ఊపిరిపీల్చుకుంటున్న చెన్నై.. విమానాలు ఓకే
చెన్నై: చెన్నై మహానగరం ఇప్పుడే ఊపిరిపీల్చుకుంటోంది. మెల్లగా తేరుకుంటోంది. భారీ వర్షాలతో ముంచెత్తిన వరదల కారణంగా ఇసుమంత జాగ కూడా విడువకుండా, మిద్దెలను సైతం తనలో ముంచేసుకున్న వర్షపు నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో కాస్త సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అవకాశం దొరికినట్లయింది. రవాణా సౌకర్యాలకు ఎలాగో ప్రస్తుతం అవకాశం లేకపోయినప్పటికీ వాయు మార్గాలను పునరుద్ధరించే చర్యలను వేగవంతం చేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా మూతపడిన విమాన సర్వీసులు శుక్రవారం ప్రారంభమవుతున్నాయి. అరక్కోణం నుంచి పూర్తి స్థాయిలో కాకున్నా కొద్ది స్థాయిలో ఓ ఏడు విమాన సర్వీసులను ప్రైవేటు విమానాల ద్వారా అందించేందుకు ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు, జాతీయ విపత్తు దళం కూడా తన సహాయక చర్యలను వేగవంతం చేసింది. చెన్నైకి మరో రెండు యుద్ధ నౌకలు చేరుకున్నాయి. వీటిలో 30 టన్నుల ఆహార పదార్ధాలు, తాగు నీరు తెప్పించారు.
మరోపక్క, రేపటి వరకు అన్ని రైళ్లను దక్షిణమద్య రైల్వే రద్దు చేసింది. అయితే, ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిమట్టం తగ్గిపోతున్నప్పటికీ మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చెన్నై పరిస్థితి అప్పుడే మెరుగవుతుందని మాత్రం చెప్పలేం.