minister harshvardhan
-
‘జిల్లా ఆస్పత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చండి’
సాక్షి, హైదరాబాద్: జిల్లా ఆస్పత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చాలని మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కలిసి విన్నవించారు. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా ఆధునీకరించాలని విన్నవించారు. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద కొత్త బ్లాక్స్ ఏర్పాటుపై కేంద్ర మంత్రితో ఈటల చర్చించారు. మాతాశిశు ఆరోగ్య కేంద్రాలు, కొత్త వైద్య కళాశాలలు మంజూరు చేయాలని కోరారు. మరోవైపు ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటుపై ఈటల చర్చించారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే కేంద్రమంత్రితో ఈటల సమగ్రంగా ఏమేం చర్చించారన్న విషయాన్ని కార్యాలయ వర్గాలు పూర్తిస్థాయిలో వెల్లడించకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఇదిలాఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ‘అందరికీ అందుబాటులోకి ఆధునిక వైద్య పరికరాలు’అనే లక్ష్యంతో ‘వైద్య పరికరాలు–సేవలు’పేరుతో మంగళవారం ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యేందుకు ఈటల ఢిల్లీ వెళ్లారు. కాగా, మన శాస్త్ర విజ్ఞానం రోగులకు అతి తక్కువ ధరకు వైద్యం అం దించేందుకు ఉపయోగపడాలని ఈటల కోరారు. సోమవారం హైదరాబాద్‌లో హెల్త్ అండ్ ఫార్మా సదస్సు జరిగింది. -
‘కాలుష్యంతో మరణం’ అంటూ సర్టిఫికేట్ ఇస్తే తప్ప కదలరా?
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ నగరంలో ప్రమాదస్థాయికి చేరుకున్న కాలుష్యాన్ని నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఇరుగు, పొరుగు రాష్ట్రాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ‘వాతావరణ కాలుష్యం వల్ల ఎవరు మరణించరు. జబ్బుపడతారంతే. ఇప్పటికే శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారికి మరింత బాధ కలుగుతుంది. కాలుష్యం కారణంగా ఎవరైనా మరణించినట్లు ఇంతవరకు ఏ వైద్యుడైన మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారా?’ ‘ న్యూస్ 18’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల ప్రశ్నించారు. ‘కాలుష్యం కారణంగా భారత్‌లో ఎంతో మంది చనిపోతున్నారని సార్వత్రికంగా చెప్పకూడదు. భారత్‌లో కాలుష్యం ఎంత ఉంది? అది భారతీయుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? అన్న అంశాలపై దేశీయంగా దేశీయ ప్రమాణాల మేరకు అధ్యయనం చేయాల్సి ఉంది’ అని ఆయన ఇటీవల ఎన్డీటీవీకి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘కాలుష్యం అనేది స్లో పాయిజన్ లాంటిది. మనుషులు, ముఖ్యంగా పిల్లల్లో కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిని ప్రాణాలు పోతాయి’ అని కాలుష్యం–ఆరోగ్యం అన్న అంశంపై లాన్సెట్ కమిషన్ రూపొందించిన నివేదికను ఫిబ్రవరి నెలలో విడుదల చేసినప్పుడు ఇదే హర్షవర్దన్ వ్యాఖ్యానించారు. ఒక్క 2015 సంవత్సరంలోనే భారత దేశంలో 25 లక్షల మంది కాలుష్యం కారణంగా ఆయుష్షు తీరకముందే చనిపోయారని నాడు ఆ నివేదిక వెల్లడించింది. దేశంలో అత్యధిక మంది ప్రాణాలు తీస్తున్న భూతం కాలుష్యమని, కేవలం శ్వాసకోష వ్యాధులే కాకుండా వ్యాస్కులర్ గుండె జబ్బులు కూడా ఈ కాలుష్యం వల్ల వస్తున్నాయని ఈ ఏడాది నివేదికలో కూడా లాన్సెట్ కమిషన్ వెల్లడించింది. ఒక్క లాన్సెట్ కమిషన్ జరిపిన అధ్యయనంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు జరిపిన అనేక అధ్యయనాల్లో కాలుష్యం ఎంత ప్రమాదకరమో తేలింది. 2015లో వాతావరణ కాలుష్యంపై కేంద్ర ఆరోగ్య శాఖ నియమించిన 16 సభ్యుల కమిటీ కూడా దేశంలోని అన్ని నగరాలను కాలుష్య రహితం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది. ఈ విషయమై ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్’ సంస్థ 2010లో విడుదల చేసిన ఓ నివేదికను ఉదహరించింది. వంట ఇంధన కాలుష్యం వల్ల భారత్‌లో 14 మంది ఆయుష్షు తీరకముందే మరణించగా, వాతావరణ కాలుష్యం వల్ల 6,27,000 మంది మరణించారని ఆ నివేదిక వెల్లడించింది. భారత్‌లో వాతావరణ కాలుష్యంపైనే కాకుండా అన్ని రకాల కాలుష్యంపై ప్రత్యేక అధ్యయనం జరపాలని పర్యావరణ మంత్రి హర్షవర్దన్ అనడంలో తప్పులేదు. కాలుష్యం స్లో పాయిజన్ లాంటిదని, మనిషి ప్రాణాలను మెల్లగా హరిస్తుందని ఒప్పుకున్న ఆయన ఇటీవల మాట మార్చి అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడడంలో మాత్రం అర్థం లేదు. -
ఈసారీ తక్కువ వర్షాలే!
న్యూఢిల్లీ: ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంది. ముఖ్యంగా దేశంలోని మధ్య, వాయవ్య ప్రాంతాల్లో అతి తక్కువ వర్షాలు పడతాయని, ఈశాన్య, దక్షిణాదిలో మాత్రం సాధారణ వర్షాలు పడొచ్చని తెలిపింది. వచ్చే వర్షాకాలంలో ఎన్‌నినో ఏర్పడే అవకాశం 70 శాతం ఉందని భారత వాతావరణ శాఖ దీర్ఘకాలిక అంచనాల విభాగం డెరైక్టర్ డీఎస్ పాయ్ వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావంతో సముద్ర జలాలు వేడెక్కడం వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. దీనిపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 93 శాతమే ఉంటుందన్నారు. దీర్ఘకాలిక సగటులో 90 నుంచి 96 శాతం వర్షం పడితే సాధారణం కంటే తక్కువగా పరిగణిస్తారు. 96 నుంచి 104 శాతం నమోదైతే సాధారణ వర్షపాతంగా గుర్తిస్తారు. దీంతో ఈ ఏడాది కరువు పరిస్థితులు ఏర్పడటానికి 33 % అవకాశముందని మంత్రి వివరించారు. వాతావరణ ప్రభావాన్ని ఎదుర్కొనడానికి సన్నద్ధంగా ఉంటామని వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ చెప్పారు. -
భారత మేధావులను తిరిగి రప్పిస్తాం: హర్షవర్ధన్
విదేశాల్లో ఉన్నవారిని రప్పించడానికి ప్రణాళిక సిద్ధం: కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలు సగానికిపైగా తగ్గినప్పటికీ చౌక, పర్యావరణ అనుకూలమైన ఇంధన వనరుల అభివృద్ధికి భారతదేశం తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రధాని మోదీ ‘మేకిన్ ఇండియా’ పిలుపునకు శాస్త్ర, సాంకేతిక రంగాలనే ఆలంబనగా చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి హర్షవర్ధన్, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయమంత్రి వై.సుజనా చౌదరి మాట్లాడారు. అమెరికాతోపాటు అనేక ధనికదేశాల్లో పరిశోధన.. అభివృద్ధి రంగాలు, పరిశ్రమల ఏర్పాటులో ఆసక్తి సన్నగిల్లుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారత సంతతి మేధావులను స్వదేశానికి తిరిగి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం విసృ్తత స్థాయి ప్రణాళికను సిద్ధం చేసిందని హర్షవర్ధన్ తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని వారు భారత్‌లోనే మెరుగైన వేతనాలతో పరిశోధనలు కొనసాగించేందుకు ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టామని వివరించారు. ముడిచమురు గతంలో కంటే చౌకగా లభిస్తున్నప్పటికీ ఎన్నటికీ తరగని ఇంధన వనరులను ముఖ్యంగా సౌర శక్తిని చౌకగా అభివృద్ధి చేసేందుకు పరిశోధనలను ముమ్మరం చేస్తామని అన్నారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్ ఇటీవలి విడుదల చేసిన నివేదిక ప్రకారం... ప్రపంచం నలుమూలల నుంచి అమెరికాకు మేధావులను అం దిస్తున్న పది నగరాల్లో ఎనిమిది భారత్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ నగరాల్లో దక్షిణాదికి చెందిన విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నైలు ఉండటం దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు శాస్త్రీయ అంశాలపై అవగాహనఅధికం అనేందుకు తార్కాణమని అన్నారు. ఇటీవల ముగిసిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో వేదకాలంలోనే విమానాలు తయారయ్యాయన్న అంశంపై పరిశోధన వ్యాసం చర్చకు రావడంపై ‘సాక్షి’ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ‘వైమానిక రంగంలో మాత్రమే కాదు.. వైద్య, సామాజిక రంగాల్లోనూ భారత్ గతంలో ఎన్నో అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. దానిపై ఒక పరిశోధన వ్యాసం వస్తే అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరమేమీ లేదు’ అని అన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ సైన్స్ సిటీలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సైన్స్ సిటీలు, శాస్త్ర, సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి వై.సుజనా చౌదరి తెలిపారు. జనాభాలో అధికశాతమున్న యువతను ఈ రంగాలవైపునకు మళ్లించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే దేశంలోని పరిశోధన సంస్థలను మరింత మెరుగైన రీతిలో పనిచేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పరిశోధన సంస్థలను, ఇన్క్యూబేషన్ సెంటర్లను అనుసంధానించాలని అనుకుంటున్నామని, మరో నెల రోజుల్లో ఈ కసరత్తు ముగించి కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపుతామని వివరించారు. -
ఎబోలాతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు!
బెంగళూరు: ఎబోలా వైరస్ కేసులు మన దేశంలో ఇంతవరకు నమోదు కాలేదని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఎబోలా వైరస్ వ్యాపిస్తున్న దేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులను సునిశితంగా పరీక్షిస్తున్నామన్నారు. ఆ వైరస్ గాలి ద్వారా వ్యాపించదని చెప్పారు. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సెన్సైన్‌ను సందర్శించిన కేంద్రమంత్రి.. దేశవ్యాప్తంగా అలాంటి మరిన్ని సంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. పశ్చిమ ఆఫ్రికాలో దాదాపు 10 లక్షల మందిపై ప్రభావం చూపుతున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఇదో మానవ సంక్షోభంగా మారే ప్రమాదముందని హెచ్చరించింది.