ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ , లాక్‌డౌన్ కాలంలో సంక్షోభంలో పడిన దేశీయ విమానయాన సంస్థలకు ఉపశమనం కలిగించేలా సుప్రీంకోర్టు తాజా తీర్పునిచ్చింది. కరోనా కట్టడి, సోషల్ డిస్టెన్సింగ్ కోసం విమాన ప్రయాణాల్లో విధించిన మధ్యసీటు ఖాళీ నిబంధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించిన సుప్రీం మధ్య సీటు ఖాళీగా ఉంచాల్సిన అవసరం లేదని శుక్రవారం స్పష్టం చేసింది.
బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసిన ఎయిరిండియా పైలట్ దేవెన్ కానన్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ భూషణ్ గవైలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అభ్యర్ధనను తిరస్కరించింది. తద్వారా ఎయిరిండియాతో పాటు ఇతర దేశీయ విమానయాన సంస్థలకు మధ్య సీటును భర్తి చేసుకునేందుకు అనుమతించింది. (అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు)
దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన విమాన ప్రయాణాలు రెండు నెలల తర్వాత మే 25న సేవలను తిరిగి ప్రారంభించాయి. అయితే ఈ సందర్భంగా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు పౌర విమానయాన శాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా విమాన ప్రయాణంలో ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ సోకే ప్రమాదం లేకుండా మిడిల్ సీటును ఖాళీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీసీఏ విమానయాన సంస్థలను ఆదేశించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment