
అగ్ని-3 పరీక్ష విజయవంతం
హైదరాబాద్: మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-3ను రక్షణశాఖ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవిలో గురువారం ఉదయం 9.12 గంటలకు దీనిని ప్రయోగించామని డీఆర్‌డీవో ప్రకటించింది. ఈక్షిపణి 3,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఒకటిన్నర టన్నుల బరువైన అణ్వస్త్రాలను సైతం తీసుకెళ్లగలిగే సామర్ధ్యం దీని సొంతం. ఈ క్షిపణి పొడవు 17 మీటర్లు కాగా బరువు 2,200 కిలోలు.
కాగా, క్షిపణి ప్రయోగం నేపథ్యంలో చెన్నై నుంచి బయలుదేరాల్సిన ఆరు విమానాలు ఆలస్యంగా వెళ్లాయి. ఒడిశా సముద్ర తీరంలోని అబ్దుల్ కలాం దీవి ప్రాంతంలో విమానాల రాకపోకలపై గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిషేధం విధించారు. చెన్నై నుంచి సింగపూర్, మలేషియా వంటి దేశాలకు వెళ్లే అన్ని విమానాలు ఒడిశా సముద్ర తీరం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రయాణికులకు ముందుగానే సమాచారం అందించారు. విషయం తెలియని కొందరు ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చి అవస్థలు పడ్డారని అధికారులు తెలిపారు.
అగ్ని-3 ప్రత్యేకతలివీ..
* నిర్థేశిత లక్ష్యం పరిధి: 3000 కిలోమీటర్లు
* ఇది రెండు దశల దృఢమైన ప్రొపెల్లెంట్ వ్యవస్థ కలిగి ఉంటుంది.
* దీని పొడవు 17 మీటర్లు.. వ్యాసం 2 మీటర్లు.. బరువు దాదాపు 2,200 కిలోలు
* 1.5 టన్నుల బరువున్న అణ్వస్త్రాలను ఇది మోసుకుపోగలదు.
* అధునాతన నావిగేషన్, గెడైన్స్, నియంత్రణ వ్యవస్థలు కలిగిన ఈ క్షిపణి కోసం అధునాతన కంప్యూటర్ వ్యవస్థను వినియోగిస్తున్నారు.