
టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రంజీ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న మయాంక్.. అగర్తల నుంచి న్యూఢిల్లీకి వెళ్లే విమానంలో అనారోగ్యం బారిన పడ్డాడు. విమానంలో కూర్చున్న తర్వాత మయాంక్ విపరీతమైన గొంతు నొప్పి, మంటతో బాధపడినట్లు తెలుస్తోంది. అదే విధంగా వాంతులు కూడా చేసుకున్నట్లు సమాచారం.
అయితే విమానం టేకాఫ్ కాకముందే ఈ ఘటన జరగడంతో హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరిలించారు. మా ప్రస్తుతం అగర్తలలోని ఐఎల్‌ఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అగర్వాల్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా విమానంలో మయాంక్‌కు ఇలా జరగడానికి గల స్పష్టమైన కారణాలైతే ఇంకా తెలియలేదు.
నిలకడగా మయాంక్ ఆరోగ్యం..
అయితే ప్రస్తుతం మయాంక్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. మయాంక్‌కు పెద్దగా ప్రమాదం లేదని, కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇదే విషయంపై ర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ షావీర్ తారాపూర్ స్పందించారు. షావీర్ మాట్లాడుతూ.. "మయాంక్ అగర్వాల్‌ను అగర్తలలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆకస్మిక అస్వస్థతకు కారణం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఈ ఘటనపై మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తోందని" చెప్పుకొచ్చాడు.