్వహించిన ర్యాలీలో మాయావతి మాట్లాడుతూ.. బీజేపీని ఓడించేందుకు ఎస్పీ సభ్యులకు బీఎస్పీ మద్దతిచ్చిందని పేర్కొన్నారు. అందుకే.. వారి కంచుకోటలో బీజేపీని ఘోరంగా ఓడించామన్నారు. మోదీకి సరైన గుణపాఠం చెప్పేందుకే ఎస్పీతో చేయి కలిపామని ఆమె తెలిపారు.
ఈ దెబ్బకు నిద్రకరువైన బీజేపీ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఎక్కువ ఆలస్యం చేస్తే మరింత ముప్పుతప్పదని బీజేపీకి ఇప్పటికే అర్థమై ఉంటుందని మాయావతి ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు 1975నాటి ఎమర్జెన్సీని గుర్తుచేస్తున్నాయని మాయావతి విమర్శించారు.
గతం గతః: అఖిలేశ్.. కాంగ్రెస్‌తో ఈ ఎన్నికల వరకు పొత్తులేకున్నా.. ఆ పార్టీతో సత్సంబంధాలే ఉన్నాయని అఖిలేశ్ ప్రకటించారు. ‘సమాజ్‌వాదీలు అందరినీ గౌరవిస్తారు. అందుకే మాకు అన్ని పార్టీలతో సత్సంబంధాలున్నాయి. ప్రజలు పాత ఘటనలను (బీఎస్పీతో విభేదాలు, ప్రచారంలో కాంగ్రెస్ విమర్శలు) గుర్తుచేసుకున్నారు. కానీ కొన్నిసార్లు గతాన్ని మరిచిపోవటమే మంచిది. దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు మార్గాలను అన్వేషిస్తున్నాం’ అని అఖిలేశ్ పేర్కొన్నారు.
బీజేపీ మునుగుతున్న నావ: పట్నాయక్
ఈ ఫలితాలు విపక్ష కూటమిని బలోపేతం చేస్తాయని బీజేపీ మిత్రపక్షమైన శివసేన అభిప్రాయపడింది. విపక్షాల ఐక్యకూటమి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించగలదని ఎన్సీపీ తెలిపింది. ‘బీజేపీ చాలా వేగంగా మునుగుతున్న నావ’ అని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.
రాహుల్–పవార్ భేటీ: ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముంబైలో బుధవారం రాత్రి సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో మోదీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరూ చర్చించారు. తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ రాహుల్ సమావేశం కానున్నారు.
కాంగ్రెస్‌లో గుబులు!
యూపీ ఎన్నికల ఫలితాలతో విపక్ష కూటమి బలోపేతం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నప్పటికీ.. లోలోపల హస్తం పార్టీ గుండెల్లో గుబులు రేగుతోంది. ఎందుకంటే.. యూపీలో కాంగ్రెస్ పోటీచేసిన రెండుచోట్లా డిపాజిట్ కూడా దక్కలేదు. ఒకవైపు, బీజేపీపై కాంగ్రెస్ సమరశంఖం పూరిస్తూనే.. మరోవైపు తన బలాన్ని పెంచుకోలేక విఫలమవుతున్న నేపథ్యంలో.. ప్రాంతీయ పార్టీలు బలపడే అవకాశం ఉంది.
ఒకవేళ 2019కి ముందు జరగనున్న ఎన్నికల్లో (కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్).. కాంగ్రెస్ విజయం సాధించలేని పక్షంలో.. విపక్షాల ఐక్యకూటమి బలహీనపడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్పీ–బీఎస్పీ కూటమి గెలవటం బీజేపీ కన్నా కాంగ్రెస్‌కే బలమైన సవాలంటున్నారు. ‘ప్రాంతీయ పార్టీలు కూడా తాము బలపడాలనుకుంటాయి.
కానీ.. కాంగ్రెస్‌కు ఎందుకు ఎక్కువసీట్లు ఇవ్వాలనుకుంటాయి. అలాంటప్పుడు, యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలో 5–6 కన్నా ఎక్కువ సీట్లలో పోటీచేసే అవకాశం మాకు ఉండకపోవచ్చు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించటం ఆ పార్టీలో అంతర్గతంగా నెలకొన్న ఆందోళనకు అద్దంపడుతోంది. పెద్దరాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ కన్నా కొత్తకూటమిలో ఉంటాయని భావిస్తున్న ప్రాంతీయపార్టీలే బలంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment