కిడ్నాపర్లే డబ్బులు ఇచ్చి వదిలేశారు | After 16 years in captivity: Tripura man's surprise homecoming | Sakshi
Sakshi News home page

కిడ్నాపర్లే డబ్బులు ఇచ్చి వదిలేశారు

Published Tue, Apr 19 2016 12:27 PM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

కిడ్నాపర్లే డబ్బులు ఇచ్చి వదిలేశారు

కిడ్నాపర్లే డబ్బులు ఇచ్చి వదిలేశారు

అగర్తల : కిడ్నాపర్ల చేతిలో తన్నులు తిన్నాడు. వాళ్లు తిట్టిన తిట్లు భరించాడు. అంతేకాదు వాళ్లు చెప్పిన పనులన్నీ చేశాడు. మంచివాడు మా రాజన్ సాహ. మా మాటే వింటాడోయి... అంటూ కిడ్నాపర్ల చేత శెభాష్ అనిపించుకున్నాడు. అతడిని విడుదల చేయాలని కిడ్నాపర్లు నిర్ణయించారు. అతడికి కొంత నగదు ఇచ్చి మరీ విడిచిపెట్టారు. అదీ  కూడా కిడ్నాప్ అయిన 16 ఏళ్లకు. దీంతో రాజన్ బంగ్లాదేశ్లోని బంధువుల ఇంటికి చేరుకున్నాడు. అక్కడి నుంచి వారి ద్వారా రాజన్ తన ఇంటికి తిరిగి వచ్చాడు. త్రిపుర రాజధాని అగర్తలాలో జీవిస్తున్న రాజన్  సాహ అనే వ్యక్తికి ముగ్గురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు. ఓ అమ్మాయి. రాజన్ అరటి పళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఆ క్రమంలో 2000 సంవత్సరంలో అగర్తలకు దక్షిణంగా 35 కిలో మీటర్ల దూరంలోని జంపుజాయిలాలో అరటిపళ్లు టోకున కొనుగోలు చేసేందుకు ఎప్పటిలాగా వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న సాయుధలైన నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర తీవ్రవాదులు రాజన్ సాహతోపాటు మరో ఇద్దరు వ్యాపారులను కిడ్నాప్ చేశారు. కళ్లకు గంతలు కట్టి బంగ్లాదేశ్ లోని చిట్టిగాంగ్ పర్వత శ్రేణి ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ అటవీ ప్రాంతంలోని తమ స్థావరాలకు తీవ్రవాదులు తీసుకెళ్లారని... అయితే ఆ ప్రాంతం ఎక్కడ అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పలేనని నాటి సంఘటనలు మంగళవారం తనను కలసిన విలేకర్లకు పూసగుచ్చినట్లు రాజన్ సాహ వివరించారు.

తీవ్రవాదుల స్థావరం తన పట్ల ఎంత ఘోరంగా వ్యవహరించిందని... నగదు ఇస్తే వదిలేస్తామంటూ వారు డిమాండ్ చేసేవారని... తన వద్ద నగదు లేదని ఎన్ని సార్లు చెప్పిన వారు వినకుండే చిత్రహింసలు పెట్టేవారని... ఆహారం కూడా సరిపడనంత పెట్టేవారు కాదని.... దీంతో తీవ్ర అనారోగ్యం పాలైయానని... కిడ్నాపర్ల చెరలో ఉన్న సమయంలో అతడు పడిన బాధలను రాజన్ తలచుకుని కన్నీరు మున్నీరు అయ్యాడు. కానీ ఏ రోజూ అక్కడి నుంచి పారిపోవాలని మాత్రం ప్రయత్నించలేదని చెప్పాడు.

అయితే ఖాళీ సమయాల్లో మాత్రం వీరి నుంచి విముక్తి కల్పించాలని దేవుని ప్రార్థన చేసేవాడినని చెప్పాడు. తన మొర దేవుడు అలకించాడని... కిడ్నాపర్ల మనస్సు కరిగి... ఇంటికి వెళ్లంటూ కొంత నగదు ఇచ్చి... పంపేశారని రాజన్ చెప్పాడు. కాగా తనతో కిడ్నాప్ చేసిన ఇద్దరు వ్యాపారులను మరో చోటకు తరలించారని రాజన్ గుర్తు చేసుకున్నారు.

అయితే తీవ్రవాదుల చెరలో ఉన్న రాజన్ను విడిపించేందుకు అతడి కుటుంబం చేయని ప్రయత్నం లేదు. పోలీసు ఉన్నతాధికారులతోపాటు మంత్రులను కూడా కలిశారు. కానీ ప్రయోజనం శూన్యం. చివరికి కోర్టును ఆశ్రయించగా... అతడు మరణించినట్లు అధికారులు కోర్టుకు మరణ ధృవీకరణ ప్రతం అందజేశారు. దీంతో రాజన్పై అతడు కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. ఆ తరుణంలో రాజన్ ఇంటికి రావడం చూసి... కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాజన్ పెద్ద కుమారుడు కోల్కత్తాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్న ఒక్కగాని ఒక్క కుమార్తె వివాహం చేసుకుని మెట్టినింట ఆనందంగా  ఉంటోంది. దేవుని దయతో తన భర్త ఇంటి క్షేమంగా తిరిగి వచ్చాడని రాజన్ భార్య సుమిత్ర సంతోషంతో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement