ఆధార్ వివరాల లీకేజీ నిజమే
సుప్రీం కోర్టులో కేంద్రం అంగీకారం
న్యూఢిల్లీ: ఆధార్ కార్డుదారుల వివరాలు లీకైన మాట నిజనమేనని, అయితే ఉడాయ్ నుంచి లీక్ కాలేదని కేంద్రం ప్రభుత్వం సుప్రీం కోర్టుకు బుధవారం తెలిపింది. ‘వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల నుంచి వివరాలు లీక్ అయ్యాయి. కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు. హనుమంతుడి పేరుతో, కుక్కల పేరుతో కార్డులు జారీ అయినప్పటికీ, యూఐడీ ఇప్పటికీ కచ్చితమైన బయోమెట్రిక్ వ్యవస్థే’ అని ప్రభుత్వ న్యాయవాది ఆర్ఘ్య సేన్ గుప్తా తెలిపారు. ప్రభుత్వ సేవలకు అసలైన లబ్ధిదారులకు అందించేందుకు ఆధార్ ఉపయోగపడుతుందన్నారు.
ఉడాయ్ నిబంధనలకే విరుద్ధం
పాన్ నంబర్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని సుప్రీం కోర్టులో పిటిషనర్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నిర్ణయం ఆధార్ స్వచ్ఛందమేనన్న ఆధార్ చట్టబద్ధ విభాగం విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) నిబంధనలకే పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. ‘ప్రభుత్వ నిర్ణయం పౌరహక్కులను నీరుగారుస్తుంది. వారిపై ఆధిపత్యం చలాయిస్తూ వ్యక్తుల గోప్యతను దెబ్బతీసి, జీవితాంతం వారిపై నిఘా ఉంచుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశమమని చెప్పుకునే ఏ దేశమూ ఆధార్‌లాంటి వ్యవస్థను అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఆధార్ కార్డుదారుల వివరాలను ప్రైవేటు సంస్థలు సేకరిస్తున్నాయని, వాటిని దుర్వినియోగం, లీక్ చేసే అవకాశముందని పిటిషనర్ల న్యాయవాది శ్యామ్ దివన్ అన్నారు.