అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ వస్తుందా.. రాదా అనే అంశం తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. ఒకవేళ జయలలితకు బెయిల్ రాకపోతే.. తమిళనాడులో ఉన్న కన్నడిగులను బందీలుగా చేస్తామని హెచ్చరిస్తూ బెంగళూరులో పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. సీబీఐ ప్రత్యేక కోర్టు ఇంతకుముందు అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా నిర్ధారిస్తూ, ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ ఇప్పించాలని కోరుతూ జయలలిత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నడిగులను బెదిరిస్తూ పోస్టర్లు వెలిశాయి.
దాంతో.. ఈ పోస్టర్ల వ్యవహారంపై బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి చెన్నై పోలీసులతో మాట్లాడారు. అయితే, తమిళనాడులో ఉన్న కన్నడిగులెవరికీ ఎలాంటి ప్రమాదం లేదని, ఇకముందు కూడా ముప్పు తలెత్తకుండా తాము చూసుకుంటామని అక్కడి పోలీసులు హామీ ఇచ్చారు. ఎవరైనా ఉద్రిక్తతలకు తావిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా ఇప్పటికే బెంగళూరు సెంట్రల్ జైలు వద్ద నిషేధాజ్ఞలు విధించారు. పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు సెప్టెంబర్ 27వ తేదీ నుంచే నిరసనలు, నిరాహార దీక్షలు ప్రారంభించారు. జయలలితకు మద్దతుగా సంతకాల ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. మంగళవారం నాడు తమిళనాడులో స్కూళ్లు, కాలేజీలకు ఎలాంటి సెలవు ఇచ్చేది లేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.
బెయిలు రాకపోయిందో.. మీ గతి అంతే!
Published Tue, Oct 7 2014 1:24 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM
Advertisement