న్యూఢిల్లీ: ఆధార్ –పాన్ కార్డుల అనుసంధానానికి ఇప్పటివరకూ ఆన్‌లైన్‌లోనూ, మొబైల్ ఫోన్లతో ఎస్సెమ్మెస్‌ల ద్వారా మాత్రమే అవకాశముండేది. తాజాగా దరఖాస్తు ద్వారా కూడా అనుసంధానాన్ని చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులిచ్చింది. కొత్త దరఖాస్తులో ఆధార్ పాన్ కార్డుల నంబర్లు, ఆ కార్డుల్లో ఉన్న విధంగా పేర్లను తప్పనిసరిగా పేర్కొనడంతో పాటు మరే ఇతర పాన్ కార్డు లేదని ధ్రువీకరించాలి.
‘ఆన్‌లైన్, ఎస్సెమ్మెస్‌ల ద్వారా కాకుండా పత్రాల ద్వారా ఆధార్ –పాన్ కార్డుల అనుసంధానం చేయాలనుకునే వారికి ఈ కొత్త దరఖాస్తులు జూలై 1 నుంచి అందుబాటులో ఉంటాయ’ని ఆదాయపన్ను శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందుకు సంబంధించి ఐటీ శాఖ శనివారం నోటిఫై చేసింది. ఇక పోస్టాఫీస్‌ల్లోనూ ఆధార్ కార్డులో తప్పులను, సవరణలను చేసుకునే అవకాశాన్ని పోస్టల్ ఖాతాదారులకు తమిళనాడులోని పోస్టల్ శాఖ కల్పించింది. జూలై 3 నుంచి నగరంలో ఉన్న 10 పోస్టాఫీస్‌ల్లో ఎక్కడైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని పోస్టల్ శాఖ తెలిపింది. ఆధార్ (యూఐడీఏఐ) విభాగం పోస్టల్ శాఖలు కలసి ఈ అవకాశాన్ని అందిస్తున్నట్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.