
లండన్/ముంబై: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం నెవార్క్ సిటీకి వెళ్లడానికి గురువారం ఉదయం ముంబై నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఏఐ191 భద్రతా కారణాలతో లండన్‌లో ల్యాండయ్యింది. విమానంలో బాంబు ఉన్నట్లు హెచ్చరికలు రావడంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని దారి మళ్లించి లండన్‌లోని స్టాన్‌స్టెడ్ ఎయిర్‌పోర్ట్‌లో దించారు. బ్రిటన్ యుద్ధ విమానాలు రక్షణగా ఉండి ఏఐ191ను విమానాశ్రయానికి తీసుకొచ్చాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.50 గంటలకు (భారత కాలమానంలో మధ్యాహ్నం 3.20 గంటలకు) ఏఐ–191 విమానం లండన్‌లో దిగింది. ఆ సమయంలో స్టాన్‌స్టెడ్ విమానాశ్రయాన్ని కొద్దిసేపు మూసివేశారు. ఏఐ–191 నుంచి మొత్తం 327 మంది ప్రయాణికులను కిందకు దింపారు. విమానంలో బాంబులు ఏవీ దొరకక పోవడంతో ఆ బెదిరింపులు నకిలీవని తేలింది.
గాలిలోనే పేలిపోతుందంటూ ఈమెయిల్
విమానం బయలుదేరిన అనంతరం ముంబై విమానాశ్రయ అధికారులకు ఓ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. సెర్గీ సెలిజ్‌నెవ్, నటాలియా ఝ్మురినా అనే వ్యక్తులు ఈమెయిల్ పంపుతూ, ముంబై నుంచి నెవార్క్ వెళ్తున్న విమానం గాలిలోనే పేలిపోతుందని బెదిరించారు. దాంతోపాటు లుఫ్తాన్సా విమానయాన సంస్థకు చెందిన ముంబై–మ్యూనిక్, స్విస్ ఎయిర్‌కు చెందిన ముంబై–జ్యూరిక్ విమానాలూ ఇలా గాల్లో పేలతాయని గురువారం ఉదయం 10.30 గంటలకు ఆ ఈ–మెయిల్ వచ్చింది. అయితే ముంబై–మ్యూనిక్, ముంబై–జ్యూరిక్ విమానాలు అప్పటికే వాటి గమ్యస్థానాలకు చేరుకున్నాయి. ఎయిరిండియా విమానం లగేజీల్లో శక్తిమంతమైన బాంబు పెట్టామనీ, విమానం గాలిలో ఉండగా అది పేలుతుందని ఈమెయిల్‌లో దుండగులు బెదిరించారు.
Comments
Please login to add a commentAdd a comment