
24 వరకూ పోలీస్ కస్టడీకి బిషప్..
తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడి కేసులో అరెస్టయిన జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను ఈనెల 24 వరకూ పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్ధానం ఉత్తర్వులు జారీ చేసింది. ములక్కల్ బెయిల్ అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. 2014 మే 5న బాధితురాలిని లైంగికంగా వేధించే ఉద్దేశంతోనే స్కూల్‌కు వచ్చిన ములక్కల్ గెస్ట్ హౌస్‌లోని రూమ్ నెంబర్ 20లో రాత్రి 10.48 గంటలకు వరకూ ఆమెను ఉంచారని, అసహజ శృంగారానికి ఒత్తిడి చేశారని పోలీసులు రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు.
ఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బిషప్ బాధితురాలిని బెదిరించినట్టు వెల్లడించారు. తర్వాతి రోజు (మే 6) సైతం బాధితురాలిపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డాడని నివేదికలో ప్రస్తావించారు. 2014 నుంచి 2016 వరకూ అదే గదిలో బాధితురాలిపై నిందితుడు 13 సార్లు లైంగిక దాడి, అసహజ శృంగారానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు నిరాధారమని బిషప్ ములక్కల్ తోసిపుచ్చారు.