20 ఏళ్ల తర్వాత కలిపింది!
న్యూఢిల్లీ: సినిమా స్టోరీకి ఏమాత్రం తక్కువకాని వాస్తవమిది. ఢిల్లీలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లైబ్రరీలో పనిచేస్తున్న విజయ్ నిత్నావరే(48) ఇరవైఏళ్ల క్రితం ఇంట్లోనుంచి వెళ్లిపోయిన తన తమ్ముడు హన్స్‌రాజ్ కోసం తీవ్రంగా వెతికి ఎట్టకేలకు వారం క్రితం అతన్ని కలుసుకున్నాడు. మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన హన్స్‌రాజ్ పదోతరగతి ఫెయిల్ అవటంతో 1995లో ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అప్పుడు కుటుంబమంతా తీవ్రంగా వెతికినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత ఉద్యోగాన్వేషణలో అన్న విజయ్ ఢిల్లీవచ్చి పీఐబీలో ఉద్యోగంలో కుదరుకున్నారు.
కానీ తమ్ముడి కోసం వీలైనన్ని మార్గాల్లో అన్వేషించారు. ఈ పనిలో భాగంగానే గతేడాది తన తమ్ముడిని వెతికివ్వమని ఫేస్‌బుక్ కార్యాలయాన్ని సంప్రదించారు. వారు సేకరించిన ఆధారాల ప్రకారం మహారాష్ట్రలోని పుణెలో టయోటా కంపెనీలో హన్స్‌రాజ్ పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ కూడా కథ పలుమలుపులు తిరిగిన తర్వాత అన్నదమ్ములు ఒక్కటయ్యారు. 20 ఏళ్ల తర్వాత తమ్ముడిని కలిపినందుకు ఫేస్‌బుక్‌కు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు.