![DRDO chief says India can have complete missile system in 4-5 years - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/15/DR-SATHEESH-REDDY.jpg.webp?itok=JSJ_5cPC)
డీఆర్‌డీవో అధ్యక్షుడు సతీశ్ రెడ్డి
న్యూఢిల్లీ: భారత దేశ రక్షణ కోసం పూర్తిస్థాయి క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసేందుకు మరో నాలుగైదు ఏళ్లు పడుతుందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అధ్యక్షుడు డాక్టర్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. డీఆర్‌డీవో రెండు నెలల్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పది క్షిపణులను విజయవంతంగా పరీక్షించిన నేపథ్యంలో సతీశ్‌రెడ్డి ‘ఏఎన్‌ఐ’ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
డీఆర్‌డీవో ప్రస్తుతం దేశ రక్షణ దళాలకు అవసరమైన ఏ రకమైన క్షిపణి వ్యవస్థనైనా తయారు చేసి ఇవ్వగల సత్తా కలిగి ఉందని ఆయన ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఒకవైపు చైనాతో లద్దాఖ్‌లో సరిహద్దు సమస్యలు కొనసాగుతున్న ఈ తరుణంలో డీఆర్‌డీవో అధ్యక్షుడి వ్యాఖ్యలకు ప్రాధాన్యమేర్పడింది. శత్రుదేశాల రాడార్లను గుర్తించి నాశనం చేయగల రుద్రం–1తోపాటు బ్రహ్మోస్, అతిధ్వని క్షిపణి ఆధారిత జలాంతర్గామి వ్యతిరేక వ్యవస్థ, ధ్వనికి ఏడు ఐదారు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగల, అణ్వాయుధ సామర్థ్యమున్న శౌర్య తదితరాలను డీఆర్‌డీవో రెండు నెలల్లో పరీక్షించిన విషయం తెలిసిందే.
ప్రధాని మోదీ ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ నినాదంలో భాగంగా డీఆర్‌డీవో స్వదేశీ ఆయుధ వ్యవస్థల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాము ఒకవైపు క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేస్తూనే ఇంకోవైపు రక్షణ దళాలకు అవసరమైన అత్యాధునిక ఆయుధాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని సతీశ్‌రెడ్డి తెలిపారు. కోవిడ్–19 పరిస్థితుల్లోనూ డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు ఆయుధ వ్యవస్థల తయారీని కొనసాగిస్తున్నారని, ఒక్కో వ్యవస్థ సిద్ధమైన కొద్దీ వాటిని అప్పటికప్పుడు పరీక్షిస్తున్నామని, తద్వారా తయారీ ప్రక్రియను ముందుకు తీసుకు వెళుతున్నామని ఆయన వివరించారు.
పారిశ్రామికవేత్తలకు సాయం
రక్షణ రంగంలో స్వావలంబన సాధించేం దుకు డీఆర్‌డీవో చేస్తున్న కృషికి దేశీ పారిశ్రామిక వేత్తలూ తమవంతు సహకారం అందిస్తున్నారని సతీశ్‌రెడ్డి తెలిపారు. రక్షణ అవసరాలకు తగ్గట్టుగా వ్యవస్థలను డిజైన్ చేయడంతోపాటు అభివృద్ధి చేయగలుగుతున్నారని చెప్పారు. పారిశ్రామివేత్తలను ప్రోత్సహించేందుకు టెక్నాలజీ నిధి ఒకదాన్ని ఏర్పాటు చేయడంతోపాటు వారు పరీక్షలు జరిపేందుకు డీఆర్‌డీవో పరిశోధన శాలను వారి అందుబాటులో ఉంచామని వివరించారు. రక్షణ దళాల కోసం అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేసేందుకు డీఆర్‌డీవో చాలా కాలంగా ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే రెండు నెలల్లో అనేక క్షిపణి వ్యవస్థల పరీక్షలు జరిగాయని తెలిపారు. క్షిపణులు, రాడార్లు, ఎలక్ట్రానిక్స్ యుద్ధం, టొర్పెడోలు, తుపాకులు, సమాచార వ్యవస్థ తదితర అంశాల్లో భారతదేశం పూర్తిస్థాయి స్వావలంబన సాధించిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment