ముంబై : మంత్రాలయలో ఏడు రోజుల్లో సుమారు 3 లక్షల ఎలుకలను చంపారనే ఆరోపణపై వివాదం చెలరేగిన వెంటనే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కార్యాలయంలో భారీ టీ స్కాం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో రోజుకి సగటున 18,500 కప్పుల టీ సర్వ్ చేస్తున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గత మూడేళ్లుగా సీఎంఓలో టీ వినియోగం పెరుగుతూ వచ్చిందని, దానికి తగ్గ ఖర్చులు కూడా పెరుగుతూ వచ్చాయని ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ అన్నారు. ఆర్‌టీఐ ద్వారా పొందిన డాక్యుమెంట్లను ట్విటర్‌లో పొందుపరిచారు. ఆర్‌టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన సమాచారం మేరకు 2015-16లో టీకి వెచ్చించిన ఖర్చు సుమారు రూ.58 లక్షలు గాక, 2017-18లో సుమారు రూ.3.4కోట్లగా నమోదైనట్టు కాంగ్రెస్ లీడర్ పేర్కొన్నారు. అంటే 577 శాతం మేర పెరిగినట్టు తెలిపారు. అంటే సగటున సీఎంఓలో రోజూ 18,591 కప్పుల టీ సర్వ్ చేస్తున్నారన్నారు. ఇదెలా సాధ్యమంటూ ఆయన ప్రశ్నించారు.
ఎలాంటి టీని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తాగుతారు? అని ప్రశ్నించగా.. తమకు తెలిసినంత వరకు ఆయన గ్రీన్ టీ, ఎల్లో టీ.. వంటివి తాగుతారని నిరుపమ్ పేర్కొన్నారు. అయితే ‘గోల్డెన్ టీ’కి సీఎం, సీఎంఓ ఎక్కువగా వెచ్చిస్తుందని, దీనికి ఎక్కువ మొత్తంలో ఖర్చు వస్తుందని చెప్పారు. సీఎంఓ టీ బిల్లుల్లో అవినీతి చోటు చేసుకుందని తెలిపిన ఆయన... ప్రధాన మంత్రి ‘ఛాయ్‌వాలా’ అని చెప్పుకుంటూ ఎంతో గొప్పగా ఫీలవుతారని, మరోవైపు ఫడ్నవిస్ అనవసరంగా టీకి ఎక్కువగా వెచ్చిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ప్రధాని, మహారాష్ట్ర సీఎం ఇద్దరూ కూడా దేశాన్ని ఛాయ్‌తోనే నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే ప్రతిరోజూ సీఎంఓలో 18,000 కన్నా ఎక్కువ మందికి టీ సర్వ్ చేయడం సాధ్యమయ్యే పనేనా? అని నిరుపమ్ అన్నారు. లేదా ఆ టీ అంతటిన్నీ మంత్రాలయంలోని ఎలుకలు తాగాల్సిందేనన్నారు. మహారాష్ట్ర సచివాలయంలో ఎలుకలు పట్టుకునేందుకు ఇచ్చిన కాంట్రాక్ట్ విషయంలో అవకతవకలు జరిగినట్లు కొన్ని రోజుల క్రితమే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం ఒక్క వారంలో మంత్రాలయలో సుమారు 3 లక్షల ఎలుకలను తొలగించినట్టు బీజేపీ మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే చెప్పారు. ఎలుకల స్కాం మాదిరి సీఎంఓ ఆఫీసులో భారీ మొత్తంలో టీకి కూడా వెచ్చించినట్టు నిరుపమ్ ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment