Missile system
-
సైన్యం చేతికి సరికొత్త మిసైల్.. చైనా తోకజాడిస్తే ‘ప్రళయ’మే..!
న్యూఢిల్లీ: సరిహద్దులో రెచ్చగొట్టే చర్యలకు దిగుతూ కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. గల్వాన్ గర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని భూభాగాన్ని చైనా అక్రమించుకునే ప్రయత్నం చేస్తోందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ కుట్రలకు చెక్ పెట్టేందుకు భారత్ సిద్ధమైంది. భారత సైనిక దళాల అమ్ముల పొదిలో అత్యాధునికి మిసైల్ చేరనుంది. ‘ప్రళయ్’గా పిలిచే ఈ బాలిస్టిక్ మిసైల్ 150 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. బాలిస్టిక్ మిసైల్‌ను సైన్యంలో చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేసింది భారత రక్షణ దళం. ఈ వారంతాంలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో అందుకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి. రక్షణ శాఖలో రాకెట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని చర్చల కొనసాగుతున్న క్రమంలోనే ఈ క్షిపణిని తీసుకురావలన్న ప్రతిపాదన రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ఓ సమావేశంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో శత్రువులను ధీటుగా ఎదుర్కొనేందుకు రాకెట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కృషి చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రళయ్ ప్రత్యేకతలు.. ► మిసైల్ ప్రళయ్‌ను గత ఏడాది డిసెంబర్లో వరుసగా రెండు రోజుల్లో విజయవంతంగా పరీక్షించారు. ► విజయవంతంగా లక్ష్యాలను ఛేదించిన ఈ క్షిపణిని సైన్యంలో చేర్చుకోవాలని బలగాలు భావిస్తున్నాయి. ► ఈ మిసైల్ 150- 500 కిలోమీటర్ల దూరంలోని సూదూర లక్ష్యాలను సైతం ఛేదించగలదు. ► ప్రళయ్ సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటారు సహా ఇతర కొత్త సాంకేతికలతో పని చేస్తుంది. ► ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే పాక్షిక-బాలిస్టిక్ మిసైల్. ► శుత్రువుల మిసైల్స్‌ను కూల్చేందుకు సైతం దీనిని ఉపయోగించేలా రూపొందించారు. ► గాల్లో కొంత దూరం వెళ్లాక దాని మార్గాన్ని మార్చుకునే సామర్థ్యం సైతం ఈ మిసైల్‌కు ఉంది. ఇదీ చదవండి: తవాంగ్ ఘర్షణ: ఎటునుం‘చైనా’.. హెచ్చరిస్తున్న ఛాయా చిత్రాలు.. -
అమెరికా ఆంక్షలను పట్టించుకోం : రష్యా
న్యూఢిల్లీ: భారత్‌తో ఎస్–400 క్షిపణి వ్యవస్థల సరఫరా సహా అన్ని రక్షణ ఒప్పందాల అమలు కొనసాగుతుందని రష్యా స్పష్టం చేసింది. అమెరికా విధించే ఏకపక్ష ఆంక్షలను పట్టించుకోమని తెలిపింది. రష్యా రాయబారి నికొలాయ్ కుదాషెవ్, రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రొమన్ బబూష్కిన్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘రష్యా నుంచి అత్యాధునిక ఎస్–400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసినందుకు గాను టర్కీపై అమెరికా ఆంక్షలను విధించింది. దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసేందుకు అమెరికా ఇలా ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించడం అన్యాయం. ఐక్యరాజ్య సమితి విధించే ఆంక్షలను తప్ప ఇలా ఏకపక్షంగా ప్రకటించే చర్యలను పట్టించుకోం. ఏది ఏమైనా భారత్‌కు ఎస్–400 క్షిపణి వ్యవస్థల సరఫరా కొనసాగుతుంది’ అని అన్నారు. ఎస్–400 క్షిపణి వ్యవస్థలు ఐదింటిని కొనుగోలు చేసేందుకు 2018లో భారత్ రష్యాతో 5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా హెచ్చరించినప్పటికీ వెనుకంజ వేయకుండా మొదటి దఫాగా 800 మిలియన్ డాలర్లను చెల్లించింది. -
నాలుగైదేళ్లలో సంపూర్ణ క్షిపణి వ్యవస్థ
న్యూఢిల్లీ: భారత దేశ రక్షణ కోసం పూర్తిస్థాయి క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసేందుకు మరో నాలుగైదు ఏళ్లు పడుతుందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధ్యక్షుడు డాక్టర్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. డీఆర్డీవో రెండు నెలల్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పది క్షిపణులను విజయవంతంగా పరీక్షించిన నేపథ్యంలో సతీశ్‌రెడ్డి ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. డీఆర్డీవో ప్రస్తుతం దేశ రక్షణ దళాలకు అవసరమైన ఏ రకమైన క్షిపణి వ్యవస్థనైనా తయారు చేసి ఇవ్వగల సత్తా కలిగి ఉందని ఆయన ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఒకవైపు చైనాతో లద్దాఖ్‌లో సరిహద్దు సమస్యలు కొనసాగుతున్న ఈ తరుణంలో డీఆర్డీవో అధ్యక్షుడి వ్యాఖ్యలకు ప్రాధాన్యమేర్పడింది. శత్రుదేశాల రాడార్లను గుర్తించి నాశనం చేయగల రుద్రం–1తోపాటు బ్రహ్మోస్, అతిధ్వని క్షిపణి ఆధారిత జలాంతర్గామి వ్యతిరేక వ్యవస్థ, ధ్వనికి ఏడు ఐదారు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగల, అణ్వాయుధ సామర్థ్యమున్న శౌర్య తదితరాలను డీఆర్డీవో రెండు నెలల్లో పరీక్షించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ నినాదంలో భాగంగా డీఆర్డీవో స్వదేశీ ఆయుధ వ్యవస్థల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాము ఒకవైపు క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేస్తూనే ఇంకోవైపు రక్షణ దళాలకు అవసరమైన అత్యాధునిక ఆయుధాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని సతీశ్‌రెడ్డి తెలిపారు. కోవిడ్–19 పరిస్థితుల్లోనూ డీఆర్డీవో శాస్త్రవేత్తలు ఆయుధ వ్యవస్థల తయారీని కొనసాగిస్తున్నారని, ఒక్కో వ్యవస్థ సిద్ధమైన కొద్దీ వాటిని అప్పటికప్పుడు పరీక్షిస్తున్నామని, తద్వారా తయారీ ప్రక్రియను ముందుకు తీసుకు వెళుతున్నామని ఆయన వివరించారు. పారిశ్రామికవేత్తలకు సాయం రక్షణ రంగంలో స్వావలంబన సాధించేం దుకు డీఆర్డీవో చేస్తున్న కృషికి దేశీ పారిశ్రామిక వేత్తలూ తమవంతు సహకారం అందిస్తున్నారని సతీశ్‌రెడ్డి తెలిపారు. రక్షణ అవసరాలకు తగ్గట్టుగా వ్యవస్థలను డిజైన్ చేయడంతోపాటు అభివృద్ధి చేయగలుగుతున్నారని చెప్పారు. పారిశ్రామివేత్తలను ప్రోత్సహించేందుకు టెక్నాలజీ నిధి ఒకదాన్ని ఏర్పాటు చేయడంతోపాటు వారు పరీక్షలు జరిపేందుకు డీఆర్డీవో పరిశోధన శాలను వారి అందుబాటులో ఉంచామని వివరించారు. రక్షణ దళాల కోసం అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేసేందుకు డీఆర్డీవో చాలా కాలంగా ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే రెండు నెలల్లో అనేక క్షిపణి వ్యవస్థల పరీక్షలు జరిగాయని తెలిపారు. క్షిపణులు, రాడార్లు, ఎలక్ట్రానిక్స్ యుద్ధం, టొర్పెడోలు, తుపాకులు, సమాచార వ్యవస్థ తదితర అంశాల్లో భారతదేశం పూర్తిస్థాయి స్వావలంబన సాధించిందని చెప్పారు. -
కశ్మీర్‌పై అనుమానాలేం లేవు
న్యూఢిల్లీ: కశ్మీర్ విషయంలో భారత్ వ్యవహరిస్తున్న తీరుపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని రష్యా స్పష్టం చేసింది. కశ్మీర్ సమస్య భారత్, పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక అంశమేనని భారత్‌లో రష్యా రాయబారి నికొలయ్ కుదషేవ్ వ్యాఖ్యానించారు. తన డిప్యూటీ రోమన్ బబుష్కిన్‌తో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కశ్మీర్‌ను సందర్శించిన విదేశీ రాయబారుల బృందంలో రష్యా రాయబారులు లేకపోవడంపై ప్రశ్నించగా.. ‘కశ్మీర్‌కు సంబంధించి భారత్ తీరుపై అనుమానాలున్నవారు అక్కడికి వెళ్తారు. మాకేం అనుమానాలు లేవు’ అని కుదషేవ్ స్పందించారు. భారత్ పంపే ఎస్ – 400 ఉత్పత్తి ప్రారంభం గగన రక్షణ క్షిపణి వ్యవస్థ ఎస్ –400ను 2025 నాటికి భారత్‌కు అందిస్తామని ఈ సందర్భంగా బబుష్కిన్ వెల్లడించారు. భారత్‌కు సరఫరా చేసే ఐదు ‘ఎస్ –400’ క్షిపణుల ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఎస్– 400 వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత సమర్ధవంతమైందని, భారత గగనతల రక్షణ వ్యవస్థను ఇది మరింత బలోపేతం చేస్తుందని బబుష్కిన్ పేర్కొన్నారు. 400 కిమీల దూరంలోని శత్రు విమానాలను, క్షిపణులను, డ్రోన్లను గుర్తించి, నాశనం చేయగల సామర్థ్యం ఎస్ –400 సొంతం. ఇది ఇప్పటివరకు రష్యా రక్షణ దళాలకు మాత్రమే అందుబాటులో ఉండేది. బహుళ ఉపయోగకర తేలికపాటి మిలటరీ హెలికాప్టర్ కమోవ్‌ను సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు ఉద్దేశించిన ఒప్పందం త్వరలో ఖరారవుతుందన్నారు. -
క్షిపణి వల్లే కూలింది..
టెహ్రాన్/ఒట్టావా/వాషింగ్టన్: ఇరాన్లో కుప్పకూలిన ఉక్రెయిన్ విమాన ఘటనపై వివాదం తీవ్రమవుతోంది. ఆ విమానం ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దాడిలోనే అనేందుకు ఆధారాలున్నాయని కెనడా, బ్రిటన్ తదితర దేశాలు పేర్కొన్నాయి. అయితే, పొరపాటున అది జరిగి ఉండొచ్చని వ్యాఖ్యానించాయి. క్షిపణి దాడిలోనే ఆ బోయింగ్ 737 విమానం కూలిపోయిందనేందుకు బలం చేకూర్చే వీడియో ఆధారమొకటి తెరపైకి వచ్చింది. ఆ వీడియోలో ఆకాశంలో వేగంగా వెళ్తున్న వస్తువు ఒకటి కనిపిస్తుంది. కాసేపటికి ఒక మెరుపులాంటి దృశ్యం, ఆ తరువాత పేలుడు శబ్దం వినిపిస్తుంది. ఆ వీడియోను తాము వెరిఫై చేశామని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. పలు నిఘా వర్గాల సమాచారం ప్రకారం గతంలో రష్యా నుంచి ఇరాన్ కొన్న ఎస్ఏ–15 టార్ క్షిపణి వ్యవస్థ నుంచి ప్రయోగించిన క్షిపణి వల్లే విమానం కూలినట్లు స్పష్టమవుతోందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో శుక్రవారం పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని, వాస్తవాలు తమ పౌరులకు తెలియాల్సి ఉందని అన్నారు. విమాన ప్రమాదంలో చనిపోయిన 176 మందిలో 63 మంది ప్రయాణీకులు కెనడా పౌరులే. మిగతావారిలో 82 మంది ఇరాన్, 11 మంది ఉక్రెయిన్, 10 మంది స్వీడన్, నలుగురు ఆఫ్గానిస్తాన్, ముగ్గురు జర్మన్, ముగ్గురు బ్రిటన్ పౌరులున్నారు. తమ క్షిపణి దాడిలోనే విమానం కూలిందన్న ఆరోపణలను ఇరాన్ ఖండించింది. సంబంధిత ఆధారాలివ్వాలని అమెరికా, కెనడాలను కోరింది. ప్రమాద ఘటనపై జరుగుతున్న విచారణలో పాలుపంచుకోవాలని బాధిత దేశాలతో పాటు బోయింగ్ సంస్థను కోరింది. విమాన ప్రమాదానికి క్షిపణి దాడే కారణమని వివిధ ఆధారాల ద్వారా స్పష్టమవుతోందని బ్రిటన్ ప్రధాని జాన్సన్ అన్నారు. తమకందిన సమాచారం ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల వల్లనే విమానం కూలిందని స్పష్టం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ప్రమాదంపై సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని ఈ నేతలు డిమాండ్ చేశారు. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిన రోజే ఈ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దళాల ఉపసంహరణ ప్రారంభించండి బాగ్దాద్: ఇరాక్ నుంచి బలగాలను ఉపసంహరించేందుకు సాధ్యమైనంత త్వరగా కార్యాచరణ రూపొందించుకోవాలని అమెరికాకు ఇరాక్ సూచించింది. ఇరాక్ ప్రధాని అదెల్ అబ్దుల్ మెహదీకి గురువారం రాత్రి యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియొ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా, తమ దేశం నుంచి అమెరికా దళాల ఉపసంహరణను ప్రారంభించాలని పాంపియోను కోరారు. -
బ్రహ్మోస్ క్షిపణికి చైనా సవాల్..!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్, రష్యాలు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణిని ఎదుర్కొనే సామర్థ్యం చైనా తయారు చేసిన హెచ్డీ-1 క్రూయిజ్ క్షిపణికి ఉందని ఆ దేశానికి చెందిన మైనింగ్ కంపెనీ ‘గ్వాంగ్డాంగ్ హోంగ్డా బ్లాస్టింగ్’ వెల్లడించింది. ఎయిర్ షో చైనా-2018 కార్యక్రమంలో సదరు కంపెనీ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం.. అక్టోబర్‌లో టెస్టింగ్ పూర్తి చేసుకున్న హెచ్డీ-1 క్షిపణి 2.2 నుంచి 3.5 మాక్ నెంబర్ వేగంతో దూసుకెళ్లి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 2,200 కిలోల బరువుతో.. సముద్ర మట్టానికి అత్యల్పంగా 5-10 మీటర్ల ఎత్తులో, అత్యధికంగా 15 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలుగుతుంది. అయిదు నిముషాల్లోనే సిద్ధం.. అయిదు నిముషాల్లో హెచ్డీ-1ను సిద్ధం చేయొచ్చని గ్లోబల్ టైమ్స్ ప్రచురించింది. ఒకే ఒక బటన్‌ను నొక్కడం వల్ల దీనిని ఆపరేట్ చేయవచ్చని తెలిపింది. భూ ఉపరితలం, సముద్ర తలం నుంచి దీనిని ప్రయోగించవచ్చు. భూమిపై, సముద్రంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఒక లాంచ్ వెహికల్‌పై 6 హెచ్డీ-1 మిస్సైల్స్ లోడ్ చేయవచ్చు. ఒక చోటు నుంచి మరో చోటుకు వీటిని తరలించడం చాలా సులభం. ఇక.. హెచ్డీ-1 క్షిపణికి వేరియంట్‌గా హెచ్డీ-1ఏ ను కూడా చైనా ఆవిష్కరించింది. హెచ్డీ-1ఏను ఫైటర్ జెట్లు, బాంబర్ల ద్వారా గాల్లో నుంచి కూడా లాంచ్ చేయొచ్చు. మన బ్రహ్మోస్.. బ్రహ్మోస్ మధ్య స్థాయి సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఇది గాలి కన్నా దాదాపు మూడు రెట్ల వేగంతో ప్రయాణించి లక్ష్యాల్ని ఛేదిస్తుంది. గాలి, నీరు, భూ ఉపరితలం నుంచి ప్రయోగించచ్చు. మాక్ నెంబర్ 2.8 నుంచి 3 వేగంతో ప్రయాణించి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 400 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం బ్రహ్మోస్ ఛేదించగలుగుతుంది. ఇటీవల దీనిలో వేగాన్ని పెంచారు. మాక్ నెంబర్ 5 వరకు బ్రహ్మోస్ ప్రయాణించగలదు. దాదాపు 2,500 నుంచి 3000 కిలోల బరువు మోయగలవు. వీటికి 8.4 మీటర్ల పొడవుతో 200 నుంచి 300 కిలోల వార్‌హెడ్ ఉంటుంది. సముద్ర లక్ష్యాల్ని ఛేదించి యుద్ధ నౌకల్ని చీల్చి చెండాడే క్షిపణుల్లో మనబ్రహ్మోసే ఇప్పటివరకు శక్తిమంతమైనది కావడం విశేషం. 2006లో బ్రహ్మోస్ భారత రక్షణ రంగంలోకి అడుగు పెట్టింది. భారత ఆర్మీ, వైమానిక రంగాలకు సేవలందిస్తోంది. ఓ విశ్లేషకుడి అభిప్రాయం.. బీజింగ్‌కు చెందిన మిలటరీ విశ్లేషకుడు వీ డాంగ్జూ.. హెచ్డీ-1పై తన అభిప్రాయాలు వెల్లడించారు. హెచ్డీ-1 క్షిపణి బ్రహ్మోస్ వెర్షన్లను అధిగమించిందని అన్నారు. ఇది యుద్ధ రంగంలోకి దిగితే శత్రువుల యుద్ధ విమానాలు నేలకూలక తప్పదని అన్నారు. -
క్షిపణి నిరోధక వ్యవస్థ ప్రయోగం సక్సెస్
బాలాసోర్: గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. శత్రుదేశాలు బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగిస్తే గాల్లోనే పేల్చివేయగల రెండంచెల క్షిపణి నిరోధక వ్యవస్థను ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలామ్ ఐలాండ్‌లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత ఓ క్షిపణిని నిర్దేశిత లక్ష్యంపైకి ప్రయోగించారు. రాడార్లు అప్రమత్తం చేయడంతో అప్పటికే సిద్ధంగా ఉన్న పృథ్వీ డిఫెన్స్ వెహికల్(పీడీవీ) దీన్ని నిలువరించేందుకు గాల్లోకి దూసుకెళ్లింది. అనంతరం భూమికి 50 కి.మీ ఎత్తులో క్షిపణిని పృథ్వీ నాశనం చేసింది. -
ఎస్–400 కొంటే ఆంక్షలే: అమెరికా
వాషింగ్టన్: రష్యా నుంచి అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్–400ను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరించింది. కాస్టా (ఆంక్షల ద్వారా అమెరికా వ్యతిరేక శక్తులను ఎదుర్కొనడం)కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలు, వ్యవస్థలపై ఆంక్షలు అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్–400 వ్యవస్థల కొనుగోలుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రభావం పడే వీలుంది. ట్రంప్ సంతకంచేయగానే ఇటీవలే రష్యా నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలు, ఎస్–400లను కొన్న చైనా సంస్థ, దాని డైరెక్టర్ షాంగ్‌ఫూపై అమెరికా ఆంక్షలు విధించింది. రష్యాను లక్ష్యంగా చేసుకునే కాస్టా చట్టాన్ని తెచ్చినట్లు అమెరికా ఉన్నతాధికారి వెల్లడించారు. -
దివిసీమలో దూసుకుపోనున్న ‘క్షిపణి’!
