
జమ్మూ కశ్మీర్‌లో మా కాన్వాయ్‌లకు మరిన్ని కొత్త సౌకర్యాలు కల్పించాలని మేం నిర్ణయించాం.
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో తమ బలగాల, వాహనాల తరలింపునకు ఉన్న ప్రామాణిక కార్యాచరణ విధానాల(ఎస్‌వోపీ)ను మరింత మెరుగుపరుస్తున్నట్లు సీఆర్‌పీఎఫ్ ఆదివారం వెల్లడించింది. గత గురువారం పుల్వామాలో ఉగ్రవాద దాడి జరగడంతో బలగాలకు మరింత భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకుంది.
‘జమ్మూ కశ్మీర్‌లో మా కాన్వాయ్‌లకు మరిన్ని కొత్త సౌకర్యాలు కల్పించాలని మేం నిర్ణయించాం. బలగాల వాహన శ్రేణి వెళ్తున్న సమయంలో పౌర వాహనాలను నిలిపివేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మా వాహనాలు బయలుదేరే సమయం, మార్గం మధ్యలో ఆగే ప్రదేశాలు, ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీస్ వంటి ఇతర భద్రతా దళాలతో సమన్వయం తదితరాల్లోనూ వ్యూహాత్మక మార్పులు చేస్తున్నాం’ అని సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆర్ ఆర్ భట్నాగర్ పీటీఐకి చెప్పారు. పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.