సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ నగరంలో ప్రమాదస్థాయికి చేరుకున్న కాలుష్యాన్ని నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఇరుగు, పొరుగు రాష్ట్రాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ‘వాతావరణ కాలుష్యం వల్ల ఎవరు మరణించరు. జబ్బుపడతారంతే. ఇప్పటికే శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారికి మరింత బాధ కలుగుతుంది. కాలుష్యం కారణంగా ఎవరైనా మరణించినట్లు ఇంతవరకు ఏ వైద్యుడైన మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారా?’ ‘ న్యూస్ 18’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల ప్రశ్నించారు.
‘కాలుష్యం కారణంగా భారత్‌లో ఎంతో మంది చనిపోతున్నారని సార్వత్రికంగా చెప్పకూడదు. భారత్‌లో కాలుష్యం ఎంత ఉంది? అది భారతీయుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? అన్న అంశాలపై దేశీయంగా దేశీయ ప్రమాణాల మేరకు అధ్యయనం చేయాల్సి ఉంది’ అని ఆయన ఇటీవల ఎన్డీటీవీకి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
‘కాలుష్యం అనేది స్లో పాయిజన్ లాంటిది. మనుషులు, ముఖ్యంగా పిల్లల్లో కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిని ప్రాణాలు పోతాయి’ అని కాలుష్యం–ఆరోగ్యం అన్న అంశంపై లాన్సెట్ కమిషన్ రూపొందించిన నివేదికను ఫిబ్రవరి నెలలో విడుదల చేసినప్పుడు ఇదే హర్షవర్దన్ వ్యాఖ్యానించారు. ఒక్క 2015 సంవత్సరంలోనే భారత దేశంలో 25 లక్షల మంది కాలుష్యం కారణంగా ఆయుష్షు తీరకముందే చనిపోయారని నాడు ఆ నివేదిక వెల్లడించింది. దేశంలో అత్యధిక మంది ప్రాణాలు తీస్తున్న భూతం కాలుష్యమని, కేవలం శ్వాసకోష వ్యాధులే కాకుండా వ్యాస్కులర్ గుండె జబ్బులు కూడా ఈ కాలుష్యం వల్ల వస్తున్నాయని ఈ ఏడాది నివేదికలో కూడా లాన్సెట్ కమిషన్ వెల్లడించింది.
ఒక్క లాన్సెట్ కమిషన్ జరిపిన అధ్యయనంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు జరిపిన అనేక అధ్యయనాల్లో కాలుష్యం ఎంత ప్రమాదకరమో తేలింది. 2015లో వాతావరణ కాలుష్యంపై కేంద్ర ఆరోగ్య శాఖ నియమించిన 16 సభ్యుల కమిటీ కూడా దేశంలోని అన్ని నగరాలను కాలుష్య రహితం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది. ఈ విషయమై ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్’ సంస్థ 2010లో విడుదల చేసిన ఓ నివేదికను ఉదహరించింది. వంట ఇంధన కాలుష్యం వల్ల భారత్‌లో 14 మంది ఆయుష్షు తీరకముందే మరణించగా, వాతావరణ కాలుష్యం వల్ల 6,27,000 మంది మరణించారని ఆ నివేదిక వెల్లడించింది.
భారత్‌లో వాతావరణ కాలుష్యంపైనే కాకుండా అన్ని రకాల కాలుష్యంపై ప్రత్యేక అధ్యయనం జరపాలని పర్యావరణ మంత్రి హర్షవర్దన్ అనడంలో తప్పులేదు. కాలుష్యం స్లో పాయిజన్ లాంటిదని, మనిషి ప్రాణాలను మెల్లగా హరిస్తుందని ఒప్పుకున్న ఆయన ఇటీవల మాట మార్చి అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడడంలో మాత్రం అర్థం లేదు.
Comments
Please login to add a commentAdd a comment