సీఐసీలో లుకలుకలు! | Acharyulu takes on CIC just before his retirement | Sakshi
Sakshi News home page

సీఐసీలో లుకలుకలు!

Published Wed, Nov 21 2018 2:34 AM | Last Updated on Wed, Nov 21 2018 2:34 AM

Acharyulu takes on CIC just before his retirement - Sakshi

శ్రీధర్‌ , ఆర్కే మాథుర్‌

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్, కమిషనర్‌ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు తెలుస్తోంది. రుణ ఎగవేతదారుల జాబితా ఇవ్వనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వాలని ఆర్బీఐ గవర్నర్‌ను కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు ఆదేశించారు. దీనిపై ప్రధాన కమిషనర్‌ రాధాకృష్ణ మాథుర్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీధర్‌ ఆచార్యులు తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ మాథుర్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

రుణ ఎగవేతదారులపై బ్యాంకుల తనిఖీ నివేదికలను బహిర్గతం చేయాలని అప్పటి కమిషనర్‌ శైలేష్‌ గాంధీ జారీచేసిన ఆదేశాల్ని రిజర్వ్‌ బ్యాంకు సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సమాచార కమిషన్‌ చర్యల్ని కోర్టు సమర్థించి, ఆ సమాచారం వెల్లడించాలని ఆదేశించినా ఆర్బీఐ స్పందించలేదు. పదవి నుంచి దిగిపోయిన తరువాత శైలేష్‌ గాంధీ సామాన్యుడిగా ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే ఆయన అభ్యర్థనను కేంద్ర సమాచార కమిషన్‌ తిరస్కరించింది. ఇదే సమాచారం కోరుతూ మరొక అప్పీలు తన వద్దకు రాగా, సీఐసీ గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని శ్రీధర్‌ ఆచార్యులు ఆర్బీఐని ఆదేశించినట్లు తెలిసింది.  

అలిఖిత నియమం బేఖాతరు!: అప్పీలులో ఆర్బీఐ సంబంధిత అంశాలు ఉన్నప్పుడు ఆ అప్పీళ్లు వినే కమిషనర్‌కు పంపాలనే అలిఖిత నియమం ఉల్లంఘించారని శ్రీధర్‌ ఆచార్యుల నిర్ణయంపై మాథుర్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీని వల్ల సదరు అప్పీళ్లు విచారించే కమిషనర్‌ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టారని, కమిషనర్ల మధ్య అభిప్రాయబేధాలు వచ్చేలా చేశారని మాథుర్‌ పేర్కొన్నట్లు తెలిసింది. సీఐసీ నిబంధనావళిలో అలాంటి అలిఖిత నియమం ఏదీ లేదని శ్రీధర్‌ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. సుప్రీం తీర్పును గౌరవిస్తూ ఆర్బీఐ చట్టానికి అనుగుణంగానే తాను ఆదేశాలు జారీచేసినట్లు  శ్రీధర్‌ తెలిపారు.

ఆ దుర్మార్గుల పేర్లను గోప్యంగా ఉంచాలా?
‘2017 జూన్‌ నాటికి రూ. 9.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని భారతీయ బ్యాంకుల ద్వారా కొల్లగొట్టిన రుణగ్రస్తులు వారు. 2018 లెక్కల ప్రకారం మిలియనీర్లయి ఉండి కూడా రూ. 50 కోట్ల కన్నా ఎక్కువ అప్పు ఎగవేసి, బ్యాంకులు కేసులు పెడితే దేశం వదిలి పారిపోయి విదేశాల్లో స్థిరపడిన 7 వేల మంది ఘరానా ప్రముఖులు వారు.

మాతృభూమిని దోచుకునే దొరల వివరాలు ప్రజలకు తెలియకూడదా? చిన్నపాటి అప్పులు చెల్లించలేదనే నింద భరించలేక రైతులు పొలాల్లోనే ప్రాణాలు వదిలేస్తుంటే, బ్యాంకులను దోచుకుని విదేశాల్లో బతికే ఈ దుర్మార్గుల పేర్లను గోప్యంగా ఉంచాలని మనం ప్రమాణం చేశామా? భారత రాజ్యాంగంతో పాటు అంతరాత్మకు లోబడి తీర్పు చెప్పాను’ అని శ్రీధర్‌ ఆ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement