nun rape case
-
నన్‌పై లైంగిక దాడి : బిషప్‌పై బాధితురాలు ఫైర్
తిరువనంతపురం : లైంగిక దాడి కేసులో నిందితుడు బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితురాలు ఆరోపించారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ నన్‌పై బిషప్ లైంగిక దాడి కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. కేసులో ఆధారాలను తొలగించే ప్రయత్నాల వెనుక నిందితుడు ములక్కల్ ప్రమేయం ఉందని ఆమె సందేహం వ్యక్తం చేశారు. సరైన పత్రాలను పోలీసులకు సమర్పించని పక్షంలో ఫోరెన్సిక్ ల్యాబ్‌పై తాను ఫిర్యాదు చేస్తానని బాధితురాలు హెచ్చరించారు. కాగా ఈ కేసుకు సంబంధించి తాజా సైబర్ ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను తక్షణమే సమర్పించాలని పాలాలోని జ్యుడిషియల్ మేజిస్ర్టేట్ కోర్టు దర్యాప్తు అధికారిని ఆదేశించింది. బిషప్ ఫ్రాంకో ములక్కల్ 2014 నుంచి 2016 మధ్య తనను లైంగికంగా వేధించారని కేరళ నన్ 2018 జూన్ 27న కొట్టాయం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
నన్ల బదిలీ ఉత్తర్వుల నిలిపివేత
తిరువనంతపురం: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్‌పై చర్యలు తీసుకోవాలంటూ నిరసన తెలిపిన నన్ల బదిలీ ఉత్తర్వులను జలంధర్ డయోసిస్ నిలిపివేసింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తున్నందున విచారణ పూర్తయ్యే దాకా వారిని మరో చోటుకు పంపబోమంటూ హామీ ఇచ్చింది. బిషప్ ములక్కల్ 2014–16 సంవత్సరాల్లో కొట్టాయంలోని కురువింగలద్ కాన్వెంట్కు చెందిన ఓ నన్‌పై పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ బిషప్‌పై చర్యలు తీసుకోవాలంటూ గత ఏడాది బాధితురాలితోపాటు మరికొందరు నిరసన తెలిపారు. ఆందోళనకు దిగిన నలుగురు నన్లను వేరే ప్రాంతాలకు బదిలీ చేస్తూ మిషనరీస్ ఆఫ్ జీసస్కు చెందిన నన్ల కాంగ్రిగేషన్ హెడ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విషయాన్ని బాధితులు డయాసిస్తోపాటు కేరళ ముఖ్యమంత్రి విజయన్ దృష్టికి తీసుకెళ్లారు. తన జీవితం ప్రమాదంలో పడిందని, ఒంటరి చేసి, వేధించాలంటూ చూస్తున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వారంతా కాన్వెంట్ వద్ద నిరసనకు దిగగా మరికొందరు వ్యక్తులు బాధితులకు వ్యతిరేక నినాదాలు చేస్తూ అక్కడ బైఠాయించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించారు. ఈ పరిణామాలపై స్పందించిన జలంధర్ డయాసిస్.. ఆ నలుగురు నన్ల బదిలీ ఉత్తర్వులను రద్దు చేసింది. బిషప్ ములక్కల్‌పై ఆరోపణల కేసు తేలేదాకా సిస్టర్ ఆల్ఫీ, సిస్టర్ అనుపమ, సిస్టర్ జోసెఫైన్, సిస్టర్ అన్సితలను అక్కడి నుంచి బదిలీ చేయబోమంటూ హామీ ఇచ్చింది. వారు ప్రస్తుతం పనిచేస్తున్న చోటే యథావిధిగా విధులకు హాజరు కావొచ్చని తెలిపింది. -
కేరళ నన్‌పై లైంగిక దాడి : కీలక సాక్షి మృతి
చండీగఢ్ : కేరళ నన్‌పై లైంగిక దాడి కేసుకు సంబంధించి బిషప్ ములక్కల్‌పై ఫిర్యాదు చేసిన మత ప్రబోధకుడు మరణించడం కలకలం రేపింది. పంజాబ్‌లోని జలంధర్‌కు సమీపంలో దాస్వా వద్ద ప్రబోధకుడు కురియకొస్ కథుథార మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసులో కురియకోస్ కీలక సాక్షి కావడం గమనార్హం. కాగా, తమ సోదరుడిని హత్య చేశారని, తనను హతమారుస్తామని గతంలో బెదిరింపులు వచ్చాయని బాధితుడి సోదరుడు వెల్లడించారు. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాగా కేరళ నన్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ములక్కల్‌కు కోర్టు ఈనెల 15న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. నిందితుడు తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, విచారణాధికారి ఎదుట హాజరయ్యేందుకు మినహా కేరళలో అడుగుపెట్టరాదని ములక్కల్‌కు కోర్టు షరతులు విధించింది. కాగా బిషప్ ములక్కల్ 2014 నుంచి 2016 మధ్య తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని కేరళ నన్ ఆరోపించారు. ఈ కేసును విచారించిన కేరళ పోలీసులు సెప్టెంబర్ 21న బిషప్‌ను అరెస్ట్ చేశారు. -
నన్‌పై లైంగిక దాడి : బిషప్కు చుక్కెదురు!
తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్టయిన జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ బెయిల్ అభ్యర్ధనను బుధవారం కేరళ హైకోర్టు తోసిపుచ్చింది. 2014 నుంచి 2016 మధ్య బాధితురాలిపై బిషప్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో గత నెల 20న కేరళ పోలీసులు మూడు రోజులు ప్రశ్నించిన అనంతరం బిషప్ ములక్కల్‌ను అరెస్ట్ చేశారు. కొట్టాయంలోని పాలా జ్యుడిషియల్ మేజిస్ర్టేట్ కోర్టు ఎదుట హాజరు పరిచిన మీదట సెప్టెంబర్ 22న ములక్కల్‌ను పోలీస్ కస్టడీకి తరలించారు. ఇక సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 6వరకూ బిషన్‌ను జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉందని, తమకు, తమ ఆస్తులకు భద్రత కల్పించాలని బాధితురాలి సోదరి రాష్ట్ర పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో బిషప్ చర్చి పాస్టర్ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. -
కేరళ నన్‌పై లైంగిక దాడి : పోలీస్ కస్టడీకి బిషప్
తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడి కేసులో అరెస్టయిన జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను ఈనెల 24 వరకూ పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్ధానం ఉత్తర్వులు జారీ చేసింది. ములక్కల్ బెయిల్ అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. 2014 మే 5న బాధితురాలిని లైంగికంగా వేధించే ఉద్దేశంతోనే స్కూల్‌కు వచ్చిన ములక్కల్ గెస్ట్ హౌస్‌లోని రూమ్ నెంబర్ 20లో రాత్రి 10.48 గంటలకు వరకూ ఆమెను ఉంచారని, అసహజ శృంగారానికి ఒత్తిడి చేశారని పోలీసులు రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. ఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బిషప్ బాధితురాలిని బెదిరించినట్టు వెల్లడించారు. తర్వాతి రోజు (మే 6) సైతం బాధితురాలిపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డాడని నివేదికలో ప్రస్తావించారు. 2014 నుంచి 2016 వరకూ అదే గదిలో బాధితురాలిపై నిందితుడు 13 సార్లు లైంగిక దాడి, అసహజ శృంగారానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు నిరాధారమని బిషప్ ములక్కల్ తోసిపుచ్చారు. -
నన్‌పై లైంగికదాడి : బిషప్ ములక్కల్ అరెస్ట్
తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదురొంటున్న జలంధర్ చర్చ్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను కేరళ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఓ నన్‌పై లైంగిక దాడికి పాల్పడి అరెస్ట్ అయిన తొలి భారతీయ కాథలిక్ బిషప్ ములక్కల్ కావడం గమనార్హం. కొచ్చిలో శుక్రవారం సాయంత్రం బిషప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. ఫ్రాంకో ములక్కల్ జలంధర్ చర్చ్ కేరళలో నిర్వహిస్తున్న స్కూళ్ల పర్యవేక్షణకు వచ్చిన సందర్భంగా నన్‌పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. 2014 నుంచి 2016 వరకూ ములక్కల్ తనపై 13 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని కేరళ నన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా తనపై లైంగిక దాడి ఆరోపణలు వచ్చిన క్రమంలో పాస్టర్ బాధ్యతల నుంచి తప్పించాలని పోప్‌కు ములక్కల్ లేఖ రాసిన క్రమంలో ఆయన స్ధానంలో మరొకరికి బాధ్యతలు అప్పగిస్తూ వాటికన్ నుంచి అధికారిక సమాచారం అందిందని చర్చి వర్గాలు తెలిపాయి. బిషప్‌ను అరెస్ట్ చేసే ముందు ఆయనపై లైంగిక దాడి ఆరోపణలు చేసిన బాధితురాలి నుంచి తాజా స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. మూడు రోజుల కిందట కేసుకు సంబంధించి ములక్కల్‌ను పోలీసు అధికారులతో కూడిన సిట్ బృందం ప్రశ్నించింది. -
ఆ పాస్టర్‌ను తప్పించారు..
తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడి కేసులో విచారణ ఎదుర్కొంటున్న జలంధర్‌కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను తాత్కాలికంగా పాస్టర్ బాధ్యతల నుంచి తప్పించారు. వాటికన్ నుంచి ఈ మేరకు అధికారిక సమాచారం అందిందని కాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా గురువారం నిర్ధారించింది. కేరళ నన్‌పై ములక్కల్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనపై ఆరోపణలు వచ్చిన క్రమంలో చట్టపరంగా వాటిని ఎదుర్కొనేవరకూ తనను చర్చి బాధ్యతల నుంచి తప్పించాలని ములక్కల్ పోప్‌కు లేఖ రాసిన క్రమంలో బిషప్ వినతిని అంగీకరించారు. జలంధర్ చర్చ్‌కు బిషప్ అగ్నెలో రఫినో గ్రాసియస్ను నియమిస్తున్నట్టు వాటికన్ ప్రకటన పేర్కొంది. కాగా ములక్కల్‌ను కేరళ పోలీసులతో కూడిన సిట్ ప్రశ్నించిన నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ములక్కల్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించిన కేరళ హైకోర్టు ఈనెల 25న విచారణను చేపట్టనుంది. ఈ కేసులో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. -
నన్‌పై లైంగికదాడి: బిషప్‌ను ప్రశ్నించనున్న పోలీసులు
కొచ్చి : కేరళ నన్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్‌కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను బుధవారం కేరళ పోలీసులు ప్రశ్నించనున్నారు. తనపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో చర్చ్ బాధ్యతల నుంచి గత వారం తప్పుకున్న బిషప్ ములక్కల్ కేసుకు సంబంధించి విచారణను ఎదుర్కొనేందుకు వైకోం డీఎస్పీ కే. సుభాష్ ఎదుట హాజరుకానున్నారు. కొచ్చిలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో వైకోం డీఎస్పీ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన పోలీసుల బృందం ఆయనను ప్రశ్నించనుంది. సంచలనం సృష్టించిన కేరళ నన్‌పై లైంగిక దాడి కేసులో బిషప్‌ను ప్రశ్నించనున్న క్రమంలో క్రైమ్ బ్రాంచ్ (సీఐడీ) కార్యాలయం పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో బిషప్‌ను ప్రశ్నించనుండటంతో ఉన్నతాధికారులతో కొట్టాయం ఎస్పీ హరిశంకర్, కొచ్చి రేంజ్ ఐజీ విజయ్ శేఖర్ విచారణ ప్రక్రియలో పాల్గొంటారని భావిస్తున్నారు. కాగా 2014 నుంచి 2016 వరకూ బిషప్ ములక్కల్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని కేరళ నన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
ముందస్తు బెయిల్‌కు బిషప్ ములక్కల్ అప్పీల్
తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్‌కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ ముందస్తు బెయిల్ కోరుతూ మంగళవారం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. నన్‌పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆమెపై చర్యలు చేపట్టినందుకు ప్రతీకారంగానే ఆమె తనపై లైంగిక దాడి ఆరోపణలు చేశారని బిషప్ పేర్కొంటున్నారు. తనపై నన్ చేసిన ఆరోపణలు కట్టుకథంటూ ఆయన కొట్టిపారేస్తున్నారు. మరోవైపు తనపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో చర్చి బాధ్యతల నుంచి తనను తాత్కాలికంగా తప్పించాలని ములక్కల్ పోప్ ఫ్రాన్సిస్‌కు లేఖ రాశారు. ఈ కేసును ఎదుర్కొనేందుకు తాను తరచూ కేరళ ప్రయాణించాల్సి ఉన్నందున బిషప్ బాధ్యతల నుంచి తాను వైదలగుతానని లేఖలో బిషప్ స్పష్టం చేశారు. కేసులో తదుపరి విచారణ నిమిత్తం ఈనెల 19న హాజరు కావాలని కేరళ పోలీసులు తనకు నోటీసులు జారీ చేసిన క్రమంలో డయాసిస్ బాధ్యతలను మాధ్యూ కొక్కండమ్‌కు అప్పగిస్తూ బిషప్ సర్క్యులర్ జారీ చేశారు. జలంధర్ కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ 2014- 2016 మధ్య కాలంలో క్రైస్తవ మహిళా సన్యాసిని (46) మీద 13 సార్లు అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
కేరళ నన్‌పై లైంగిక దాడి : పోప్‌కు బిషప్ లేఖ
తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్ చర్చి బిషప్ ఫ్రాంకో ములక్కల్ తాత్కాలికంగా బిషప్ బాధ్యతల నుంచి వైదొలుగుతానని పేర్కొంటూ పోప్ ఫ్రాన్సిస్‌కు లేఖ రాశారు. న్యాయస్ధానం వెలువరించిన ఉత్తర్వుల నేపథ్యంలో చర్చి నిర్వహణ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పించాలని పోప్ ఫ్రాన్సిస్‌కు రాసిన లేఖలో ములక్కల్ కోరారు. నన్‌పై లైంగిక దాడి కేసును విచారిస్తున్న కేరళ పోలీసుల తరపున శుక్రవారం జలంధర్ పోలీసులు బిషప్కు సమన్లు అందచేశారు. కాగా 2014 నుంచి 2016 వరకూ ములక్కల్ తనపై 13 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని 43 ఏళ్ల నన్ ఈ ఏడాది జూన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్‌కు చెందిన జీసస్ మిషనరీలు కేరళలో రెండు కాన్వెంట్లను నిర్వహిస్తున్న క్రమంలో ఈ మిషనరీల్లో బాధిత నన్ సభ్యురాలిగా ఉన్నారు. నన్‌పై లైంగిక దాడికి పాల్పడిన బిషప్ అరెస్ట్‌ను డిమాండ్ చేస్తూ కొచ్చిలో నన్‌లు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. కాగా బిషప్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన అధికార ప్రతినిధి ఫాదర్ పీటర్ పేర్కొన్నారు. -
‘నన్’ రేప్ కేసులో దోషికి యావజ్జీవం
కోల్‌కతా: దోపిడీకి వెళ్లి, అక్కడే ఉన్న వృద్ధ క్రైస్తవ సన్యాసినిని అత్యాచారం చేసిన కేసుల్లో దోషిగా తేలిన బంగ్లాదేశ్‌కు చెందిన నజ్రుల్ ఇస్లాంకు కోల్‌కతాలోని అడిషనల్ సెషన్స్ కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. ఇదే కేసులో దోపిడీకి సంబంధించి దోషులుగా తేలిన మరో ఐదుగురికి శిక్షలు ఖరారు చేసింది. దోపిడీ చేసేందుకు నేరపూరిత కుట్ర పన్నిన కేసులో.. నజ్రుల్ ఇస్లాం, మిలాన్ కుమార్ సర్కార్, ఓహిదుల్ ఇస్లాం, మహ్మద్ సలీమ్ షేక్, ఖలెందర్ రహ్మాన్, గోపాల్ సర్కార్లకు ఒక్కొక్కరికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించింది. దోపిడీకి పాల్పడిన కేసులో.. నజ్రుల్ ఇస్లాం, మిలాన్ కుమార్ సర్కార్, ఓహిదుల్ ఇస్లాం, మహ్మద్ సలీమ్ షేక్, ఖలెందర్ రహ్మాన్‌లకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20,000 జరిమానా విధించింది. -
సంచలన కేసులో రేపు శిక్షలు ఖరారు
కోల్‌కతా : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రైస్తవ సన్యాసిని అత్యాచార కేసులో నిందితులను.. దోషులుగా న్యాయస్థానం నిర్ధారించింది. ప్రధాన నిందితుడు నజ్రుల్ ఇస్లాంను అత్యాచార కేసులో.. నజ్రుల్‌తోపాటు మిగతా వారిని దోపిడీ కేసులో దోషులుగా గుర్తిస్తున్నట్లు జిల్లా సెషన్స్ కోర్టు తెలిపింది. ఆరుగురు బంగ్లాదేశీయులను... వారికి ఆశ్రయం కల్పించిన గోపాల్ సర్కార్ అనే వ్యక్తిని దోషులుగా తేల్చింది. తీర్పు సందర్భంగా జడ్జి కుంకుమ్ శర్మ చేసిన వ్యాఖ్యలివే. ‘‘ఈ ఘటనతో పశ్చిమ బెంగాల్ పరువు పోయింది. మదర్ థెరిసా, సిస్టర్ నివేదిత లాంటి వాళ్లు సేవలందించిన నేల ఇది. అలాంటి చోట నిరాడంబరంగా సేవలందిస్తున్న ఓ ముదుసలి సన్యాసిని అతి కిరాతంగా అత్యాచారం చేశారు. వీరికి సమాజంలో తిరిగే హక్కు ఏ మాత్రం లేదు’’ అన్నారు. తొలుత ఇది సాముహిక అత్యాచారంగా భావించినప్పటికీ.. దర్యాప్తులో కాదని తేలిందని జడ్జి వివరించారు. బుధవారం వీరికి శిక్షలు ఖరారు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. కాగా, వారి శిక్షలు జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనింద్య రౌత్ చెప్పారు. బంగ్లాదేశ్ కు చెందిన నజ్రుల్ ఇస్లాం అలియాస్ నోజు మిగతా వారితో కలిసి మార్చి 14, 2015న నదియా జిల్లాలోని రానాఘాట్‌లోని ఓ చర్చిలో దోపిడీకి పాల్పడ్డారు. ఆ సమయంలో నజ్రుల్ 71 ఏళ్ల క్రైస్తవ సన్యాసినిని దారుణంగా అత్యాచారం చేశాడు. ఆపై మిగతా వారంతా అక్కడి కంప్యూటర్లు, డబ్బుతో పరారయ్యారు. దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని క్రైస్తవ సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున్న ఆందోళన చేపట్టాయి. ఘటన తర్వాత గోపాల్ శర్మ అనే వ్యక్తి నిందితులందరికీ తన ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. ఆపై ప్రధాన నిందితుడు నోజును జూన్ 17, 2015న సీల్దా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. రానాఘాట్ బంగ్లాదేశ్‌కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. గెడె స్టేషన్ నుంచి రైలు మార్గం ద్వారా వారు దేశంలోకి ప్రవేశించినట్లు దర్యాప్తులో తేలింది. మొత్తం 42 మందిని విచారించిన పోలీసులు. నోజుతోపాటు 10 మందికి ఐడెంటిఫికేషన్ పెరేడ్ నిర్వహించారు. ఇందులో సన్యాసినితోపాటు సెక్యూరిటీ గార్డు పాల్గొన్నారు. -
ఓ కేంద్రమంత్రి.. రేప్‌కు మతానికి లింకేంటి?
