సాక్షి, న్యూఢిల్లీ : ఓవైపు... వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతుండగా.. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలకు ‘ఆర్థిక భారాన్ని’ తగ్గించేందుకు కార్పోరేట్ సంస్థలు విరాళాల రూపంలో సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా చందాలు అందించి తమ వంతు సాయం చేస్తున్నాయి. అయితే ఏయే పార్టీకి ఎన్నెన్ని విరాళాలను అందాయనే విషయంపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది.
ఏడీఆర్ నివేదిక ప్రకారం... 2017-18గాను వివిధ పార్టీలన్నింటికీ కలిపి సంయుక్తంగా 194 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. ఇందులో అత్యధిక వాటా అధికార బీజేపీకి దక్కిందని నివేదిక పేర్కొంది. మొత్తం విరాళాల్లో 86.59 శాతం అంటే సుమారు 167.80 కోట్ల రూపాయలు కాషాయ పార్టీకి అందాయని తెలిపింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో సహా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, బిజు జనతాదళ్ వంటి పలు ప్రాంతీయ పార్టీలన్నింటికీ కలిపి 25.98 కోట్ల రూపాయలు చందాల రూపేణా అందాయని వెల్లడించింది. ఇందులో కాంగ్రెస్ వాటా 11 కోట్ల రూపాయలని ఏడీఆర్ తెలిపింది. ఇది బిజు జనతా దళ్ పార్టీ(రూ.14 కోట్లు)కి దక్కిన మొత్తం కంటే తక్కువ కావడం గమనార్హం.
భారతీ ఎయిర్‌టెల్ పెద్ద మనసు..
ఎలక్ట్రోరల్ ట్రస్టులకు అందిన విరాళాలతో పాటు టాప్-10 దాతల వివరాలను కూడా ఏడీఆర్ తన నివేదికలో పొందుపరిచింది. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ అత్యధికంగా 25.005 కోట్ల రూపాయలు అందించగా, రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్ రూ. 25 కోట్లు, యూపీఎల్ లిమిటెడ్ రూ. 20 కోట్లు అందజేసాయి.
Comments
Please login to add a commentAdd a comment