
పుట్టిన గడ్డపైనే అంత్యక్రియలు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అంత్యక్రియలు.. ఆయన స్వస్థలం తమిళనాడులోని రామేశ్వరంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతో ఆయన పార్థీవదేహాన్ని రేపు (బుధవారం) రామేశ్వరం తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంత్యక్రియలు రామేశ్వరంలోనే జరగాలని కలాం కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత జరిగిన కేంద్రం కేబినెట్ సమావేశంలో ఈ మహావీరుడికి తీవ్ర సంతాపం ప్రకటించింది. ఆయన సేవలను కొనియాడుతూ తీర్మానం చేసింది. అబ్దుల్ కలాం అంత్యక్రియల ఏర్పాట్లపై చర్చించారు. తన స్ఫూర్తివంతమైన జీవితంలో అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని కేంద్ర కేబినెట్ నివాళులర్పించింది.
రామేశ్వరంలో రేపు అధికార లాంఛనాలతో, గౌరవ ప్రదంగా అబ్దుల్ కలాం అంత్యక్రియలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రధానినరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్నాథ్ రామేశ్వరానికి వెళతారు. కాగా భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం సోమవారం సాయంత్రం షిల్లాంగ్లో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతికి సంతాపంగా ప్రపంచవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 12.30గంటలకు వైమానిక దళ హెలికాప్టర్‌లో కలాం పార్థివదేహం గువాహటి నుంచి ఢిల్లీ పాలెం విమానాశ్రయానికి చేరుకోనుంది. అక్కడ నుంచి టెన్ రాజాజీ మార్గ్‌లోని అధికారిక నివాసానికి కలాం భౌతికకాయాన్ని తరలించనున్నారు.