లాలూ ర్యాలీకి సోనియాగాంధీ దూరం
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం బిహార్ రాజధాని పట్నాలో నిర్వహిస్తున్న విపక్షాల ర్యాలీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దూరంగా ఉండనున్నారు. అవినీతి కేసులున్న లాలూ చేపడుతున్న ఈ ర్యాలీకి సోనియా, రాహుల్ హాజరైతే తమ పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని బిహార్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, సీపీ జోషీ ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నుంచి లాలూకు వర్తమానం అందింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జేడీయూ తిరుగుబాటు నేత శరద్ యాదవ్ హాజరు కానున్నారు. కాగా బీఎస్పీ అధినేత్ర మాయావతి కూడా లాలూ ర్యాలీకి దూరంగా ఉండనున్నారు. ఆ పార్టీ తరపు నుంచి సీనియర్ నేత సతీష్ మిశ్రా హాజరు అవుతారు.
మరోవైపు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమై పోరాడాలన్న లాలూ పిలుపుకు చివరి నిమిషంలో కీలక నేతలంతా ఒక్కోక్కరుగా హ్యాండిస్తూ వస్తుండటం లాలూను కంగారు పెడుతోంది. 2019 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వినిపిస్తున్న ‘బీజేపీ హఠావో.. దేశ్ బచావో’. అన్న నినాదం వర్కవుట్ అవుతుందా? అన్నది తెలియాలంటే ఆదివారం జరిగే లాలూ ర్యాలీ కార్యక్రమం వరకూ వేచి చూడాల్సిందే.