అండగా ఉన్నోళ్లనే అక్కున చేర్చుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ భావజాలానికి కట్టుబడి, ప్రతికూల పరిస్థితుల్లోనూ పార్టీకోసం నిలబడిన వ్యక్తులను ప్రోత్సహించాలని, కష్ట సమయాల్లో పార్టీని వీడిన నేతలను దూరం పెట్టాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. ‘పార్టీకి సైద్ధాంతికంగా కట్టుబడి ఉన్న వ్యక్తులను ప్రోత్సహించండి. కష్ట సమయాల్లో పారిపోయే బలహీనులకు దూరంగా ఉండండి. కొన్నిసార్లు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా కష్టకాలంలో పార్టీని వీడిన నేతలను తొందరపడి చేర్చుకుంటారు. మనం అలాంటి వ్యక్తులను దూరం పెడదాం’ అని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జీలతో ఖర్గే సమావేశమయ్యారు. ఈ భేటీకి పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ పటిష్టత, భవిష్యత్ ప్రణాళికలపై ఆ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. ‘పార్టీని బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బలోపేతంం చేసే బాధ్యతను ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు తీసుకోవాలి. ఈ పని కోసం మీరే బూత్‌కు వెళ్లాలి. కష్టపడి పనిచేయాలి. కార్మికులతో సంభాషించాలి. పార్టీ విభాగాలతో చర్చించాలి. సంస్థ పునర్ నిర్మాణంలో ఇండియన్ నేషనల్ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్టీయూసీ) ని భాగస్వామ్యులను చేయండి’’ అని ఖర్గే సూచించారు. ‘‘రాష్ట్రాల్లో పార్టీ నిర్వహణ, భవిష్యత్తు ఎన్నికల ఫలితాలకు ఆయా రాష్ట్రాల ఇన్‌ఛార్జీలే బాధ్యత వహించాలి. ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల సమయంలో మన పార్టీ మద్దతుదారుల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడమో లేక ఆ పేరును మరో బూత్‌లోకి మార్చడమో చేస్తున్నారు. ఈ రిగ్గింగ్‌ను ఎలాగైనా మనం ఆపాలి’’ అని ఖర్గే పిలుపునిచ్చారు.