అవనిగడ్డ/నాగాయలంక : కృష్ణా జిల్లా దివిసీమలోని గుల్లలమోదలో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ఆమోదముద్ర లభించింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటులో కీలకమైన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనల సడలింపు నిర్ణయానికి శుక్రవారం పర్యావరణశాఖ అంగీకరించింది. పనులు ప్రారంభించుకోవచ్చని, ఈ మేరకు వారం రోజుల్లో లిఖిత పూర్వక ఆదేశాలు వెలువడించనున్నట్టు కేంద్రానికి పర్యావరణ మంత్రిత్వశాఖ తెలియజేయడంతో అన్ని అవరోధాలు తొలగిపోయాయి. తొలిదశగా రూ. 800 కోట్లు, రెండో దశలో రూ. 1,000 కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయనున్నట్టు డీఆర్డీవో(రక్షణ పరిశోధన సంస్థ) అధికారులు ప్రకటించారు. దేశంలోనే రెండో అతి పెద్ద క్షిపణి పరీక్ష కేంద్రం దివిసీమలో ఏర్పాటు చేయనుండటంతో కృష్ణా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు రానుంది. నాలుగేళ్ల నుంచి నిరీక్షణ.. గుల్లలమోదలో డీఆర్డీవో ఆధ్వర్యంలో క్షిపణి పరీక్ష కేంద్రం(మిస్సైల్ లాంచింగ్ స్టేషన్) ఏర్పాటు కోసం నాలుగేళ్ల కిందట అంకురార్పరణ జరిగింది. ఇందుకోసం 381.61 ఎకరాలు అటవీ భూములను కేటాయించారు. అప్పటి నుంచి పర్యావరణ, అటవీశాఖ అనుమతులు, రైతులకు నష్టపరిహారం సమస్య వంటి అవరోధాలు వల్ల ప్రాజెక్టు జాప్యం అవుతూ వచ్చింది. రక్షణ కేంద్రం ఏర్పాటుకు అటవీభూమిని కేటాయించడం పట్ల సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు చేసింది. ఈ అటవీ భూములకు ప్రతిఫలంగా అంతే విస్తీర్ణంలో సొర్లగొందిలోని ఆర్ఎస్ నెంబర్ 674లో ఉన్న ఉన్న రెవెన్యూ భూమిని అటవీశాఖకు ఈ ఏడాది జనవరిలో బదలాయించడంతో ప్రధాన అడ్డంకి తొలగింది. రైతులకు నష్టపరిహారం సమస్యను కూడా పరిష్కరించారు. పర్యావరణ నిబంధనలు కొన్ని అడ్డంకుగా ఉండగా.. సడలింపుకు పర్యావరణ శాఖ శుక్రవారం అంగీకరించింది. దీంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దివిసీమ ముఖ్య అధికారి కీలకపాత్ర ఈ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకురావడంలో దివిసీమలోని పెదకళ్లేపల్లికి చెందిన ఢిల్లీలోని ఏపీ భవన్ కమిషనర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. న్యూఢిల్లో ఉండే ఆయన పర్యావరణ అనుమతుల కోసం 18 నెలలుగా శ్రమించారు. అటవీశాఖ అనుమతితో పాటు, అటవీశాఖకు రెవెన్యూభూమిని బదలాయించడం, పర్యావరణ అనుమతికోసం డీఆర్డీవో నిపుణులను ఈ ప్రాంతానికి తీసుకురావడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్యోగ, ఉపాధి, రహదారుల అభివృద్ధి, చెట్ల పెంపకంతో పాటు దివిసీమ రూపు రేఖలు మారిపోనున్నాయి. -
భారత్‌కు ‘ట్రయంఫ్’ రక్షణ!
న్యూఢిల్లీ: రష్యా నుంచి ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు సంబంధించిన తుది చర్చలను కేంద్రం తాజాగా ప్రారంభించింది. ఇప్పటికే భారత్‌కు ఆకాశ్, బరాక్–8 తదితర క్షిపణి వ్యవస్థలుండగా..ఎస్–400 ట్రయంఫ్ క్షిపణులను కూడా కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఇందుకు కారణం ఇది అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి కావడమే. ఈ నేపథ్యంలో ఎస్–400 ట్రయంఫ్ క్షిపణుల గురించి క్లుప్తంగా.. రష్యా ఉత్పత్తి చేసే, ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఎస్–400 ట్రయంఫ్ శ్రేణిలోని ఐదు క్షిపణి వ్యవస్థలను 39 వేల కోట్ల రూపాయలు (5 బిలియన్ అమెరికన్ డాలర్లు) వెచ్చించి కొనుగోలు చేయాలని భారత్ 2015లోనే నిర్ణయించింది. ఆ ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లడానికి కొన్ని రోజుల ముందే ఎస్–400 ట్రయంఫ్ క్షిపణుల కొనుగోలు ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదించింది. ప్రస్తుతం తుది చర్చలను ప్రారంభించిన భారత ప్రభుత్వం.. 2018–19 ఆర్థిక సంవత్సరం చివరిలోపు ఒప్పందాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఒప్పందం ఖరారైతే చైనా తర్వాత ఈ క్షిపణులను కొనుగోలు చేయనున్న రెండో దేశంగా భారత్ నిలవనుంది. చైనా 2014లోనే ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. ఎప్పటికి వస్తాయి? మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తుండగా, డీల్ కుదిరిన వెంటనే తొలి క్షిపణి వ్యవస్థ భారత్‌కు చేరనుంది. అయితే దీనికి అనుబంధంగా ఉండే కొన్ని యుద్ధ నిర్వహణ పరికరాలు రావడానికి మాత్రం రెండేళ్ల సమయం పడుతుంది. మొత్తం ఐదు క్షిపణులు భారత అమ్ములపొదిలో చేరడానికి నాలుగున్నరేళ్ల వ్యవధి అవసరమని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్–రష్యాల మధ్య కుదిరిన భారీ ఆయుధ ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఇవీ ప్రత్యేకతలు.. శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, గూఢచర్య విమానాలు 600 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్నా ఎస్–400 ట్రయంఫ్ వాటిని గుర్తించి నాశనం చేయగలదు. ఏకకాలంలో 36 లక్ష్యాలపై ఇది దాడులు చేయగలదు. ఎస్–300 క్షిపణుల కన్నా ఇది రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో దాడులు చేస్తుంది. అందుకే ఎస్–400 ట్రయంఫ్‌ను రష్యా వద్దనున్న అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి వ్యవస్థగా పేర్కొంటారు. భారత్‌కు ఈ క్షిపణులు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్‌లోని చైనా స్థావరాలపై కూడా దాడులు చేయొచ్చు. ఆయుధ సంపత్తి విషయంలో పాక్‌పై భారత్ పైచేయి సాధించడంతోపాటు, చైనాతో సరిసమానంగా నిలిచేందుకు ఎస్–400 ట్రయంఫ్ దోహదపడనుంది. పాకిస్తాన్ వద్దనున్న స్వల్ప శ్రేణి క్షిపణి నాస్ర్ను ఇది దీటుగా ఎదుర్కొంటుంది. వీటిని వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించేందుకూ వీలుంది. భారత్ వద్ద ఉన్న క్షిపణులు స్పైడర్ ఇజ్రాయెల్ సాంకేతికతతో తయారైన దీని పరిధి 15 కిలోమీటర్లు. వాయుసేన 4 క్షిపణులను సమకూర్చుకుంటోంది. పరిధిని 30 కిలో మీటర్లకు పెంచేందుకు డీఆర్డీవో ప్రయత్నిస్తోంది. ఆకాశ్ డీఆర్డీవో, బీడీఎల్, బీఈఎల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 25 కిలోమీటర్లు. వాయుసేన 15 ఆకాశ్ స్క్వాడ్రన్లు, ఆర్మీ నాలుగు ఆకాశ్ రెజిమెంట్లను సమకూర్చుకుంటోంది. బరాక్–8 డీఆర్డీవో–ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 70 కిలో మీటర్లు. వాయుసేన 9 క్షిపణులను సమకూర్చుకుంటోంది. యుద్ధనౌకలకు ఈ క్షిపణి వ్యవస్థలను నౌకాదళం అమర్చుకుంటోంది. -
రఫెల్ ఒప్పందానికి ఆమోదం
శుక్రవారం సంతకాలు న్యూఢిల్లీ: సుదీర్ఘ బేరసారాల అనంతరం 36 అత్యాధునిక రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. 7.87 బిలియన్ యూరోల (రూ.59 వేల కోట్లు) విలువైన ఈ ఒప్పందంపై శుక్రవారం ఢిల్లీలో ఫ్రాన్స్ రక్షణ మంత్రి జీన్ లీ డ్రియాన్ సమక్షంలో సంతకాలు జరగనున్నాయి. గత 20 ఏళ్లలో యుద్ధ విమానాలు కొననుండడం ఇదే తొలిసారి. యూపీఏ హయాంలో ప్రతిపాదించిన ఒప్పందంతో పోలిస్తే తాజా ఒప్పందం వల్ల 75 కోట్ల యూరోలు(రూ.5,600 కోట్లు) ఆదా కానున్నాయి. అంతేకాకుండా భారత్‌లోని చిన్న, పెద్ద కంపెనీలకు 300 కోట్ల యూరోల (రూ.22 వేల కోట్లు ) వ్యాపారం, వందలాది ఉద్యోగాలు దక్కనున్నాయి. కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్‌తో అంతర్ప్రభుత్వ ఒప్పందానికి ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ విమానాల కొనుగోలు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. 150 కి.మీకి మించిన లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థ వంటివి రఫెల్లో ఉన్నాయి. -
‘విమానం - క్షిపణి’ సక్సెస్
బెంగళూరు: క్షిపణి వ్యవస్థలో భారత్ మరో మైలురాయి అందుకుంది. విమానానికి క్షిపణి అనుసంధాన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. శనివారం ఎస్‌యూ-30 ఎంకేఐ విమానం 2,500 కేజీల బరువున్న బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని మోస్తూ గాలిలోకి ఎగిరింది. ఈ క్షిపణి 290 కి.మీల దూరంలో ఆకాశం నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. ప్రయోగం సఫలమవ్వడంతో ప్రపంచంలో ఇలాంటి వ్యవస్థ ఉన్న ఏకైక దేశంగా భారత్ అవతరించింది. ఈ ప్రయోగంలో వింగ్ కమాండర్లు ప్రశాంత్ నాయర్, ఎంఎస్ రాజులు విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లారు. ఎన్నో విమానాలను పరీక్షించి అనేక అంశాలను పరిశీలనలోకి తీసుకుని ఈ విమానాన్ని తయారు చేసినట్లు హెచ్ఏఎల్ చైర్మన్ సువర్ణరాజు తెలిపారు. మేకిన్ ఇండియాకు, విమానయాన రంగంలో మనం సాధిస్తున్న వృద్ధికి ఇది నిదర్శనమని ఆయన చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణుల కోసమే ఈ విమానాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. -
బరాక్-8 క్షిపణి ప్రయోగం విజయవంతం
-
ప్రజా రాష్ట్రపతి
అతడి జననం ఒక పేద తల్లి ఆనంద బాష్పం. అతడి మరణం లక్షలాది హృదయాల విషాదగీతం. ఒక కవి చెప్పినట్టు జనన మరణాల మధ్య మనిషికి లభించే ‘రెప్పపాటు’ జీవితాన్ని ఎంతో అర్ధవంతంగా గడిపారు గనుకే సోమవారం సాయంత్రం కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాంను ఈ దేశ ఉత్తమ పుత్రుడిగా కీర్తిస్తూ కేంద్ర మంత్రివర్గం ఘనంగా నివాళులర్పించింది. కలాం కన్నా ముందూ... తర్వాతా ఎందరో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అధిరోహించారు. కలాం తరహాలోనే వారిలో భిన్న రంగాల్లో నిష్ణాతులైనవారూ, చెరగని ముద్రేసినవారూ ఎందరో ఉన్నారు. కానీ ఆయనలా జనంతో, మరీ ముఖ్యంగా యువతతో... విద్యార్థిలోకంతో మమేకమైనవారు మాత్రం ఎవరూ లేరు. రాష్ట్రపతి భవన్ తలుపుల్ని సామాన్య పౌరుల కోసమని తెరిచి ఉంచినవారూ లేరు. కేవలం జాతీయ దినోత్సవాల సమయంలో మాత్రమే ఎవరికైనా అందులో ప్రవేశం. అయితే ఆయన దేశాధ్యక్షుడిగా ఉన్న అయిదేళ్లూ ఆ సంప్రదాయాన్ని తోసిరాజని సాధారణ పౌరులకు అది సందర్శనా స్థలి అయింది. విద్యార్థులకూ, భిన్నరంగాల్లోని నిపుణులకూ అక్కడ ఆదరణ లభించేది. ఆయన ‘ప్రజా రాష్ట్రపతి’గా కీర్తిప్రతిష్టలం దుకున్నది ఆ కారణంవల్లనే. ప్రొటోకాల్ పట్టింపు లేదు...లాంఛనాల యావ లేదు. అధికారిక భద్రతా వలయాలంటే ఇష్టమే లేదు. సందర్భం ఏదైనా కావొచ్చు...ఎక్కడికెళ్లినా ఆయన కళ్లు వెదికేది పసి పిల్లలనూ, యువతనే! వారిపై ఆయనకు అంతటి అచంచల విశ్వాసం. సమాజానికి సంబంధించిన దురభిప్రాయాలు కావొచ్చు, పక్షపాతం కావొచ్చు... వారి దరి చేరవన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. వారిలో చైతన్యాన్ని రగిలిస్తే, వారి హృదయాల్లో ఒక చిరు దివ్వెను వెలిగిస్తే అది ఇంతింతై దేశమంతటినీ తేజోమయం చేస్తుందని ఆయన నిండైన విశ్వాసంతో చెప్పేవారు. కలాంకు నివాళిగా ఆయన జన్మదినమైన అక్టోబర్ 15ను అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది అందుకే! శాస్త్రవేత్తగా జీవితాన్ని ప్రారంభించి, ఎన్నో పరిశోధనల్లో పాలుపంచుకుని, దేశం గర్వించదగిన క్షిపణి వ్యవస్థను సృజించి, దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగి భారత రత్న పురస్కారాన్ని సైతం పొందారు కలాం. లోహ శాస్త్రంలో తాను పొందిన ప్రావీణ్యాన్ని ఉపయోగించి హృద్రోగులకు అవసరమైన స్టెంట్, వికలాంగులకు తోడ్పడే తేలికపాటి కాలిపర్స్ రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. ఎన్ని చేసినా, ఎంత ఎత్తుకెదిగినా తన హృదయానికి ప్రీతిపాత్రమైనది ఉపాధ్యాయ వృత్తేనని ఒక ఇంటర్వ్యూలో చెప్పారాయన. అందుకు తగ్గట్టే చివరి క్షణాల్లో సుస్థిరాభివృద్ధిపై షిల్లాంగ్ ఐఐఎంలో నిర్వహించిన సదస్సులో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూనే ఆయన కుప్పకూలిపోయారు. కొన్ని క్షణాలకే తనువు చాలించారు. శాస్త్రవేత్తగా తన చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేయడంతో ప్రారంభించి దేశం మొత్తాన్నే ఉత్సాహోద్వేగాల్లో ముంచెత్తడం వరకూ కలాం చేసిన ప్రయాణం విశిష్టమైనది. గుండెతడి ఉన్నవారికే...కల్లలెరుగని బాల్యాన్ని లోలోపల భద్రపర్చుకో గలిగినవారికే అది సాధ్యం. చట్టంలో ఉరిశిక్ష ఉండరాదన్న అభిప్రాయం ఆయనకు దాన్నుంచే ఏర్పడింది. తమిళనాడు చివరి కొసన ఉన్న రామేశ్వరంలో నిరుపేద జాలరి కుటుంబంలో కలాం కళ్లు తెరిచారు. రామేశ్వరంనుంచి ధనుష్కోడి వరకూ అట్నుంచి ఇటు...ఇటునుంచి అటూ నాన్న యాత్రీకులను చేరేసినప్పుడు వారి నోటి వెంబడి నిత్యం వినే రామాయణ గాథ, అందులోని సన్నివేశాలూ తనపై విశేష ప్రభావాన్ని చూపాయని ఆయన చెప్పేవారు. ఎలాగైనా జీవితంలో పైకి రావాలని తాను పడిన తపనకు...కిరోసిన్‌ను కాస్తంత ఆదాచేసి కలాం రాత్రి చదువుకు సాయపడాలన్న అమ్మ ఆత్రుత తోడైంది. కుటుంబానికి సైదోడుగా వేకువజామున ఇంటింటికీ పత్రికలు పంపిణీ చేస్తూనే చదువుకున్నాడాయన. ఇవన్నీ అంతిమంగా అబ్దుల్ కలాం అనే సృజనశీలిని రూపొందించాయి. ఇంతకూ నిరుపేద కుటుంబంలో పుట్టి ‘మిసైల్ మ్యాన్’గా ఎదిగిన కలాం 2002లో రాష్ట్రపతి కావడానికి దారితీసిన పరిస్థితులేమిటి? ఆయనను ఆ అత్యున్నత పదవికి ఎంపిక చేయాలన్న ఆలోచన తమదేనని చెప్పుకుని తిరిగే మరుగుజ్జు నేతలకు మన దేశంలో కొదవలేదు. ముస్లిం కుటుంబంలో పుట్టినా తమిళ ఇతిహాసం తిరువళ్లువర్ విరచిత ‘తిరుక్కురళ్’ను ఔపోసన పట్టడమే కాదు...త్యాగరాజ కృతులను వీణపై కలాం శ్రావ్యంగా పలికించగలరని...ఆయన దేవాలయాలకు వెళ్తారని, శాకాహారని... ఇవన్నీ ‘మంచి ముస్లిం’ లక్షణాలనీ భావించబట్టే ఆనాడు కలాం రాష్ట్రపతి కావడానికి ఆరెస్సెస్ సుముఖత చూపిందా? తాను రక్షణమంత్రిగా ఉన్నప్పుడు శాస్త్ర సాంకేతిక సలహాదారుగా ఉన్న కలాంతో ఏర్పడిన సాన్నిహిత్యం వల్ల ములాయం పట్టుబట్టారా? గుజరాత్లో అంతక్రితం సంభవించిన నరమేథం మచ్చను కడిగేసుకోవడానికి బీజేపీ ఒక మంచి ఎత్తుగడగా కలాంను రంగంలోకి తెచ్చిందా అన్న చర్చలు చాన్నాళ్లుగా నడుస్తున్నాయి. ఇక ముందూ అవి ఉంటాయి. కానీ అప్పటికి దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చి దాదాపు పదేళ్లు కావొచ్చింది. దానిపై ఉన్న భ్రమలు అప్పుడప్పుడే క్షీణించడం మొదలయ్యాయి. యువతలో ఒక రకమైన అసహనం, అసంతృప్తి ఏర్పడుతున్నది. ఆ సమయంలో కలాంను రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా నిలపడం, ఆయన గెలవడం ఆనాటి పరిస్థితుల్లో ఎన్డీయే సర్కారుకు ఎంతగానో కలిసొచ్చింది. కలాం వంటి క్రియాశీల రాష్ట్రపతి వల్ల మళ్లీ యువతలో ఆశలు రాజుకున్నాయి. పట్టుదలతో కృషిచేస్తే దేన్నయినా సాధించడం సాధ్యమేనన్న నమ్మకం ఏర్పడింది. అలాగని కలాం సాధారణ అర్థంలో వ్యక్తిత్వ వికాస నిపుణుల మాదిరి వ్యవహరించలేదు. గెలిచిన వారిగురించే కాదు... ఓడినవారి చరిత్రలూ చదవమన్నారు. ఆ వైఫల్యాలనుంచి గుణపాఠాలు తీసుకోమన్నారు. పడటం కాదు...పడి లేవకపోవడం వైఫల్యమవుతుం దన్నారు. వ్యామోహాన్ని కాక వ్యక్తిత్వాన్ని...అసహనాన్ని కాక ఆలోచనాత్మక ధోరణిని అలవర్చుకోవాలన్నది ఆయన సందేశాల సారాంశం. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల యువత ఆయన మాటలతో మంత్రముగ్ధమైంది. అంతటా దాని ప్రభావం అలుముకుంది. ఆ తరాన్ని మాత్రమే కాదు...తరువాతి తరాలను సైతం చివరి క్షణం వరకూ ప్రభావితం చేస్తూనే ఉన్న అబ్దుల్ కలాం ధన్యజీవి. ఆయనకు ‘సాక్షి’ అంజలి ఘటిస్తున్నది.