![ఆఫ్రికా యువతిపై క్యాబ్ డ్రైవర్ దాడి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/51490784243_625x300.jpg.webp?itok=t9WWJuXn)
ఆఫ్రికా యువతిపై క్యాబ్ డ్రైవర్ దాడి
న్యూఢిల్లీ: నైజీరియా విద్యార్థులపై దాడి ఘటనను మరువకముందే ఆఫ్రికా యువతిపై గ్రేటర్ నోయిడాలో దాడి చోటుచేసుకుంది. ఆఫ్రికా విద్యార్థిని బుధవారం ఉదయం 4:30 గంటల సమయంలో ఢిల్లీ నుంచి నోయిడాలోని పార్క్ ఏరియాకు క్యాబ్‌లో చేరుకుంది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ క్యాబ్ డ్రైవర్ ఆ విద్యార్థినితో గొడవకుదిగాడు. ఈ క్రమంలో యువతిని కిందికి లాగి పడేసి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బాధిత విద్యార్థిని ఏ దేశానికి చెందిన యువతి అన్నది తెలియరాలేదు.
స్థానికుల సమచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దాడికి పాల్పడ్డ వారి కోసం దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఏఎస్పీ అభినందన్ తెలిపారు. సోమవారం రాత్రి నలుగురు నైజీరియా విద్యార్థులపై నోయిడాలో కొందరు దాడికి పాల్పడటంతోపాటు, షాపింగ్ మాల్‌లో ఇద్దరిని తీవ్రంగా కొట్టి గాయపరిచిన విషయం విదితమే. ఈ ఘటనలపైనా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటి వరకు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆ దాడి కేసులో పలువురిపై కేసు నమోదు చేశారు.