![‘విమానం - క్షిపణి’ సక్సెస్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/41466884620_625x300.jpg.webp?itok=p0Kgj2hk)
‘విమానం - క్షిపణి’ సక్సెస్
బెంగళూరు: క్షిపణి వ్యవస్థలో భారత్ మరో మైలురాయి అందుకుంది. విమానానికి క్షిపణి అనుసంధాన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. శనివారం ఎస్‌యూ-30 ఎంకేఐ విమానం 2,500 కేజీల బరువున్న బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని మోస్తూ గాలిలోకి ఎగిరింది. ఈ క్షిపణి 290 కి.మీల దూరంలో ఆకాశం నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. ప్రయోగం సఫలమవ్వడంతో ప్రపంచంలో ఇలాంటి వ్యవస్థ ఉన్న ఏకైక దేశంగా భారత్ అవతరించింది.
ఈ ప్రయోగంలో వింగ్ కమాండర్లు ప్రశాంత్ నాయర్, ఎంఎస్ రాజులు విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లారు. ఎన్నో విమానాలను పరీక్షించి అనేక అంశాలను పరిశీలనలోకి తీసుకుని ఈ విమానాన్ని తయారు చేసినట్లు హెచ్‌ఏఎల్ చైర్మన్ సువర్ణరాజు తెలిపారు. మేకిన్ ఇండియాకు, విమానయాన రంగంలో మనం సాధిస్తున్న వృద్ధికి ఇది నిదర్శనమని ఆయన చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణుల కోసమే ఈ విమానాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు.