న్యూఢిల్లీ: బాలనేరస్తుల వయస్సు నిర్ధారణకు సంబంధించి స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్(ఎస్‌ఎల్‌సీ)ను రుజువు కింద పరిగణనలోకి తీసుకోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ ధ్రువీకరణ పత్రం లభ్యమైనపక్షంలో.. వైద్యపరీక్షల పరంగా వయస్సు నిర్ధారణ అవసరం లేదని స్పష్టం చేసింది. అనేక కేసుల్లో నిందితులు బాలనేరస్తులా? కాదా? అనే అంశంపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో న్యాయమూర్తులు జస్టిస్ కె.రాధాకృష్ణన్, జస్టిస్ ఎ.కె.సిక్రిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన గోస్వామికి సంబంధించిన ఎస్‌ఎల్‌సీని తానే స్వయంగా ఇచ్చినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలిపినందున ఆ ధ్రువీకరణ పత్రాన్ని తిరస్కరించడానికి వీల్లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
రంజిత్ గోస్వామిపై అత్యాచారం, హత్య, సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినట్టు 2008లో కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టులో లొంగిపోయిన గోస్వామి నేరం జరిగిన సమయానికి తనకు 18 ఏళ్లు నిండలేదని, తాను బాలుడినని పేర్కొంటూ తన పుట్టినతేదీకి సంబంధించి పాఠశాల నుంచి పొందిన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాడు. దీంతో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు.. ఈ కేసును జువెనైల్ బోర్డుకు బదిలీ చేశారు. అయితే వైద్య పరీక్షల్లో అతనికి 20 ఏళ్లుగా నిర్ధారణైంది. దీంతో వైద్య పరీక్షల్ని ప్రామాణికంగా తీసుకున్న జువెనైల్ బోర్డు అతన్ని మేజర్ కింద ప్రకటిస్తూ కేసు విచారణను సెషన్స్ కోర్టుకు బదిలీ చేసింది. అయితే జువెనైల్ బోర్డు నిర్ణయాన్ని సెషన్స్ జడ్జి తోసిపుచ్చారు. దీంతో వ్యవహారం మధ్యప్రదేశ్ హైకోర్టుకు చేరింది. జువెనైల్ బోర్డు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. దీనిని గోస్వామి సుప్రీంకోర్టులో సవాలు చేశాడు.