భారత వాయుసేన(ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ అరుణ్ మర్వాహా
న్యూఢిల్లీ: భారత వాయుసేన(ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ అరుణ్ మర్వాహా(51)ను గూఢచర్యం ఆరోపణల కింద ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిల ముసుగు(హనీట్రాప్)లో పరిచయమైన ఇద్దరు ఐఎస్‌ఐ ఏజెంట్లకు అరుణ్ రహస్య సమాచారాన్ని చేరవేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిపై అధికారిక రహస్యాల చట్టంలోని సెక్షన్ 3, 5 కింద కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఐఏఎఫ్ ప్రధాన కార్యాలయంలో పారా జంపింగ్‌తో పాటు గరుడ కమెండోలకు అరుణ్ శిక్షకుడిగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
గతేడాది డిసెంబర్‌లో ఇద్దరు ఐఎస్‌ఐ ఏజెంట్లు మోడల్స్‌గా అరుణ్‌కు ఫేస్‌బుక్‌లో పరిచయమైనట్లు పేర్కొన్నారు. వీరిద్దరూ అరుణ్‌తో వాట్సాప్‌లో తరచుగా సంభాషించేవారనీ, రొమాంటిక్ సందేశాలను పంపేవారని తెలిపారు. కొద్దిరోజుల తర్వాత నిందితుడికి ఐఎస్‌ఐ ఏజెంట్లు అమ్మాయిల అశ్లీల చిత్రాలు పంపేవారనీ, ఇందుకు ప్రతిగా ఐఏఎఫ్‌కు చెందిన రహస్య సమాచారాన్ని అందజేయాల్సిందిగా కోరేవారని వెల్లడించారు. వీరి వలలో చిక్కుకున్న అరుణ్ సైబర్ విభాగం, అంతరిక్ష రంగంతో పాటు ‘గగన్ శక్తి’ వంటి ఐఏఎఫ్ ప్రత్యేక ఆపరేషన్లకు సంబంధించిన రహస్య పత్రాలను వాట్సాప్ ద్వారా ఐఎస్‌ఐకి చేరవేశాడని పేర్కొన్నారు.
అరుణ్ ప్రవర్తనపై అనుమానమొచ్చిన ఓ ఐఏఎఫ్ ఉన్నతాధికారి అంతర్గత విచారణకు ఆదేశించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు. దీంతో జనవరి 31న అరుణ్‌ను ఐఏఎఫ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ అదుపులోకి తీసుకుందని తెలిపారు. దాదాపు 10 రోజుల విచారణ అనంతరం అరుణ్‌ను ఇక్కడి పటియాలా కోర్టుకు బుధవారం తరలించగా.. న్యాయస్థానం ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించిందని వెల్లడించారు. అరుణ్ ఫోన్‌ను ఇప్పటికే ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామనీ, ఈ కుట్రలో నిందితుడితో పాటు మరెవరైనా ఉన్నారా? అన్న విషయమై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో దోషిగా తేలితే అరుణ్‌కు 14 ఏళ్ల వరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment