'దేవుని రాజ్యం'లో మరో దారుణం
తిరువనంతపురం: నిర్భయ ఘటనను తలపిస్తూ దళిత విద్యార్థినిని సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా చంపిన ఉదంతంలో ఆగ్రహజ్వాలలు చల్లారకముందే కేరళలో మరో ఘాతుకం చోటుచేసుకుంది. 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిని ఆమె స్నేహితుడు, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆటోలో గ్యాంగ్ రేప్ చేశాడు. తిరువనంతపురం జిల్లా వార్కాల పట్టణ శివారులోని అయంతి వద్ద మంగళవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు చెప్పిన వివరాలనుబట్టి..
19 ఏళ్ల దళిత విద్యార్థిని తిరువనంతపురంలోని కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెకు షైజు అనే ఓ స్నేహితుడు ఉన్నాడు. ఆటోడ్రైవర్ అయిన ఇతను మంగళవారం తన ఆటోలో విద్యార్థినిని వార్కాలకు తీసుకెళ్లాడు. దారి మధ్యలో షైజు స్నేహితులు మరో ఇద్దరు ఆటో ఎక్కారు. వార్కాల శివారులోని నిర్జన ప్రదేశంలో ఆటోను నిలిపి, బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రమైన భ్రాంతితో మూర్ఛకు గురైన ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు.
కొద్ది సేపటి తర్వాత బాధితురాలి ఆర్తనాదాలు విన్న కొంరు వ్యక్తులు ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం బాధితురాలు తిరువనంతపురం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతోంది. బుధవారం కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులకోసం గాలిస్తున్నారు. షైజుతో పాటు మరో నిందితుడిని సుజిత్ గా బాధితురాలు గుర్తించిందని పోలీసులు చెప్పారు.
'దేవుని రాజ్యం(గాడ్స్ ఓన్ కంట్రీ)' గా పేరుపొందిన కేరళలో వారంరోజుల వ్యవధిలోనే రెండు దారుణ సామూహిక అత్యాచార సంఘటనలు వెలుగులోకి రావడం, అదికూడా ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే చోటుచేసుకోవడం గమనార్హం. ఎర్నాకుళం జిల్లా పెరంబవూర్ లో లా కాలేజి విద్యార్థినిపై ఆమె ఇంట్లోనే అత్యాచారం చేసి, హత్యచేసిన కేసును జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే. బాధితురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం ఊమెన్ చాందీ తెలిపారు. మరి తాజా ఘటనపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తో, నిందితులను పట్టుకుని శిక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడలి.