
నన్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ములక్కల్
ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించిన బిషప్ ఫ్రాంకో ములక్కల్
తిరువనంతపురం : కేరళ నన్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్‌కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ ముందస్తు బెయిల్ కోరుతూ మంగళవారం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. నన్‌పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆమెపై చర్యలు చేపట్టినందుకు ప్రతీకారంగానే ఆమె తనపై లైంగిక దాడి ఆరోపణలు చేశారని బిషప్ పేర్కొంటున్నారు. తనపై నన్ చేసిన ఆరోపణలు కట్టుకథంటూ ఆయన కొట్టిపారేస్తున్నారు.
మరోవైపు తనపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో చర్చి బాధ్యతల నుంచి తనను తాత్కాలికంగా తప్పించాలని ములక్కల్ పోప్ ఫ్రాన్సిస్‌కు లేఖ రాశారు. ఈ కేసును ఎదుర్కొనేందుకు తాను తరచూ కేరళ ప్రయాణించాల్సి ఉన్నందున బిషప్ బాధ్యతల నుంచి తాను వైదలగుతానని లేఖలో బిషప్ స్పష్టం చేశారు. కేసులో తదుపరి విచారణ నిమిత్తం ఈనెల 19న హాజరు కావాలని కేరళ పోలీసులు తనకు నోటీసులు జారీ చేసిన క్రమంలో డయాసిస్ బాధ్యతలను మాధ్యూ కొక్కండమ్‌కు అప్పగిస్తూ బిషప్ సర్క్యులర్ జారీ చేశారు. జలంధర్ కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ 2014- 2016 మధ్య కాలంలో క్రైస్తవ మహిళా సన్యాసిని (46) మీద 13 సార్లు అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.