ఆలస్యానికి ఎంపీ 15 లక్షల భారీ మూల్యం!
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మీద నిషేధాన్ని ఎయిరిండియాతో పాటు ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు సైతం ఎత్తివేసిన విషయం తెలిసిందే. అయితే నిషేధం మాత్రమే ఎత్తివేశాం కానీ, చట్టపరంగా పోరాటం చేస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది. తమ ఉద్యోగిపై దాడి చేసినందుకుగానూ అతడికి క్షమాపణ చెప్పకుండానే నిషేధం నుంచి బయటపడటంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మార్చి23న జరిగిన వివాదంలో ఎయిర్ క్రాఫ్ట్ (ఏఐ 852)ను 90 నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చినందున అందుకు నష్టపరిహారంగా గైక్వాడ్ రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఎయిర్ ఇండియా స్పష్టంచేసింది. గైక్వాడ్ కారణంగానే సర్వీస్ ఆలస్యమైందని.. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకునేందుకు ఆ సంస్థ సన్నద్ధమైంది.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్‌ఐఏ)లో సభ్యత్వం ఉన్న ఇండిగో, స్పైస్ జెట్, గోఎయిర్, టాటా గ్రూపు ఎయిర్‌లైన్స్, విస్తారా, ఎయిర్‌ఏషియా ఇండియా తదితర సంస్థలు మార్చి 24వ తేదీ నుంచి ఎంపీ గైక్వాడ్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశాయి. ఎప్ఐఏలో సభ్యత్వం ఉన్న విమానయాన సంస్థలన్నీ గైక్వాడ్‌ను తమ విమానాల్లో అనుమతించాలని నిర్ణయించినట్లు ఎఫ్‌ఐఏ డైరెక్టర్ ఉజ్వల్ డే శనివారం తెలిపారు. ఎంపీ గైక్వాడ్ తమ సిబ్బందిని గౌరవించాలని, వాళ్లు ప్రతిరోజూ ఎంతగానో కష్టపడుతున్నారని.. విమాన ఆస్తులకు నష్టం కలిగించకూడదని ఆ సంస్థలు గైక్వాడ్ కు సూచించాయి.
దాదాపు రెండు వారాల పాటు గైక్వాడ్ విమానయాన నిషేధం ఎదుర్కొన్న తర్వాత ప్రభుత్వ సూచన మేరకు ఆ నిషేధాన్ని ఎత్తేశాయి. రవీంద్ర గైక్వాడ్ క్షమాపణలు తెలిపారని, ఈ మేరకు లేఖ కూడా అందజేశారని.. గైక్వాడ్ ఇక మీదట సత్ప్రవర్తన కలిగి ఉంటానని హామీ కూడా ఇచ్చారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలపడంతో విమాన సంస్థలు శాంతించాయి.