
కొచ్చి : కేరళ నన్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్‌కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను బుధవారం కేరళ పోలీసులు ప్రశ్నించనున్నారు. తనపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో చర్చ్ బాధ్యతల నుంచి గత వారం తప్పుకున్న బిషప్ ములక్కల్ కేసుకు సంబంధించి విచారణను ఎదుర్కొనేందుకు వైకోం డీఎస్పీ కే. సుభాష్ ఎదుట హాజరుకానున్నారు.
కొచ్చిలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో వైకోం డీఎస్పీ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన పోలీసుల బృందం ఆయనను ప్రశ్నించనుంది. సంచలనం సృష్టించిన కేరళ నన్‌పై లైంగిక దాడి కేసులో బిషప్‌ను ప్రశ్నించనున్న క్రమంలో క్రైమ్ బ్రాంచ్ (సీఐడీ) కార్యాలయం పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో బిషప్‌ను ప్రశ్నించనుండటంతో ఉన్నతాధికారులతో కొట్టాయం ఎస్పీ హరిశంకర్, కొచ్చి రేంజ్ ఐజీ విజయ్ శేఖర్ విచారణ ప్రక్రియలో పాల్గొంటారని భావిస్తున్నారు. కాగా 2014 నుంచి 2016 వరకూ బిషప్ ములక్కల్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని కేరళ నన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment