
విజయసాయి రెడ్డి, జయంత్ సిన్హా (పాత చిత్రం)
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాన్ని చేపట్టేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆసక్తి చూపుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభలో బుధవారం వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. పీపీపీ విధానంలో విమానాశ్రయం నిర్మాణం చేపట్టేందుకు ఉద్దేశించిన టెండర్‌లో పలు మార్పులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం పూనుకుంది.
అందుకనే మొదట జారీ చేసిన టెండర్‌ను రద్దు చేసింది. కాగా, తాజాగా జారీ చేసిన టెండర్ బిడ్లను తెరిచిన పిమ్మట ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను చేపట్టడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆసక్తి కనబరిచినట్లు మంత్రి వివరించారు. తాజా టెండర్ ప్రకారం ఎయిర్‌పోర్ట్ నిర్మాణ బాధ్యతలను చేపట్టిన సంస్థ విధిగా ఏవియేషన్ అకాడమీ, ఎంఆర్‌వోను అభివృద్ధి చేయాల్సిసిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు.
చేపల వేటకు నష్టం లేదు
సముద్ర గర్భంలో ఓఎన్‌జీసీ నిర్మించిన పైప్‌లైన్ వల్ల చేపలకు, చేపల వేటకు నష్టం జరుగుతోందని రాజ్యసభలో విజయసాయి రెడ్డి బుధవారం సంబంధిత మంత్రిని వివరణ కోరారు. స్పందించిన పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ఓఎన్‌జీసీ సముద్ర గర్భంలో నిర్మించిన పైప్‌లైన్ వల్ల చేపలకు, చేపల వేటకు ఎలాంటి నష్టం వాటిల్లడం లేదని స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్‌జీసీ, గెయిల్, ఆయిల్ ఇండియా కంపెనీలు సముద్ర గర్భంలో నిర్మించిన పైప్‌లైన్ల వల్ల సముద్రంలోని చేపలు సుదూర ప్రాంతాలకు తరలిపోతున్న ఉదంతాలేవీ తమ దృష్టికి రాలేదన్నారు.
ఓఎన్‌జీసీ తన రాజమండ్రి అసెట్ ద్వారా విడుదలయ్యే వ్యర్థ జలాలను సముద్రంలో కలిపేందుకు 2017 ఫిబ్రవరిలో 1.5 కిలో మీటర్ల మేర సముద్ర గర్భంలో సురక్షితంగా పైప్ లైన్‌ను నిర్మించిందని తెలిపారు. అధీకృత సంస్థల అనుమతులతోనే సముద్రగర్భంలో పైప్‌లైన్ల నిర్మాణం జరిగిందనీ, మత్స్య సంపదకు లేదా మర బోట్లకు ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. సముద్ర గర్భంలో పైప్‌లైన్ నిర్మాణాలు లేదా డ్రెడ్జింగ్ పనులతో మరపడవలు లేదా మత్స్య సంపదకు నష్టం జరుగుతోందని నిరూపించే ఆధారాలేవీ లేవని ఓఎన్‌జీసీ తెలియచేసినట్లు మంత్రి చెప్పారు. అయితే, జిల్లాలోని కరవాక గ్రామానికి చెందిన మత్స్యకారులు పైప్‌లైన్ నిర్మాణంతో చేపల వేటకు, వలలకు, పడవలకు నష్టం వాటిల్లుతోందనీ, తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఓఎన్‌జీసీకి ఒక వినతి పత్రం అందచేశారని మంత్రి గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment