మహిళలతో ప్రపంచంలో తొలిసారిగా..!
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా యాజమాన్యం ప్రపంచంలోనే తొలిసారిగా ఓ అరుదైన రికార్డును నెలకొల్పారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని రోజుల ముందే కేవలం మహిళా సిబ్బందితోనే విమాన సర్వీసును నడిపి శభాష్ అనిపించుకున్నారు. గత నెల 27న బోయింగ్ 777-200 ఎల్‌ఆర్ విమానం ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లింది. ఫసిఫిక్ మీదుగా విమానాన్ని నడిపారు. తిరుగు ప్రయాణంలో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి అట్లాంటిక్ సముద్రం మీదుగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయానికి ఈ విమాన సర్వీసును కేవలం మహిళా సిబ్బందితోనే రన్ చేసి రికార్డు సృష్టించారు.
రెండు రోజుల కిందట తాము ఈ ఫీట్ నమోదు చేశామని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులకు దరఖాస్తు చేశామని చెప్పారు. క్యాబిన్ సిబ్బంది, కాక్ పిట్, చెక్ ఇన్, గ్రౌండ్ స్టాఫ్, ఇంజినీర్లు ఇలా అన్ని విభాగాలతో పాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లుగా మహిళా సిబ్బందితోనే విమాన సర్వీస్ రన్ చేసినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇక నుంచీ కేవలం మహిళా సిబ్బందితోనే కొన్ని విమానాలు నడిపే యోచనలో ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి వివరించారు.