ఇంతకీ పీఈటీఎన్‌ ఏమిటి? | what is petn? | Sakshi
Sakshi News home page

ఇంతకీ పీఈటీఎన్‌ ఏమిటి?

Published Fri, Jul 14 2017 8:45 PM | Last Updated on Sat, Aug 25 2018 4:30 PM

ఇంతకీ పీఈటీఎన్‌ ఏమిటి? - Sakshi

ఇంతకీ పీఈటీఎన్‌ ఏమిటి?

పెంటాఎరిథ్రిటాల్‌ టెట్రానైట్రేట్‌ (పీఈటీఎన్‌) అత్యంత శక్తిమంతమైన ప్లాసిక్‌ పేలుడు పదార్థం. నైట్రోగ్లిసరిన్‌ తరహా రసాయనిక మిశ్రమం. పౌడర్‌ రూపంలో, స్పటికాకృతిలో లేదా సన్నని ప్లాస్టిక్‌ షీట్‌ రూపంలో ఉంటుంది. రంగేమీ ఉండదు. వేడిని పుట్టించడం ద్వారా (బ్లాస్టింగ్‌ క్యాప్‌ ద్వారా... సన్నటి అల్యూమినియం లేదా రాగి గొట్టానికి వైర్లతో కనెక్ట్‌ చేసి బ్యాటరీ ద్వారా వేడి చేస్తారు), షాక్‌వేవ్‌ ద్వారా దీన్ని పేల్చవచ్చు. నేరుగా నిప్పు పెట్టి పేల్చడం కుదరదు.. పీఈటీఎన్‌ అమ్మకాలపై చాలాదేశాల్లో కఠిన ఆంక్షలున్నాయి. బ్లాక్‌మార్కెట్‌లో దొరుకుతుంది. గనుల్లో పేలుళ్లకు వాడతారు. ఆర్మీ కూడా వినియోగిస్తుంది.

తీవ్రత ఎక్కువ...
పీఈటీఎన్‌ పేలుడు తీవ్రత అధికంగా ఉంటుంది. అందుకే అధిక జననష్టాన్ని కోరుకునే ఉగ్రవాదులు పేలుళ్లకు దీన్ని ఎంచుకుంటారు. రవాణా, నిలువ చేయడం తేలిక, సురక్షితం కూడా. పేల్చినపుడు మాత్రం భీకరమైన శక్తి వెలువడుతుంది. తక్కువ మోతాదుతో పెనునష్టం కలిగించవచ్చు. 100 గ్రాముల పీఈటీఎన్‌తో ఒక కారును తునాతునకలు చేయవచ్చు. యూపీ అసెంబ్లీలో 150 గ్రాముల పీఈటీఎన్‌ దొరికింది. అసెంబ్లీ భవనాన్ని మొత్తాన్ని పేల్చడానికి 500 గ్రాముల పీఈటీఎన్‌ చాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ శుక్రవారం సభలో చెప్పారు. 1894లో జర్మనీ పేలుడు పదార్థాల ఉత్పత్తి సంస్థ స్ప్రెంగ్‌స్టోఫ్‌ మొదటిసారిగా దీన్ని ఉత్పత్తి చేసి పేటెంట్‌ పొందింది. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత వాణిజ్యస్థాయిలో వినియోగంలోకి వచ్చింది.

పట్టుకోవడం కష్టం...
పీఈటీఎన్‌ సాధారణ ఎక్స్‌రే స్కానర్లకు, మెటల్‌ డిటెక్టర్లకు దొరకదు. పైగా ప్లాస్టిక్‌ షీట్‌ రూపంలో ఉన్నపుడు దీన్ని ఏ ఆకృతిలోకైనా మార్చవచ్చు. అనుమానం రాకుండా ఏదైనా వస్తువులో దాయొచ్చు. శరీరానికి అతికించేయొచ్చు. అయితే దీన్ని పేల్చడానికి వాడే వైరింగ్, బ్యాటరీలాంటి వాటితో దొరికిపోతారు. ఎలట్రికల్‌ వస్తువుల్లో దాస్తే మాత్రం పట్టుకోవడం కష్టం. అందుకే విమానాశ్రయాల్లో తనిఖీలను దాటుకొని వెళుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే వాణిజ్య తయారీ సంస్థలు పీఈటీఎన్‌ను గుర్తించేందుకు వీలుగా దాంట్లో కొన్ని పదార్థాలను కలుపుతున్నాయి. తద్వారా వాసనను పసిగట్టడానికి వీలవుతోంది. కొంచెం రసాయన శాస్త్ర పరిజ్ఞానంతో మార్కెట్లో సులువుగా దొరికే పదార్థాలను కొని పీఈటీఎన్‌ను తయారు చేస్తున్నారు. దీన్ని పట్టుకోవడం కష్టం.

విమానాల్లో రెండు యత్నాలు...
2001లో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని కూల్చడానికి బ్రిటన్‌కు చెందిన రిచర్డ్‌ రీడ్‌ విఫలయత్నం చేశాడు. బూట్లలో పెంటాఎరిథ్రిటాల్‌ టెట్రానైట్రేట్‌ను దాచి విమానం ఎక్కాడు. పేలకపోవడంతో చేత్తో అంటించే ప్రయత్నం చేశాడు. తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది అతనికి పైకి లంఘించి కట్టేశారు. 183 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఆ సమయంలో విమానంలో ఉన్నారు. రీడ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. తర్వాత 2009 క్రిస్మస్‌ పర్వదినాన డెట్రాయిట్‌కు వెళుతున్న నార్త్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని పీఈటీఎన్‌తో పేల్చడానికి ఉమర్‌ ఫరూక్‌ అబ్దుల్‌ ముతల్లాబ్‌ విఫలయత్నం చేశాడు. లోదుస్తుల్లో దాచిన పీఈటీఎన్‌ను పేల్చడానికి ఉమర్‌ సిరంజితో ఎవో రసాయానాలను అందులోకి జొప్పించాడు. బాంబు పేలలేదు కాని అతని తొడ భాగం కాలిపోయింది. 2011లో ఢిల్లీ హైకోర్టులో జరిగిన పేలుడుకు కూడా పీఈటీఎన్‌ వాడినట్లు వార్తలొచ్చాయి. ఈ పేలుడులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement