పచ్చబొట్టు చెరిగిపోదులే.. అనేది ఎంత నిజమో తాజాగా 'టాటూ' ఉదంతం చూస్తే మనకు తెలుస్తోంది.
ముంబై: పచ్చబొట్టూ చెరిగిపోదూలే.. అనేది ఎంత నిజమో తాజా ఉదంతం చూస్తే మనకు తెలుస్తోంది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం తప్పిపోయిన వ్యక్తి తన చేతిపై ఉన్న టాటూ ఆధారంగా కుటుంబాన్ని కలిసిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. 1989 వ సంవత్సరంలో అంటే 24 సంవత్సరాల క్రితం తప్పిపోయిన గణేష్ రాఘునాథ్ తన ఒంటిపై ఉన్న టాటూ ఆధారంగా తన తల్లి జాడ తెలుసుకున్నాడు. దీంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఈ మధ్య కాలంలో సోషల్ నెట్ వర్కింగ్ సాయంతో తప్పిపోయిన కొంతమంది తిరిగి తమ గూటికి చేరుతున్న విషయాలు తెలిసిందే. ఈ ఉదంతం మాత్రం ఆద్యంతం సినిమాను తలపిస్తోంది.
గణేష్ రాఘునాథ్ అనే వ్యక్తి ఆరేళ్ల వయస్సున్నప్పడు రైల్వే స్టేషన్ లో తప్పిపోయాడు. రైల్లో అతను ఎక్కడో ఉంటాడని అతనితో పాటు ఉన్న స్నేహితులు భావించారు. కాగా, అతని జాడ మాత్రం ఎంతకీ కనబడలేదు. ఆ విషయాన్ని తల్లి దండ్రులకు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. అతను కూడా ఇంటికి వెళ్లే దారి తెలియకపోవడంతో ముంబై వీధుల్లో కలియతిరిగాడు. అక్కడే రైల్వే ప్లాట్ ఫాంలను శుభ్రం చేస్తూ పొట్ట నింపుకునే వాడు. ఇలా రోడ్ల బాట పట్టిన ఆ బాలునికి ఓ మత్యకారుడు తారసపడ్డాడు. ఆ మత్యకారుని కొడుకు సాయినాథ్, ఆ బాలుడు రైల్లో అడుక్కోవటమే వారికి రోజు వారీ విధులు.
ఈ క్రమంలోనే ఓ రోజు అతను రైలు నుంచి జారిపడి తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైయ్యాడు. అనంతరం ఆ బాలుడ్ని ఆనంద్ ఆశ్రమంలో చేర్చారు. అక్కడే ఉండి చదువుకున్న అతను ప్రస్తుతం కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.