
నా తర్వాత టార్గెట్ అదే: అహ్మద్ పటేల్
రాజ్యసభకు ఐదోసారి ఎన్నిక కావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ హర్షం వ్యక్తం చేశారు.
అహ్మదాబాద్: రాజ్యసభకు ఐదోసారి ఎన్నిక కావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ హర్షం వ్యక్తం చేశారు. తనను గెలిపించిన ఎమ్మెల్యేలకు ఆయన ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. తనను ఓడించేందుకు విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టడంతో పాటు అధికార బలాన్ని ఉపయోగించారని ఆయన ఆరోపించారు. తన తర్వాతి టార్గెట్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలంటూ భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. ఇది తన విజయం కాదని.. రాష్ట్రంలో అధికారం, డబ్బు విచ్చలవిడి పంపకం ఓటమి పాలయ్యాయని అహ్మద్ పటేల్ పేర్కొన్నారు.
గుజరాత్‌లో మూడు రాజ్యసభ స్థానాల కోసం మంగళవారం నిర్వహించిన ఎన్నికల్లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు, ఓ కాంగ్రెస్ అభ్యర్థి బరిలో నిలిచారు. బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీలు నెగ్గగా, బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్ మాత్రం ఓటమి పాలయ్యారు. అయితే తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల్లోనూ అహ్మద్ పటేల్ మ్యాజిక్ ఫిగర్ (44) ఓట్లతో విజయం సాధించారు. అమిత్‌షాకు 46 ఓట్లు, స్మృతీ ఇరానీకి 45 ఓట్లు పోలవ్వగా బల్వంత్ సిన్హ్ రాజ్‌పుత్‌కు 39 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. బల్వంత్ సిన్హ్ ఇటీవలే కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.