నన్ కేసు సీబీఐకి అప్పగింత
- మరో వృద్ధురాలి అనుమానాస్పద మృతి
రాణాఘాట్: రాణాఘాట్ కాన్వెంట్ స్కూల్‌లో 71ఏళ్ల నన్‌పై సామూహిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించేందుకు పశ్చిమబెంగాల్ సర్కారు అంగీకరించింది. ‘ఈ కేసులోని తీవ్రతను, సున్నితత్వంతో పాటు.. ఘటన జరిగిన ప్రాంతం సరిహద్దుకు దగ్గర ఉండటం దృష్టిలో ఉంచుకుని విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించాం’ అని సీఎం మమతా బెనర్జీ తన ఫేస్‌బుక్ ఖాతాలో తెలిపారు. సీబీఐకి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా జాతీయ మానవహక్కుల సంఘం రాష్ట్రాన్ని ఆదేశించింది.
కాగా, బుర్ద్వాన్ జిల్లాలో 75 ఏళ్ల వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చరణ్‌దాస్ ఆశ్రమంలో నివసిస్తున్న ఆమె మృతదేహం బుధవారం ఆశ్రమ సమీపంలో లభించింది. వివస్త్రగా పడి ఉన్న ఆమెను అత్యాచారం చేసి హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు ఆశ్రమవాసులపై చేయి చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ నివేదికలో మాత్రం మహిళను రేప్ చేసినట్లు కానీ, రేప్ వల్ల చనిపోయినట్లు కానీ ఆధారాలు లభించలేదని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.