భారత మేధావులను తిరిగి రప్పిస్తాం: హర్షవర్ధన్
విదేశాల్లో ఉన్నవారిని రప్పించడానికి ప్రణాళిక సిద్ధం: కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలు సగానికిపైగా తగ్గినప్పటికీ చౌక, పర్యావరణ అనుకూలమైన ఇంధన వనరుల అభివృద్ధికి భారతదేశం తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రధాని మోదీ ‘మేకిన్ ఇండియా’ పిలుపునకు శాస్త్ర, సాంకేతిక రంగాలనే ఆలంబనగా చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి హర్షవర్ధన్, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయమంత్రి వై.సుజనా చౌదరి మాట్లాడారు. అమెరికాతోపాటు అనేక ధనికదేశాల్లో పరిశోధన.. అభివృద్ధి రంగాలు, పరిశ్రమల ఏర్పాటులో ఆసక్తి సన్నగిల్లుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారత సంతతి మేధావులను స్వదేశానికి తిరిగి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం విసృ్తత స్థాయి ప్రణాళికను సిద్ధం చేసిందని హర్షవర్ధన్ తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని వారు భారత్‌లోనే మెరుగైన వేతనాలతో పరిశోధనలు కొనసాగించేందుకు ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టామని వివరించారు. ముడిచమురు గతంలో కంటే చౌకగా లభిస్తున్నప్పటికీ ఎన్నటికీ తరగని ఇంధన వనరులను ముఖ్యంగా సౌర శక్తిని చౌకగా అభివృద్ధి చేసేందుకు పరిశోధనలను ముమ్మరం చేస్తామని అన్నారు.
అమెరికాలోని ప్రతిష్టాత్మక బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ఇటీవలి విడుదల చేసిన నివేదిక ప్రకారం... ప్రపంచం నలుమూలల నుంచి అమెరికాకు మేధావులను అం దిస్తున్న పది నగరాల్లో ఎనిమిది భారత్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ నగరాల్లో దక్షిణాదికి చెందిన విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నైలు ఉండటం దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు శాస్త్రీయ అంశాలపై అవగాహనఅధికం అనేందుకు తార్కాణమని అన్నారు. ఇటీవల ముగిసిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో వేదకాలంలోనే విమానాలు తయారయ్యాయన్న అంశంపై పరిశోధన వ్యాసం చర్చకు రావడంపై ‘సాక్షి’ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ‘వైమానిక రంగంలో మాత్రమే కాదు.. వైద్య, సామాజిక రంగాల్లోనూ భారత్ గతంలో ఎన్నో అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. దానిపై ఒక పరిశోధన వ్యాసం వస్తే అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరమేమీ లేదు’ అని అన్నారు.
అన్ని రాష్ట్రాల్లోనూ సైన్స్ సిటీలు
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సైన్స్ సిటీలు, శాస్త్ర, సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి వై.సుజనా చౌదరి తెలిపారు. జనాభాలో అధికశాతమున్న యువతను ఈ రంగాలవైపునకు మళ్లించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే దేశంలోని పరిశోధన సంస్థలను మరింత మెరుగైన రీతిలో పనిచేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పరిశోధన సంస్థలను, ఇన్‌క్యూబేషన్ సెంటర్లను అనుసంధానించాలని అనుకుంటున్నామని, మరో నెల రోజుల్లో ఈ కసరత్తు ముగించి కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపుతామని వివరించారు.