Dr. G. Satish Reddy
-
కలాం స్ఫూర్తితో అంతరిక్ష విజయాలు
ఆత్మకూరు రూరల్: దివంగత రాష్ట్రపతి, అగ్రశ్రేణి క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో భారత రక్షణ శాఖ అంతరిక్ష విజయాలు సాధిస్తోందని భారత రక్షణ శాఖ శాస్త్ర, సాంకేతిక సలహాదారు డాక్టర్ గుండ్రా సతీష్‌రెడ్డి అన్నారు. గత నెల 30 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు అమెరికాలోని డల్లాస్‌లో ప్రవాస భారతీయులు, జేఎన్టీయూ నిపుణులు ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఆర్డీవోలో తన ప్రస్థానం గురించి వివరించారు. అబ్దుల్ కలాం శిష్యుడిగా డీఆర్డీవోలో పెద్ద లక్ష్యాలను ఏర్పచుకుని వాటిని సాధించడం కోసం సహచర శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసి ఘన విజయాలు సాధించామన్నారు. గత 8 ఏళ్లుగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన పరిశోధనల ఫలితంగా భారతదేశ రక్షణ వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. దేశ రక్షణకు అవసరమైన ఆయుధాలు, క్షిపణులు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకుని అగ్రరాజ్యాల సరసన చేరామన్నారు. ప్రపంచ శాంతి కోసం తన బలాన్ని, బలగాన్ని భారతదేశం వినియోగిస్తోందని సతీష్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శాస్త్రవిజ్ఞానం అభివృద్ధికి అంకితభావంతో సతీష్‌రెడ్డి చేసిన పరిశోధనలను పలువురు వక్తలు ప్రశంసించారు. అనంతరం సతీష్‌రెడ్డిని అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు అయిన టాంటెక్స్, తానా, నాటా, నాట్స్, ఆట సంస్థల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాటా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి కోర్సిపాటి, ఆయా సంఘాల నాయకులు చిల్లకూరి గోపిరెడ్డి, అజయ్ కలువ, ఉప్పలపాటి కృష్ణారెడ్డి, బలరామ్, భీమా, భాస్కర్‌రెడ్డి, సురేష్, రంగారావు, శ్రీనివాసరాజు, శ్రీనివాసమూర్తి, పులి సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాలుగైదేళ్లలో సంపూర్ణ క్షిపణి వ్యవస్థ
న్యూఢిల్లీ: భారత దేశ రక్షణ కోసం పూర్తిస్థాయి క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసేందుకు మరో నాలుగైదు ఏళ్లు పడుతుందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధ్యక్షుడు డాక్టర్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. డీఆర్డీవో రెండు నెలల్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పది క్షిపణులను విజయవంతంగా పరీక్షించిన నేపథ్యంలో సతీశ్‌రెడ్డి ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. డీఆర్డీవో ప్రస్తుతం దేశ రక్షణ దళాలకు అవసరమైన ఏ రకమైన క్షిపణి వ్యవస్థనైనా తయారు చేసి ఇవ్వగల సత్తా కలిగి ఉందని ఆయన ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఒకవైపు చైనాతో లద్దాఖ్‌లో సరిహద్దు సమస్యలు కొనసాగుతున్న ఈ తరుణంలో డీఆర్డీవో అధ్యక్షుడి వ్యాఖ్యలకు ప్రాధాన్యమేర్పడింది. శత్రుదేశాల రాడార్లను గుర్తించి నాశనం చేయగల రుద్రం–1తోపాటు బ్రహ్మోస్, అతిధ్వని క్షిపణి ఆధారిత జలాంతర్గామి వ్యతిరేక వ్యవస్థ, ధ్వనికి ఏడు ఐదారు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగల, అణ్వాయుధ సామర్థ్యమున్న శౌర్య తదితరాలను డీఆర్డీవో రెండు నెలల్లో పరీక్షించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ నినాదంలో భాగంగా డీఆర్డీవో స్వదేశీ ఆయుధ వ్యవస్థల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాము ఒకవైపు క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేస్తూనే ఇంకోవైపు రక్షణ దళాలకు అవసరమైన అత్యాధునిక ఆయుధాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని సతీశ్‌రెడ్డి తెలిపారు. కోవిడ్–19 పరిస్థితుల్లోనూ డీఆర్డీవో శాస్త్రవేత్తలు