
సాక్షి, న్యూడిల్లీ : ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ఉద్యోగి ఒకరు కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఢిల్లీలోని ఎయిరిండియా ప్రధాన కార్యాల్యాయాన్ని మూసి వేశారు. పూర్తి శానిటైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు రెండు రోజుల పాటు ఆఫీసుకు సీలు వేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు.
తమ కార్యాలయంలోని ప్యూన్‌కు కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని, దీంతో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ సింగ్ ఖరోలాతో సహా అందరూ ఇంటి నుండే పని చేస్తారని ఎయిరిండియా మంగళవారం తెలిపింది. బాధితుడు ప్రస్తుతం రామ్ మనోహర్ లోహియా (ఆర్‌ఎంఎల్) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ప్రకటించింది.
కాగా లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకొచ్చే కార్యక్రమం వందే భారత్ మిషన్‌లో పాల్గొనే ఏకైక విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. మే 7- మే 14 మధ్య 64 విమానాల ద్వారా 12 దేశాల నుండి 15 వేల మందిని తీసుకురావాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో 70,000 మందికి పైగా కరోనా బారిన పడగా, 2,290 మంది మరణించారు. మరోవైపు కరోనా కట్టడిలో భాగంగా కొన్ని సడలింపులతో మే 17 వరకు లాక్‌డౌన్ మూడవ దశ కొనసాగుతోంది. (లాక్‌డౌన్ : గోవా కీలక నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment