17 ఏళ్లు అవుతోంది.. ఆ వ్యక్తి ఎక్కడా?
న్యూఢిల్లీ: తనకు బెయిల్ కోసం ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి మరణించి 17 సంవత్సరాలు గడిచిపోయినా నిందితుడికి తెలియకపోవడం నమ్మశక్యంగా లేదని సీబీఐ కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను మే 22కు వాయిదా వేసింది. వివరాల్లోకెళితే ఢిల్లీకి చెందిన వినీత్ తివారీ, ఎల్.కె.కౌల్, ఏ ఎస్ మస్తర్‌లు 1982లో అప్పటి షిప్పింగ్, రవాణా మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సంతకంతో ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించారు. వాటి సాయంతో బాంబే పోర్ట్ ట్రస్టుకు చెందిన 39,846 చదరపు మీటర్ల భూమిని రూ.2.27 కోట్లకు విక్రయించారు.
ఈ ఘటనపై 1983, మార్చి22న అప్పటి షిప్పింగ్, రవాణా మంత్రిత్వ శాఖ జాయింట్‌స సెక్రటరీ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మస్తర్ అప్రూవర్‌గా మారడంతో 1985లో కోర్టు అతడిని విడుదల చేసింది. 2008 అక్టోబర్ 13న తివారీ, కౌల్‌లకు వ్యతిరేకంగా మోసం, ఫోర్జరీ, కుట్ర, తప్పుడు ధ్రువపత్రాల సమర్పణ అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశాలిచ్చింది. ప్రాథమిక ఆధారాల ప్రకారం నిందితులిద్దరూ అప్రూవర్‌తో కలిసి నేరం చేశారని కోర్టు అభిప్రాయపడింది. తివారీ బెయిల్‌కు మరో ష్యూరిటీని అంగీకరించిన ధర్మాసనం, విచారణను మే 22కు వాయిదా వేసింది.