
కొత్త కార్యాలయం కోసం ఆప్ అన్వేషణ
న్యూఢిల్లీ: కొత్త కార్యాలయం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు అన్వేషిస్తున్నారు. గత కొద్దిరోజులుగా వారంతా ఇదే పనిలో నిమగ్నమయ్యా రు. కాగా ఆ పార్టీ కార్యాలయం ప్రస్తుతం హనుమాన్ రోడ్డు ప్రాంతంలో ఉంది. నిరంతరం ఈ కార్యాలయ పరిసరాలు రద్దీగా ఉండడం, మీడియా సిబ్బంది, మద్దతుదారుల రాకపోకల కారణంగా ఈ పరిసరాల్లో నివసించేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వారంతా అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ కార్యాలయాన్ని మరోచోటికి మార్చాలంటూ అనేక పర్యాయాలు కోరారు. దీంతో ఆప్ నాయకులు కొత్త కార్యాలయానికి అవసరమైన భవంతి కోసం అన్వేషిస్తున్నారు.
తమ పార్టీ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలంటూ పట్టణ అభివృద్ధి శాఖను ఆ పార్టీ గతంలో కోరిన సంగతి విదితమే. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడొకరు మీడియాతో మాట్లాడుతూ అయితే ఇప్పటిదాకా ఆ శాఖ నుంచి ఎటువంటి స్పందనా రాలేదన్నారు. తమకు ప్రభుత్వం స్థలం కేటాయించేవరకూ ప్రైవేటు భవనంలోనే కార్యకలాపాలను కొనసాగించకతప్పదన్నారు. ఇందుకోసం కిరాయి ప్రాతిపదికన ప్రైవేటు భవనం తీసుకోవాల్సిందేనన్నారు. పంజాబ్‌లో నాలుగు స్థానాలను గెలుచుకున్న తమ పార్టీ అక్కడ కూడా తమ కార్యకలాపాల నిర్వహించాలనుకుంటోంది. ఇందులోభాగంగా ప్రభుత్వ స్థలం కోసం ఎదురుచూస్తోంది. కాగా ప్రస్తుతం హనుమాన్ రోడ్డులోని ఓ ప్రవాస భారతీయుడికి చెందిన భవనంలో ఆప్ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్న సంగతి విదితమే. ఇందుకోసం రూ. 1 అద్దె చెల్లిస్తోంది.