సైన్స్‌లో బోలెడు అవకాశాలు
♦ ఏటా వేల ఫెలోషిప్‌లు ఇస్తున్నాం
♦ సైన్స్‌కు ప్రోత్సాహమిచ్చేందుకు అనేక పథకాలు
♦ రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి
♦ సైన్స్ డే సందర్భంగా ‘సాక్షి’కి ఇంటర్వ్యూ
సాక్షి, హైదరాబాద్: దేశంలో సైన్స్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్న వాదన వాస్తవం కాదని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల యువతలో చాలా మంది ఐటీ రంగంవైపు ఆకర్షితులవుతున్నా గత ఏడెనిమిదేళ్లుగా సైన్స్‌కూ ఆదరణ పెరుగుతోందన్నారు. సైన్స్ రంగంలోని ఉపాధి అవకాశాల గురించి చాలామందికి తెలియదని, ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందని ఆయన చెప్పారు. ఆదివారం జాతీయ సైన్స్ డే (ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ సీవీ రామన్ లైట్ స్కాటరింగ్ ప్రభావాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రోజిది) సందర్భంగా సతీశ్‌రెడ్డితో ‘సాక్షి’ జరిపిన ఇంటర్వ్యూ వివరాలు...
ప్రశ్న: ప్రస్తుత ఐటీ ప్రపంచంలో
సైన్స్ పరిస్థితి ఏమిటి?
జవాబు: ప్రస్తుతం ఐటీలో అవకాశాలు ఎక్కువగా ఉన్నందున చదివిన సబ్జెక్ట్‌తో సంబంధం లేకున్నా చాలా మంది యువతీ యువకులు ఈ రంగం వైపు వెళుతున్నారు.
ప్ర: సైన్స్‌ను అభివృద్ధి చేసేందుకు, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి?
జ: ఇస్రో, డీఆర్‌డీవో, సీఎస్‌ఐఆర్‌లతోపాటు యూనివర్సిటీల ద్వారా కేంద్రం ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టి పరిశోధనలకు ఊతమిచ్చే ప్రయత్నం చేస్తోంది. సీఎస్‌ఐఆర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారానే ఏటా కొన్ని వేల పీహెచ్‌డీ ఫెలోషిప్‌లు అందిస్తున్నాం. పీహెచ్‌డీ తర్వాత ఈ విద్యార్థులు అదే పరిశోధనశాలల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. సైన్స్ జాబ్స్‌కు ప్రచా రం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ప్ర: అంతర్జాతీయ స్థాయిలో సైన్స్ రంగంలో
దేశ స్థానం ఏమిటి?
జ: దేశంలో 1985 నుంచి 2007-08 వరకు విద్యార్థుల్లో సైన్స్ వైపు తగ్గుతూ వచ్చిన ఆసక్తి ఆ తరువాత నుంచి పెరుగుతోంది. అయితే విశ్వవిద్యాలయాల్లో సైన్స్ కోర్సులకు తొలి ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి రావాలి. మరో 3-4 ఏళ్లలో 10-15% మంది విద్యార్థులు సైన్స్ కోర్సుల్లో చేరతారనుకుంటున్నా.
ప్ర: శాస్త్రీయ సలహాదారుగా రక్షణ మంత్రికి ఎలాంటి సలహాలిస్తూంటారు?
జ: దేశ సైనిక, ఆయుధ సంపత్తి పరిస్థితిని సమీక్షించడం, ప్రపంచ దేశాల పోకడలను గుర్తిస్తూ చేయాల్సిన పరిశోధనలు, ఇవ్వాల్సిన ప్రాధాన్యతలు, పరికరాల స్వీయ తయారీ/దిగుమతులు వంటి అంశాలపై మంత్రికి సలహాలిస్తుంటాం. స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తాం.
ప్ర: రక్షణ రంగంలో తక్షణం చేపట్టాల్సిన
చర్యలున్నాయా?
జ: రెండేళ్లలో క్షిపణులను పూర్తిస్థాయిలో మనం తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది. తేలికపాటి యుద్ధవిమానం తేజస్ విషయమూ ఇంతే. వచ్చే 5-10 ఏళ్లలో దిగుమతులను 60-70% వరకూ తగ్గించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.
ప్ర: ఆయుధ కొనుగోళ్లకు ప్రపంచ దేశాలు
భారత్ వైపు చూసే పరిస్థితి వస్తుందా?
జ: ఆకాశ్ క్షిపణిపై పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. బహ్రెయిన్‌లో జరిగిన ఎయిర్‌షోలో తొలిసారి తేజస్‌ను ప్రదర్శించాం. చాలా మంది దీని కొనుగోలుకు ముందుకొచ్చారు. ఐదేళ్లలో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆయుధాల సరఫరాదారుగా భారత్‌ను చూస్తాయి.
ప్ర: ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌కు
దేశం ఎంతవరకు సిద్ధంగా ఉంది?
జ: ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ విషయంలో మనం చాలా బలంగా ఉన్నాం. త్రివిధ దళాలకు సొంతంగా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలను అభివృద్ధి చేశాం. అత్యాధునిక వ్యవస్థల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డీఎల్‌ఆర్‌ఎల్ ప్రయత్నాలు సాగిస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాదికల్లా మనదైన ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది.