ఆర్నెళ్ల తర్వాత కొత్త పార్టీ!
- ముందుగా ‘స్వరాజ్ అభియాన్’ పేరుతో గ్రూప్ ఏర్పాటు
- ఆప్ తిరుగుబాటు నేతల ‘సంవాద్’ సదస్సులో నిర్ణయం
న్యూఢిల్లీ: ఆప్ తిరుగుబాటు నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లు కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు. ముందుగా ప్రత్యామ్నాయ రాజకీయాలు లక్ష్యంగా ‘స్వరాజ్ అభియాన్’ గ్రూప్ ఏర్పాటు చేసి, ఆరు నెలల తర్వాత కొత్త పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికిప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని వీడబోమని స్పష్టంచేశారు. పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి అసమ్మతి ద్వయం మంగళవారమిక్కడ నిర్వహించిన ‘స్వరాజ్ సంవాద్’ సదస్సు 8 గంటలు కొనసాగింది. భవిష్యత్తు కార్యాచరణపై చర్చోపచర్చలు జరిపారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి హాజరైన కార్యాకర్తల అభిప్రాయాలను ఓటింగ్ ద్వారా తెలుసుకున్నారు. ఆప్‌ను వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను 69 మంది వ్యతిరేకించారు.
కొత్త పార్టీ ఏర్పాటుకు సదస్సుకు హాజరైనవారిలో 25 శాతం మందే మద్దతు పలికారు. ఇక ఆప్‌పై తమకు నమ్మకం ఉందని 1.43 శాతం మంది అభిప్రాయపడ్డారు. ‘స్వరాజ్ అభియాన్’ పేరుతో తమకు మద్దతు కోరుతూ దేశవ్యాప్తంగా పర్యటిస్తామని, అందరి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్న అనంతరం 6 నెలల తర్వాత పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని యోగేంద్ర యాదవ్ వెల్లడించారు. ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. ఆప్ అధినేత కేజ్రీవాల్ నియంతృత్వ పోకడలు పోతున్నారని విమర్శించారు. పార్టీలో గొంతెత్తే వారిని బహిష్కరించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. యోగేంద్రయాదవ్, భూషణ్‌తోపాటు పార్టీ ఉన్నత పదవుల నుంచి బహిష్కరణకు గురైన ఆనంద్ కుమార్, అజిత్ ఝా సదస్సులో పాల్గొన్నారు.