ఆయుధ వ్యవస్థల తయారీని కొనసాగిస్తున్నారని, ఒక్కో వ్యవస్థ సిద్ధమైన కొద్దీ వాటిని అప్పటికప్పుడు పరీక్షిస్తున్నామని, తద్వారా తయారీ ప్రక్రియను ముందుకు తీసుకు వెళుతున్నామని ఆయన వివరించారు. పారిశ్రామికవేత్తలకు సాయం రక్షణ రంగంలో స్వావలంబన సాధించేం దుకు డీఆర్డీవో చేస్తున్న కృషికి దేశీ పారిశ్రామిక వేత్తలూ తమవంతు సహకారం అందిస్తున్నారని సతీశ్‌రెడ్డి తెలిపారు. రక్షణ అవసరాలకు తగ్గట్టుగా వ్యవస్థలను డిజైన్ చేయడంతోపాటు అభివృద్ధి చేయగలుగుతున్నారని చెప్పారు. పారిశ్రామివేత్తలను ప్రోత్సహించేందుకు టెక్నాలజీ నిధి ఒకదాన్ని ఏర్పాటు చేయడంతోపాటు వారు పరీక్షలు జరిపేందుకు డీఆర్డీవో పరిశోధన శాలను వారి అందుబాటులో ఉంచామని వివరించారు. రక్షణ దళాల కోసం అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేసేందుకు డీఆర్డీవో చాలా కాలంగా ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే రెండు నెలల్లో అనేక క్షిపణి వ్యవస్థల పరీక్షలు జరిగాయని తెలిపారు. క్షిపణులు, రాడార్లు, ఎలక్ట్రానిక్స్ యుద్ధం, టొర్పెడోలు, తుపాకులు, సమాచార వ్యవస్థ తదితర అంశాల్లో భారతదేశం పూర్తిస్థాయి స్వావలంబన సాధించిందని చెప్పారు. -
సైన్స్‌లో బోలెడు అవకాశాలు
♦ ఏటా వేల ఫెలోషిప్‌లు ఇస్తున్నాం ♦ సైన్స్‌కు ప్రోత్సాహమిచ్చేందుకు అనేక పథకాలు ♦ రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి ♦ సైన్స్ డే సందర్భంగా ‘సాక్షి’కి ఇంటర్వ్యూ సాక్షి, హైదరాబాద్: దేశంలో సైన్స్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్న వాదన వాస్తవం కాదని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల యువతలో చాలా మంది ఐటీ రంగంవైపు ఆకర్షితులవుతున్నా గత ఏడెనిమిదేళ్లుగా సైన్స్కూ ఆదరణ పెరుగుతోందన్నారు. సైన్స్ రంగంలోని ఉపాధి అవకాశాల గురించి చాలామందికి తెలియదని, ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందని ఆయన చెప్పారు. ఆదివారం జాతీయ సైన్స్ డే (ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ సీవీ రామన్ లైట్ స్కాటరింగ్ ప్రభావాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రోజిది) సందర్భంగా సతీశ్‌రెడ్డితో ‘సాక్షి’ జరిపిన ఇంటర్వ్యూ వివరాలు... ప్రశ్న: ప్రస్తుత ఐటీ ప్రపంచంలో సైన్స్ పరిస్థితి ఏమిటి? జవాబు: ప్రస్తుతం ఐటీలో అవకాశాలు ఎక్కువగా ఉన్నందున చదివిన సబ్జెక్ట్‌తో సంబంధం లేకున్నా చాలా మంది యువతీ యువకులు ఈ రంగం వైపు వెళుతున్నారు. ప్ర: సైన్స్‌ను అభివృద్ధి చేసేందుకు, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి? జ: ఇస్రో, డీఆర్డీవో, సీఎస్ఐఆర్లతోపాటు యూనివర్సిటీల ద్వారా కేంద్రం ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టి పరిశోధనలకు ఊతమిచ్చే ప్రయత్నం చేస్తోంది. సీఎస్ఐఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారానే ఏటా కొన్ని వేల పీహెచ్డీ ఫెలోషిప్‌లు అందిస్తున్నాం. పీహెచ్డీ తర్వాత ఈ విద్యార్థులు అదే పరిశోధనశాలల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. సైన్స్ జాబ్స్‌కు ప్రచా రం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్ర: అంతర్జాతీయ స్థాయిలో సైన్స్ రంగంలో దేశ స్థానం ఏమిటి? జ: దేశంలో 1985 నుంచి 2007-08 వరకు విద్యార్థుల్లో సైన్స్ వైపు తగ్గుతూ వచ్చిన ఆసక్తి ఆ తరువాత నుంచి పెరుగుతోంది. అయితే విశ్వవిద్యాలయాల్లో సైన్స్ కోర్సులకు తొలి ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి రావాలి. మరో 3-4 ఏళ్లలో 10-15% మంది విద్యార్థులు సైన్స్ కోర్సుల్లో చేరతారనుకుంటున్నా. ప్ర: శాస్త్రీయ సలహాదారుగా రక్షణ మంత్రికి ఎలాంటి సలహాలిస్తూంటారు? జ: దేశ సైనిక, ఆయుధ సంపత్తి పరిస్థితిని సమీక్షించడం, ప్రపంచ దేశాల పోకడలను గుర్తిస్తూ చేయాల్సిన పరిశోధనలు, ఇవ్వాల్సిన ప్రాధాన్యతలు, పరికరాల స్వీయ తయారీ/దిగుమతులు వంటి అంశాలపై మంత్రికి సలహాలిస్తుంటాం. స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ప్ర: రక్షణ రంగంలో తక్షణం చేపట్టాల్సిన చర్యలున్నాయా? జ: రెండేళ్లలో క్షిపణులను పూర్తిస్థాయిలో మనం తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది. తేలికపాటి యుద్ధవిమానం తేజస్ విషయమూ ఇంతే. వచ్చే 5-10 ఏళ్లలో దిగుమతులను 60-70% వరకూ తగ్గించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ప్ర: ఆయుధ కొనుగోళ్లకు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసే పరిస్థితి వస్తుందా? జ: ఆకాశ్ క్షిపణిపై పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. బహ్రెయిన్‌లో జరిగిన ఎయిర్‌షోలో తొలిసారి తేజస్‌ను ప్రదర్శించాం. చాలా మంది దీని కొనుగోలుకు ముందుకొచ్చారు. ఐదేళ్లలో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆయుధాల సరఫరాదారుగా భారత్‌ను చూస్తాయి. ప్ర: ఎలక్ట్రానిక్ వార్ఫేర్కు దేశం ఎంతవరకు సిద్ధంగా ఉంది? జ: ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విషయంలో మనం చాలా బలంగా ఉన్నాం. త్రివిధ దళాలకు సొంతంగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను అభివృద్ధి చేశాం. అత్యాధునిక వ్యవస్థల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డీఎల్ఆర్ఎల్ ప్రయత్నాలు సాగిస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాదికల్లా మనదైన ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. -
పరిశోధన తీరుతెన్నులు మారాలి
సాక్షి, హైదరాబాద్: రక్షణ, అంతరిక్ష రంగాల్లో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పరిశోధనశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా సంసిద్ధం కావాలని రక్షణ మంత్రి శాస్త్రీ య సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. డీఆర్డీవో వంటి పరిశోధనశాలలు రీసెర్చ్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని, తయా రీ రంగంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా సొంతంగా రీసెర్చ్ పనులు చేపట్టడం ఎంతైనా అవసరమని చెప్పారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ) వ్యవస్థాపక దినోత్సవానికి సతీశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎన్ఎఫ్సీ తన 42 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో రికార్డులు సృష్టించిందని, సామర్థ్యం కంటే 50 శా తం ఎక్కువ అణు ఇంధన బండిళ్లను తయారు చేయడం దేశానికి గర్వకారణమన్నారు. మూడేళ్లలో యాంటీట్యాంక్ మిస్సైల్... రక్షణరంగంలో స్వావలంబన దిశగా రెండు మూడేళ్లలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి న యాంటీట్యాంక్ మిస్సైల్‌ను జాతికి అంకి తం చేసే అవకాశముందని సతీశ్‌రెడ్డి తెలిపా రు. కేంద్రప్రభుత్వ ఆఫ్సెట్ విధానాల కారణం గా రక్షణ రంగంలో దేశీ కంపెనీలకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయని, నాణ్యమైన ఉత్పత్తుల తో ఉపయోగించుకోవాలని సూచించారు. సహజ వనరులన్నింటిపై సమగ్ర విధానాన్ని రూపొందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. 1252 టన్నుల అణు ఇంధనం 2014 - 15 సంవత్సరానికిగాను తాము 1252 టన్నుల అణు ఇంధన బండిళ్లను తయారు చేసి ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకున్నామని ఎన్ఎఫ్సీ సీఎండీ డాక్టర్ ఎన్.సాయిబాబా తెలిపారు. సంస్థ ఉత్పాదక సామర్థ్యం 850 టన్నులు మాత్రమే అయినప్పటికీ ఈ ఘనత సాధించడం విశేషమన్నారు. కార్యక్రమంలో అటామిక్ మినరల్స్ డివిజన్ డెరైక్టర్ పి.ఎస్.పరిహార్, ఈసీఐఎల్ సీఎండీ డాక్టర్ పి.సుధాకర్, ఎన్ఎఫ్సీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్.గోవర్ధన్‌రావు తదితరులు పాల్గొన్నారు.