
నరేంద్ర మోది, ఆమీర్ ఖాన్ ( ఫైల్ ఫోటో)
బీజింగ్: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. చైనాలో కూడా ఆమిర్‌కు అభిమానులు ఎక్కువే. అందుకు నిదర్శనం ఆయన నటించిన ‘దంగల్’ సినిమా వసూళ్లే. ఆ సినిమా చైనాలో భారీ వసూళ్లను రాబట్టింది. చైనీయులు ఆమిర్ ఖాన్‌పై చూపే అభిమానాన్ని చూసి మోదీ సర్కార్ ఆయనను భారత్ తరఫున చైనా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
దీనిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హుయా చునీయింగ్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆమిర్ ఖాన్ గొప్ప హీరో అని మాకూ తెలుసు. నాతో పాటు చాలామంది చైనీయులకు ‘దంగల్’ సినిమా చూశాక ఆమిర్‌పై అభిమానం పెరిగింది.’ అని పేర్కొన్నారు. అయితే ఆమిర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్న విషయం గురించి మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ వార్తలు వెలువడటం గమనార్హం. శుక్రవారం నుంచి రెండురోజుల పాటు చైనాలోని ఉహాన్‌లో జరుగనున్న ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం రాత్రి చైనా వెళ్లిన విషయం విదితమే.