సాక్షి, ముంబై: ఎయిర్ ఇండియా కాంట్రాక్టు ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడంతో ముంబై విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. చాలా విమానాలు ఆలస్యమయ్యాయి. ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించిన తమ సహచరుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న డిమాండ్‌తో బుధవారం రాత్రి నుంచి కిందిస్థాయి కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె చేపట్టారు.
‘ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ (ఏఐఏటీఎస్) ఉద్యోగులు ఒక్కసారిగా సమ్మెకు దిగడంతో కొన్ని విమానాలు ఆలస్యమయ్యాయి. పరిస్థితిని అంచనా వేస్తున్నాం. విమాన రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నామ’ని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు.
అయితే సమ్మె కారణంగా ఎన్ని విమానాలకు ఆటంకం కలిగిందనేది స్పష్టంగా వెల్లడి కాలేదు. పరిస్థితిని చక్కదిద్దేందుకు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయిన ఎయిర్ ఇండియా ఉద్యోగులను మళ్లీ వెనక్కి పిలిచినట్టు తెలుస్తోంది. మరోవైపు విమానాల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment