Science Day
-
ఆమె'కు అవకాశమిస్తే.. సైన్స్ కు ఆకాశమే హద్దు
(రమేష్ గోగికారి): ‘ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం’ అంటూ ఎన్నో ఉపోద్ఘాతాలు.. రిజర్వేషన్ల కోసం పోరాటాలు.. ఎంతో కొంత మార్పు.. అయినా ఏదో వెలితి. కొన్ని రంగాలకే, ఓ స్థాయి వరకే మహిళలు పరిమితమవుతున్న పరిస్థితి. సైన్స్–టెక్నాలజీ రంగాల్లో, పరిశోధనల్లో వారు చాలా తక్కువ. మరి మహిళల మేధాశక్తి ఏమైనా తక్కువా? పురుషులతో సమానంగానేకాదు.. ఒకింత ఎక్కువే చేసి చూపగలమని నిరూపించిన మేరీ క్యూరీ వంటి శాస్త్రవేత్తలు ఎందరో. మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్నప్పుడే ఇంత సాంకేతికత, అభివృద్ధి జరుగుతుంటే.. ‘ఆమె’ తోడుంటే ఇంకెంత గొప్ప ఆవిష్కరణలు వస్తాయో, మరెంత అభివృద్ధి సాధ్యమో. చేయాల్సిందల్లా.. ‘ఆమె’కు అవకాశమివ్వడమే. రెండేళ్లపాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మొదలు.. భవిష్యత్తుపై భయం రేపుతున్న వాతావరణ మార్పుల (క్లైమేట్ చేంజ్) వరకు ఎన్నో సవాళ్లు. వాటిని ఎదుర్కొనే మార్గాలు, పరిష్కారాలను చూపగలిగేది సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రస్తుతం అత్యుత్తమ నైపుణ్యమున్న పరిశోధకుల కొరత ఈ రంగాలను వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో ఆదుకోగలిగినది మహిళా శక్తే. ఇన్నాళ్లూ బాలికలు, మహిళలకు విద్యలో, అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక.. వారిలోని సామర్థ్యం వృథాగా పోతోంది. వారికి తగిన అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే.. ఆకాశమే హద్దుగా వినూత్నమైన, విభిన్నమైన, అత్యాధునిక ఆలోచనలు, సాంకేతికతలను సృష్టించడం, అభివృద్ధి చేయడం వీలవుతుందనేది నిపుణుల మాట. ఇందుకోసం విద్యా రంగంలో బాలికలకు సమాన అవకాశాలు దక్కేలా చూడాలని.. శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల్లో వారి సామర్థ్యాన్ని వెలికితీసేలా చర్యలు చేపట్టాలని వారు సూచిస్తున్నారు. మేరీ క్యూరీకి నివాళిగా..: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం కోసం ‘మహిళలకు సైన్స్ కావాలి.. సైన్స్‌కు మహిళలు కావాలి’ అని ‘ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక విభాగం (యునెస్కో)’ నినాదం ఇచ్చింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ జయంతి అయిన ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా నిర్వహించాలని 2015లో నిర్ణయించింది. సైన్స్–టెక్నాలజీ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ‘స్టెమ్’ రంగాల్లో ప్రోత్సాహం అవసరం: దశాబ్దాల ఎదురుచూపుల తర్వాత మన పార్లమెంటు ‘మహిళా రిజర్వేషన్ల బిల్లు’ను ఆమోదించింది. అది చట్టరూపమూ దాలి్చంది. ‘నారీ శక్తి’ అంటూ కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే రోజున త్రివిధ దళాల్లో మహిళాశక్తిని చాటింది. ఈ ‘నారీ శక్తి’ మరింత విస్తృతమై ‘స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడికల్)’ రంగాల్లో సత్తా చాటితే.. దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. ప్రపంచగతిని మార్చిన మహిళా శాస్త్రవేత్తలు మరెందరో... ►1910వ దశాబ్దంలోనే కుష్టు రోగానికి చికిత్సను కనుగొన్న అలైస్ అగస్టా బాల్.. ►సూర్యుడు సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువభాగం హైడ్రోజన్, హీలియంతోనే నిండి ఉన్నాయని తొలిగా ప్రతిపాదించిన బ్రిటీష్–అమెరికన్ అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పేన్ గాపోష్కిన్..∙అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తమ ప్రయోగాల్లో కంప్యూటర్లను వినియోగించడానికి ముందు.. స్పేస్ ప్రయోగాల సమయాన్ని, వాటి ప్రయాణతీరును కచ్చితంగా గణించి చెప్పిన ‘హ్యూమన్ కంప్యూటర్’ కేథరిన్ జాన్సన్..∙ఇన్సూలిన్, పెన్సిలిన్, విటమిన్ బీ12 వంటి బయోరసాయనాల అణు నిర్మాణాన్ని ఎక్స్–రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేసిన డొరోతీ హాడ్కిన్ (ఇన్సూలిన్ వంటి బయో మాలిక్యూల్స్‌ను కృత్రిమంగా తయారు చేయడానికి ఈ విధానం తోడ్పడింది). మన దేశం నుంచీ ఎందరో.. ►మొక్కల కణాల్లో శక్తి ఉత్పాదనకు కీలకమైన ‘సైటోక్రోమ్ సీ’ అనే ఎంజైమ్‌ను గుర్తించిన మధ్యప్రదేశ్ శాస్త్రవేత్త కమలా సొహోనీ ►కేన్సర్‌ను నిరోధించే ‘వింకా ఆల్కలాయిడ్స్’, మలేరియా చికిత్స కోసం వాడే ఔషధాలపై పరిశోధన చేసిన రసాయన శాస్త్రవేత్త అసిమా చటర్జీ (పశ్చిమబెంగాల్).. ►మైక్రోవేవ్ పరికరాలపై పరిశోధన చేసి, మన దేశంలో తొలి మైక్రోవేవ్ రీసెర్చ్ ల్యాబ్ నెలకొలి్పన శాస్త్రవేత్త రాజేశ్వరి చటర్జీ (కర్ణాటక).. ఇటీవలి కాలాన్ని చూస్తే.. ►కోవిడ్ వైరస్ ధాటిని ముందే గుర్తించి హెచ్చరించిన భారత శాస్త్రవేత్త, డబ్ల్యూహెచ్ఓ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్.. ►పుణె వైరాలజీ ల్యాబ్‌లో కోవిడ్ వైరస్‌ను ఐసోలేట్ చేసి..కోవ్యాక్సిన్ రూపకల్పనకు మార్గం వేసిన ల్యాబ్ డైరెక్టర్ ప్రియా అబ్రహం.. ►అగ్ని–4,5 క్షిపణుల రూపకల్పన ప్రాజెక్టుకు హెడ్‌గా వ్యవహరించిన శాస్త్రవేత్త టెస్సీ థామస్.. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఈ రంగంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ తీరు సమాజానికి నష్టం మహిళలకు సైన్స్‌లో తగిన అవకాశాలొస్తే అద్భుతాలు సృష్టించగలరు. కానీ సమాజంలో మహిళలను డాక్టర్లు, టీచర్లు వంటి కొన్ని రంగాలవైపే మళ్లిస్తున్నారు. వినూత్న ఆలోచనలను, ఆవిష్కరణలను, అభివృద్ధి చెందే అవకాశాలను సమాజం కోల్పోతోంది. బాలికల్లో స్కూల్ స్థాయి నుంచే సైన్స్ పట్ల ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తున్నాం. – మర్లిన్ మనాస్, ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ తగిన ప్రోత్సాహం కావాలి నాకు సైన్స్, మేథమేటిక్స్ అంటే చాలా ఇష్టం. ఈ సబ్జెక్టుల్లో అన్ని అంశాలను ఆకళింపు చేసుకుని చదువుతున్నా.. భవిష్యత్తులో పరిశోధనలు చేసి, సమాజానికి పనికొచ్చే ఆవిష్కరణలు చేయాలని ఉంది. తగిన ప్రోత్సాహం అందిస్తే సాధిస్తానన్న నమ్మకముంది. – కేఎన్ శ్రీచరణి, ఇంటర్ ఫస్టియర్, మొయినాబాద్ ‘నోబెల్’కే ఘనతనిచ్చిన మేరీ క్యూరీ ఆధునిక ఫిజిక్స్ రూపునిచ్చిన శాస్త్రవేత్తల్లో మేరీ క్యూరీ ఒకరు. రెండు వేర్వేరు రంగాల్లో నోబెల్ పొందిన ఏకైక శాస్త్రవేత్త ఆమె. రేడియో ధార్మిక మూలకాలైన రేడియం, పోలోనియంలను క్యూరీ గుర్తించారు. ఆ రేడియం పేరు మీదుగానే రేడియేషన్ పదం పుట్టింది. ఈ పరిశోధనకుగాను 1903లో ‘ఫిజిక్స్ నోబెల్’ అందుకున్నారు. తర్వాత కెమిస్ట్రీలో పరిశోధనకు 1911లో ‘కెమిస్ట్రీ నోబెల్’ పొందారు. తన పరిశోధనల సమయంలో క్యూరీ ఎంతగా రేడియేషన్‌కు గురయ్యారంటే..ఆమె రాసిన నోట్ పుస్తకాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది. అణుశక్తికి మార్గం చూపిన చీన్ షుంగ్ వు చైనాలో పుట్టినా అమెరికాలో స్థిరపడి అణుశక్తికి బాటలు వేసిన శాస్త్రవేత్త చీన్ షుంగ్ వు. అణుబాంబుల తయారీ కోసం ‘మాన్ హట్టన్ ప్రాజెక్టు’లో ఆమె కీలకపాత్ర పోషించారు. రసాయనిక ప్రక్రియల ద్వారా యురేనియం ఉత్పత్తి చేసే విధానాన్ని ఆవిష్కరించారు. కంప్యూటర్‌కు ‘భాష’ నేర్పిన గ్రేస్ హోపర్ తొలి ఎ ల్రక్టానిక్–డిజిటల్ కంప్యూటర్ ‘యూనివాక్’ ను రూపొందించిన బృందంలో కీలక పాత్ర పోషించింది అమెరికన్ శాస్త్రవేత్త గ్రేస్ హోపర్. ‘బైనరీ’ భాషలోకి మార్చే తొలి కంపైలర్ ప్రోగ్రామ్‌ను రూపొందించినది ఆమెనే. ‘కోబాల్’ ప్రోగ్రామ్ రూపకల్పనలోనూ ఈమెది కీలకపాత్రే. (యునెస్కో గణాంకాల ప్రకారం..) ►ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులలో మహిళల శాతం:33.3% చూడటానికి ఈ శాతం ఓ మోస్తరుగానే ఉన్నా.. కొన్ని విభాగాల్లోనే మహిళలకు అవకాశాలు అందుతున్నాయి. మహిళా పరిశోధకులకు సమాన అవకాశాలిస్తున్న దేశాలు: 30 ► చాలా దేశాల్లో మహిళా పరిశోధకుల సంఖ్య అతి తక్కువ. కీలక పరిశోధనలు చేసే అవకాశం, నిధుల వంటి అంశాల్లో వివక్షే ఎదురవుతోంది. ‘స్టెమ్’ విభాగాల్లోని విద్యార్థుల్లో మహిళలు: 35% ► మెడికల్, కొంతవరకు టెక్నాలజీ రంగంలోనే మహిళలు ఎక్కువ. తల్లిదండ్రులు, ఫ్యాకల్టీ ఈ రంగాల దిశగా బాలికలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు నోబెల్ పొందిన మహిళలు: 22 మంది ► పరిశోధన రంగంలో మహిళల భాగస్వామ్యం పెరిగినా.. ఉన్నతస్థాయి పోస్టులు, ప రిశోధక బృందాలకు నేతృత్వం వహించే అవకాశాలు తక్కువ. దీనితో మంచి ప్రతిభ ఉన్నా అవార్డులకు, గుర్తింపునకు నోచుకోవడం లేదు. ఈ తీరు సమాజానికి నష్టం మహిళలకు సైన్స్‌లో తగిన అవకాశాలొస్తే అద్భుతాలు సృష్టించగలరు. కానీ సమాజంలో మహిళలను డాక్టర్లు, టీచర్లు వంటి కొన్ని రంగాలవైపే మళ్లిస్తున్నారు. వినూత్న ఆలోచనలను, ఆవిష్కరణలను, అభివృద్ధి చెందే అవకాశాలను సమాజం కోల్పోతోంది. బాలికల్లో స్కూల్ స్థాయి నుంచే సైన్స్ పట్ల ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తున్నాం. – మర్లిన్ మనాస్, ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ తగిన ప్రోత్సాహం కావాలి నాకు సైన్స్, మేథమేటిక్స్ అంటే చాలా ఇష్టం. ఈ సబ్జెక్టుల్లో అన్ని అంశాలను ఆకళింపు చేసుకుని చదువుతున్నా.. భవిష్యత్తులో పరిశోధనలు చేసి, సమాజానికి పనికొచ్చే ఆవిష్కరణలు చేయాలని ఉంది. తగిన ప్రోత్సాహం అందిస్తే సాధిస్తానన్న నమ్మకముంది. – కేఎన్ శ్రీచరణి, ఇంటర్ ఫస్టియర్, మొయినాబాద్ నేడు (ఫిబ్రవరి 11న) ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’ సందర్భంగా.. -
సైన్స్ డే స్పెషల్ స్టోరీ
-
ఘనంగా సైన్స్ డే
► ఆకట్టుకున్న విద్యార్థుల సైన్స్ ప్రదర్శనలు ► క్విజ్‌పోటీలు, సెమినార్లు కర్నూలు సిటీ: నగరంలోని వివిధ పాఠశాలల్లో మంగళవారం జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులకు సైన్స్‌పై క్విజ్, సెమినార్ తదితర పోటీలు నిర్వహించారు. తర్వాత సీవీ రామన్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయా స్కూళ్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ దేశాభివృద్ధి సైన్స్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతికత పరిజ్ఞానం పెంచేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. స్థానిక ఏక్యాంపులోని మాంటిస్సోరి స్కూల్లో జరిగిన సైన్స్‌డేలో ఆ స్కూల్ డైరెక్టర్ రాజశేఖర్, హెచ్ఎంలు శశికళ, రమాజ్యోతి, కో–ఆర్డినేటర్లు. శ్రీసాయికృష్ణ విద్యానికేతన్, బచపన్లో ఆ స్కూల్ డైరెక్టర్లు గోవర్ధన్‌రెడ్డి, మీనా, కౌన్సిలర్ వందనరాణి, శ్రీలక్ష్మి విద్యాసంస్థల్లో హెచ్ఎం మాధవీలత, డైరెక్టర్ విష్ణుప్రియ, వైస్ చైర్మన్ శివ అనురాగ్, ప్రిన్సిపాల్ నయిషా తస్నీమ్, తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ కాలనీలోని భాష్యం స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎక్స్పో కార్యక్రమానికి అతిథిగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ అధ్యాపకుడు గోవిందురాజులు హాజరై మాట్లాడారు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ రాంప్రసాద్, జోనల్ ఇన్చార్జ్ అనిల్ కుమార్, లిటిల్ చాంప్స్ ఇన్చార్జీ మాధవీలత. చెకుముకి సైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక రాయలసీమ మోడల్ హైస్కూల్లో నిర్వహించిన సైన్స్‌డేలో జనవిజ్ఞాన వేదిక సాంకేతిక కన్వీనర్ విజయ్‌కుమార్, హెచ్ఎం సరయు సత్యవాణి, స్థానిక ఎన్ఆర్ పేట భాష్యం స్కూల్లో ఆర్‌ఎంఎస్‌ఏ డిప్యూటీ డీఈఓ మౌలాలి, జోనల్ ఇన్చార్జ్ అనిల్‌కుమార్, హెచ్ఎం రమేష్, చిల్డ్రన్ పార్క్ దగ్గర ఉన్న సెయింట్ జోసెఫ్ స్కూల్లో టీచర్లు పాల్గొన్నారు. -
సైన్స్‌లో బోలెడు అవకాశాలు
♦ ఏటా వేల ఫెలోషిప్‌లు ఇస్తున్నాం ♦ సైన్స్‌కు ప్రోత్సాహమిచ్చేందుకు అనేక పథకాలు ♦ రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి ♦ సైన్స్ డే సందర్భంగా ‘సాక్షి’కి ఇంటర్వ్యూ సాక్షి, హైదరాబాద్: దేశంలో సైన్స్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్న వాదన వాస్తవం కాదని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల యువతలో చాలా మంది ఐటీ రంగంవైపు ఆకర్షితులవుతున్నా గత ఏడెనిమిదేళ్లుగా సైన్స్కూ ఆదరణ పెరుగుతోందన్నారు. సైన్స్ రంగంలోని ఉపాధి అవకాశాల గురించి చాలామందికి తెలియదని, ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందని ఆయన చెప్పారు. ఆదివారం జాతీయ సైన్స్ డే (ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ సీవీ రామన్ లైట్ స్కాటరింగ్ ప్రభావాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రోజిది) సందర్భంగా సతీశ్‌రెడ్డితో ‘సాక్షి’ జరిపిన ఇంటర్వ్యూ వివరాలు... ప్రశ్న: ప్రస్తుత ఐటీ ప్రపంచంలో సైన్స్ పరిస్థితి ఏమిటి? జవాబు: ప్రస్తుతం ఐటీలో అవకాశాలు ఎక్కువగా ఉన్నందున చదివిన సబ్జెక్ట్‌తో సంబంధం లేకున్నా చాలా మంది యువతీ యువకులు ఈ రంగం వైపు వెళుతున్నారు. ప్ర: సైన్స్‌ను అభివృద్ధి చేసేందుకు, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి? జ: ఇస్రో, డీఆర్డీవో, సీఎస్ఐఆర్లతోపాటు యూనివర్సిటీల ద్వారా కేంద్రం ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టి పరిశోధనలకు ఊతమిచ్చే ప్రయత్నం చేస్తోంది. సీఎస్ఐఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారానే ఏటా కొన్ని వేల పీహెచ్డీ ఫెలోషిప్‌లు అందిస్తున్నాం. పీహెచ్డీ తర్వాత ఈ విద్యార్థులు అదే పరిశోధనశాలల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. సైన్స్ జాబ్స్‌కు ప్రచా రం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్ర: అంతర్జాతీయ స్థాయిలో సైన్స్ రంగంలో దేశ స్థానం ఏమిటి? జ: దేశంలో 1985 నుంచి 2007-08 వరకు విద్యార్థుల్లో సైన్స్ వైపు తగ్గుతూ వచ్చిన ఆసక్తి ఆ తరువాత నుంచి పెరుగుతోంది. అయితే విశ్వవిద్యాలయాల్లో సైన్స్ కోర్సులకు తొలి ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి రావాలి. మరో 3-4 ఏళ్లలో 10-15% మంది విద్యార్థులు సైన్స్ కోర్సుల్లో చేరతారనుకుంటున్నా. ప్ర: శాస్త్రీయ సలహాదారుగా రక్షణ మంత్రికి ఎలాంటి సలహాలిస్తూంటారు? జ: దేశ సైనిక, ఆయుధ సంపత్తి పరిస్థితిని సమీక్షించడం, ప్రపంచ దేశాల పోకడలను గుర్తిస్తూ చేయాల్సిన పరిశోధనలు, ఇవ్వాల్సిన ప్రాధాన్యతలు, పరికరాల స్వీయ తయారీ/దిగుమతులు వంటి అంశాలపై మంత్రికి సలహాలిస్తుంటాం. స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ప్ర: రక్షణ రంగంలో తక్షణం చేపట్టాల్సిన చర్యలున్నాయా? జ: రెండేళ్లలో క్షిపణులను పూర్తిస్థాయిలో మనం తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది. తేలికపాటి యుద్ధవిమానం తేజస్ విషయమూ ఇంతే. వచ్చే 5-10 ఏళ్లలో దిగుమతులను 60-70% వరకూ తగ్గించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ప్ర: ఆయుధ కొనుగోళ్లకు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసే పరిస్థితి వస్తుందా? జ: ఆకాశ్ క్షిపణిపై పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. బహ్రెయిన్‌లో జరిగిన ఎయిర్‌షోలో తొలిసారి తేజస్‌ను ప్రదర్శించాం. చాలా మంది దీని కొనుగోలుకు ముందుకొచ్చారు. ఐదేళ్లలో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆయుధాల సరఫరాదారుగా భారత్‌ను చూస్తాయి. ప్ర: ఎలక్ట్రానిక్ వార్ఫేర్కు దేశం ఎంతవరకు సిద్ధంగా ఉంది? జ: ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విషయంలో మనం చాలా బలంగా ఉన్నాం. త్రివిధ దళాలకు సొంతంగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను అభివృద్ధి చేశాం. అత్యాధునిక వ్యవస్థల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డీఎల్ఆర్ఎల్ ప్రయత్నాలు సాగిస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాదికల్లా మనదైన ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. -
పరిశోధనారంగాన్ని ప్రోత్సహిస్తాం: ప్రధాని
న్యూఢిల్లీ: పరిశోధనారంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శని వారం శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మన శాస్త్రవేత్తల అంకితభావం, దృఢ సంకల్పం, అలుపెరుగని ప్రయత్నాన్ని గుర్తుచేసుకునే ఉత్సవంగా నేషనల్ సైన్స్‌డేను అభివ ర్ణించారు. విఖ్యాత శాస్త్రవేత్త సీవీ రామన్ మేథస్సుకు, సైన్స్‌కు ఆయన అందించిన సుదీర్ఘ సేవలకు మనం వందనాలర్పించాలన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలే భారత్ భవిష్యత్తును నిర్దేశిస్తాయని, ప్రస్తుతం దేశం ఈ స్థితికి చేరుకోవడంలో ఈ రంగాల పాత్ర చాలా ఉందన్నారు. -
భౌతికశాస్త్ర కాంతిపుంజం
సందర్భం - నేడు జాతీయ సైన్స దినోత్సవం దేశానికి తొలి ‘భారతరత్న’ అయిన సర్ సి.వి.రామన్ అంతకన్నా కూడా ఎక్కువగా మానవరత్న! నోబెల్ సహా ఇంకా ఎన్నో వైజ్ఞానికరంగ హోదాలకు గౌరవం తెచ్చిపెట్టిన ఈ భౌతిక శాస్త్రవేత్త సవినయ సంపన్నుడు. పదహారేళ్లకు డిగ్రీ, తర్వాత రెండేళ్లకు మాస్టర్స్ డిగ్రీ సాధించిన నిరుపేద విద్యార్థి. ఆయనలోని అణకువ, విధేయత ఆయన వైజ్ఞానిక నిరాడంబరతను దాచేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ ఉత్సాహం, ఆ ఉత్తేజం, ఆ కుతూహలం యువశాస్త్రవేత్తల కలలను కాంతిమంతం చేస్తుండేవి. రామన్‌ను మద్రాస్ తీర్చిదిద్దింది, కలకత్తా చేరదీసింది. బెంగుళూరు తనను చేరదీయించుకుంది. ఈ మూడు నగరాలూ రామన్ ప్రభావం నుంచి ఏనాటికీ బయటపడలేవు. ఆ మాటకొస్తే దేశం మొత్తం ఆరు దశాబ్దాలపాటు ఆయన సూత్రాలను అనుసరించి, ఆయన సేవలతో శాస్త్ర సాఫల్యం పొందింది. ‘రామన్ ఎఫెక్ట్’ ఆయన ఆవిష్కరణే. ఏటా మనం ఫిబ్రవరి 28న ‘సైన్స్ డే’ జరుపుకోవడం వెనుక రామన్ ఎఫెక్ట్ ఉంది. సరిగ్గా ఈ రోజునే ఆయన కాంతి ప్రభావ సూత్రాన్ని కనుగొన్నారు. సముద్రపు నీటిపై సూర్యకాంతి పడిన ప్పుడు ఆ కాంతిలోని నీలం రంగు ఎక్కువగా చెల్లాచెదురై, మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందని రామన్ సిద్ధాంతీకరించారు. ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా చెల్లా చెదరవుతాయో తెలిపే పరిశోధన ఫలితమే రామన్ ఎఫెక్ట్ (రామన్ ప్రభావం). మద్రాసులో మాస్టర్స్ డిగ్రీ అయ్యాక తల్లిదండ్రులు, సే్నిహ తులు ఒత్తిడి చేయడంతో రాసిన ఒక పోటీ పరీక్ష... రామన్‌కు కలకత్తాలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఉద్యోగాన్ని సంపాదించి పెట్టింది. వెళ్లాలా వద్దా? అయిన వారి అందరి ప్రాణాలూ రామన్ ఉద్యోగం మీదే ఉన్నాయి. రామన్ ప్రాణాలు మాత్రం భౌతికశాస్త్రంలో ఉన్నాయి. రెండు ప్రాణాలను కాపాడుకోవాలి. అందుకే ఆయన రెండు పడవల మీద కాళ్లు వేశారు. ఉద్యోగం చేస్తూనే, అక్కడి ‘ఇండియన్ అసోషియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్’లో సభ్యుడిగా చేరారు. అక్కడే ఆయనకు కలకత్తా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆశుతోష్ ముఖర్జీతో పరిచయం అయింది. భౌతికశాస్త్ర పరిశోధనాంశాలలో రామన్ ప్రతిభకు ముగ్ధులైన ముఖర్జీ ఆయన్ని కలకత్తా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా నియమించారు. అదే సమయంలో కల్టివేషన్ ఆఫ్ సైన్స్ కార్యద ర్శిగా పదోన్నతిపై అమెరికాలో, ఐరోపా దేశాలలో రామన్ విస్తృతంగా పర్యటించారు. కలకత్తాలో పదిహేనేళ్లు ఉన్నాక బెంగు ళూరులోని భారత విజ్ఞాన శాస్త్ర సంస్థకు డెరైక్టర్ అయ్యారు. పదవీ విరమణ అనంతరం ‘రామన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్’ నెలకొల్పి ఎందరో యువ మేధావుల పరిశోధనలకు ఆయన చేయూతను ఇచ్చారు. రామన్‌కు ఐన్‌స్టీన్, న్యూటన్, రేలీగ్, బోల్జ్మేన్ అభిమాన శాస్త్రవేత్తలు. కాంతి, ధ్వని, స్ఫటికం, వర్ణదర్శనం ఇష్టమైన అంశాలు. ‘‘ఒక దేశం యొక్క నిజమైన సంపద ఆ దేశ ప్రజల మేధాపరమైన, భౌతికమైన బలంలో ఉంది’’ అని విశ్వసించే రామన్, తన జీవితం మొత్తాన్నీ సైన్సు ప్రయోగాలు చేయడానికీ, చేయించడానికీ అంకితం చేశారు. 1888 నవంబర్ 7న మద్రాసు లో జన్మించిన చంద్రశేఖర వెంకటరామన్ 1970 నవ ంబర్ 21న బెంగుళూరులో మరణించారు.