
న్యూఢిల్లీ: ఆధార్ గోప్యత మరోసారి చర్చనీయాంశమైంది. రూ. 500లకే ఆధార్ వివరాల్ని సంపాదించామని ‘ట్రిబ్యూన్’ పత్రిక కథనంతో బయోమెట్రిక్ వివరాల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఏజెంట్‌కు డబ్బిచ్చి ఆధార్ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి సంపాదించామని ట్రిబ్యూన్ పత్రిక బయటపెట్టింది. డబ్బిస్తే ఆధార్ వివరాల్ని బహిర్గతం చేస్తామని ఆ ఏజెంట్ వాట్సాప్ గ్రూపుల్లో ప్రకటన ఇస్తున్నారని కూడా ఆరోపించింది. ఆధార్ నిర్వహణ సంస్థ యూఐడీఏఐ మాత్రం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఆధార్‌లో సవరణల కోసం అందుబాటులో ఉన్న వ్యవస్థను దుర్వినియోగం చేశారని, పరిమిత సమాచారాన్ని మాత్రమే తెలుసుకోగలిగారని వివరణ ఇచ్చింది.
లాగిన్ వివరాలు ఉంటే ఆధార్ డేటా బేస్‌లోకి చొరబడి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సులభంగా పొందవచ్చని ట్రిబ్యూన్ పత్రిక తన కథనంలో పేర్కొంది. లాగిన్ వివరాలు ఉంటే డేటాబేస్‌ను పొందేందుకు ఆధార్ వెబ్‌సైట్‌లో ఒక వెసులుబాటు ఉందని తెలిపింది. అలా వ్యక్తుల పేర్లు, చిరునామా, ఈ–మెయిల్ అడ్రస్, ఫోటోలు, ఫోన్ నెంబర్లు సంపాదించామని పేర్కొంది. నకిలీ ఆధార్‌కార్డుల తయారీకి ఓ సాఫ్ట్‌వేర్‌ను ఏజెంట్ అమ్ముతున్నాడంటూ పలు అంశాల్ని బహిర్గతం చేసింది. అధీకృత అధికారులే ఆధార్ పోర్టల్‌లోకి ప్రవేశించగలరని యూఐడీఏఐ సీఈఓ అజయ్ భూషణ్ చెప్పారు. బ్యాంక్ ఖాతా నెంబర్ తెలిసినంత మాత్రాన సదరు ఖాతాదారుడికి నష్టం జరగదన్నారు. వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ సమాచారాన్ని సైట్ నుంచి పొందలేరన్నారు. ఆధార్ డేటా సురక్షితంగా ఉందని, ఎవరూ దొంగిలించలేదని చెప్పారు. కార్డుల్లో తప్పుల సవరణ విధానాన్ని దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆధార్ లీకేజీపై పలు ఆరోపణలు
ఆధార్‌లో నమోదైన వ్యక్తిగత వివరాలకు భద్రత లేదంటూ ఇప్పటికే ఆందోళనలు కొనసాగుతున్నాయి. సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, మొబైల్ కనెక్షన్లకు ఆధార్ ముడిపెట్టడంపై న్యాయస్థానాల్లో కేసులు ఉన్నాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రన్న బీమా, ఉపాధి హామీ చట్టం పరిధిలోని ఆన్‌లైన్ చెల్లింపుల విభాగానికి సంబంధించి మొత్తం నాలుగు వెబ్ పోర్టల్స్ నుంచి 13 కోట్ల మంది పౌరుల ఆధార్ సమాచారం, వ్యక్తిగత వివరాలు బట్టబయలయ్యాయని గత మేలో సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ నివేదిక పేర్కొంది. అలాగే దాదాపు 10 కోట్ల మంది బ్యాంకు ఖాతాల వివరాలు లీకైనట్లు తెలిపింది. ఇంతవరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 210 వెబ్‌సైట్ల నుంచి పెద్దసంఖ్యలో ఆధార్ వివరాలు బహిర్గతమయ్యాయని సమాచారహక్కు చట్టం ద్వారా ఇటీవల ఒక వార్తాసంస్థ బట్టబయలు చేసింది. ఈ వివరాలు బయటకు రావడంతో.. డేటాను ఆయా వెబ్‌సైట్ల నుంచి యూఐడీఏఐ తొలగించింది. ఆ వివరాల్ని తాము బయటపెట్టలేదని ఆ సంస్థ వివరణ ఇచ్చింది.
డిజిటలైజ్ చేస్తే సురక్షితం: నిపుణులు
పెద్దమొత్తంలో ప్రజల వివరాలు, సమాచారాన్ని ప్రభుత్వం ఒకేచోట భద్రపరచడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధార్ డేటాబేస్ ఎంతవరకూ సురక్షితం అన్నది స్పష్టం కాలేదని, అందువల్ల ఆధార్ వివరాలను సంపాదించే అవకాశాలున్నాయని సుప్రీంకోర్టు న్యాయవాది, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు పవన్ దుగ్గల్ పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ కోసం మరిన్ని పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఆధార్ వివరాల్ని డిజిటలైజ్ చేస్తే ఈ సమస్యను అధిగమించవచ్చని భద్రతా పరిశోధకుడు ట్రాయ్ హంట్ సూచించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం, రికార్డులు తమ వద్ద ఉండాలని ప్రభుత్వాలు కోరడం పరిపాటని, ఎన్ని చట్టాలున్నా ఈ వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువని ప్రముఖ సాఫ్ట్‌వేర్ నిపుణుడు ఎడ్వర్డ్ స్నోడెన్ ట్వీట్‌చేశారు.