'దావూద్ తో మోదీ భేటీ'పై రగడ
లక్నో: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను ప్రధాని మోదీ కలిశారన్న యూపీ మంత్రి అజాం ఖాన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది.
డాన్ తో ప్రధాని భేటీ నిజమని నిరూపించాలని, లేదంటే ఆజాం ఖాన్ ను వెంటనే మంత్రి పదవినుంచి తొలిగించాలని యూపీ బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్.. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ను డిమాండ్ చేశారు. మంగళవారం లక్నోలో మీడియాతో మాట్లాడిన పాఠక్.. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మంత్రి ఆజం ఖాన్ ను సమాజ్ వాదీ పార్టీ అధినాయకత్వం వెనకేసుకురావటం విడ్డూరంగా ఉందన్నారు.
గతేడాది చివర్లో అకస్మాత్తుగా లాహోర్ (పాకిస్థాన్) వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. నవాజ్ షరీఫ్ నివాసంలోనే మాఫియా డాన్ దావూద్ ను కలుసుకున్నారని మంత్రి ఆజం ఖాన్ రెండు రోజుల కిందట సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓసారి ములాయం పుట్టినరోజు వేడుకలకు దావూద్ డబ్బు పంపినట్లు ఆజాం చెప్పిన మాటలను ఉటంకించిన బీజేపీ యూపీ చీఫ్.. పిచ్చివాగుళ్లు కట్టిపెట్టాలని ఘాటుగా హెచ్చరించారు.