పనాజీ: పశ్చిమ బెంగాల్లో జరిగిన నన్‌పై లైంగికదాడి విషయంలో బీజేపీ నేత, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి. అత్యాచారానికి, మతానికి సంబంధం పెడుతూ వ్యాఖ్యలు చేయడమేమిటని గోవా కాంగ్రెస్ పార్టీ ఆయనను తీవ్రంగా విమర్శించింది. బీజేపీ మతతత్వాన్ని ప్రోత్సహిస్తోందంటూ విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో గురువారం స్పందించిన ఆయన బెంగాల్లో నన్‌పై జరిగిన లైంగికదాడిని ప్రస్తావించారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇద్దరు ముస్లిం వ్యక్తులని చెప్పారు. దేశంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, అయితే, వీటికి పార్టీకి, పార్టీ సంస్థలకు, పార్టీ వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ సిద్ధాంతాలు, తమ విధానాలు అనుసరించేవారు ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడరని, ప్రతి దానికి తమను నిందించడం అలవాటుగా మారిందన్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. కేంద్రమంత్రి అయ్యి ఉండి లైంగికదాడిని మతంతో ముడిపెట్టడం సబబేనా అని ప్రశ్నించింది. ఎప్పటికీ అరెండు విషయాలకు జతకట్టకూడదని పేర్కొంది. లైంగికదాడి అనేది మానసిక వైకల్యంతో కూడిన ఓ వ్యక్తి చేసే దుశ్చర్య అని, ఆ వ్యక్తిని శిక్షించాలే తప్ప ఇలా మతాల విషయాలు తెరమీదకు తీసుకురాకూడదని చెప్పారు. -
మేం వకాల్తా పుచ్చుకోం...
కోల్‌కతా: కోల్‌కతా నన్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుని తరపున వాదించబోమని స్థానిక బార్ అసోసియేషన్ తేల్చి చెప్పింది. 70 యేళ్ల క్రైస్తవ సన్యాసినిపై కిరాతకంగా దాడిచేసి దుశ్చర్యకు పాల్పడిన ఘటనకు నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు బార్ అసోసియేషన్ సెక్రటరీ మిలన్ సర్కార్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సలీంను సీఐడి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈకేసులో సీసీఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. అయితే ప్రధాన నిందితుడు అరెస్ట్ చేసినప్పటికీ... మిగతా వారు ఇంకా పరారీలోనే ఉన్నారు. కాగా సబ్- డివిజనల్ లీగల్ ఎయిడ్ కమిటీ నిందితుడికి న్యాయ సహకారం అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి వాసుదేవ్ ముఖోపాధ్యాయ నియమితులైనట్లు సమాచారం. -
నన్ కేసు సీబీఐకి అప్పగింత
మరో వృద్ధురాలి అనుమానాస్పద మృతి రాణాఘాట్: రాణాఘాట్ కాన్వెంట్ స్కూల్లో 71ఏళ్ల నన్‌పై సామూహిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించేందుకు పశ్చిమబెంగాల్ సర్కారు అంగీకరించింది. ‘ఈ కేసులోని తీవ్రతను, సున్నితత్వంతో పాటు.. ఘటన జరిగిన ప్రాంతం సరిహద్దుకు దగ్గర ఉండటం దృష్టిలో ఉంచుకుని విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించాం’ అని సీఎం మమతా బెనర్జీ తన ఫేస్బుక్ ఖాతాలో తెలిపారు. సీబీఐకి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా జాతీయ మానవహక్కుల సంఘం రాష్ట్రాన్ని ఆదేశించింది. కాగా, బుర్ద్వాన్ జిల్లాలో 75 ఏళ్ల వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చరణ్‌దాస్ ఆశ్రమంలో నివసిస్తున్న ఆమె మృతదేహం బుధవారం ఆశ్రమ సమీపంలో లభించింది. వివస్త్రగా పడి ఉన్న ఆమెను అత్యాచారం చేసి హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు ఆశ్రమవాసులపై చేయి చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ నివేదికలో మాత్రం మహిళను రేప్ చేసినట్లు కానీ, రేప్ వల్ల చనిపోయినట్లు కానీ ఆధారాలు లభించలేదని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.